– రిమాండ్ రిపోర్టులో వెల్లడించిన పోలీసులు
హైదరాబాద్,ప్రజాతంత్ర,జూలై 31: సృష్టి యూనివర్సల్ ఫెర్టిలిటీ సెంటర్ ముసుగులో దారుణాలు సాగించిన డాక్టర్ నమ్రత కేసులో అనేక అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఐవీఎఫ్ కోసం వొచ్చిన వారిని సరోగసీ వైపు దారిమళ్లించి లక్షలు దండుకున్నట్లు గుర్తించారు. నమ్రతను ఐదు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన కీలక అంశాలను పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. సరోగసీ చేయకపోయినా చేసినట్లు నమ్మించి పలువురు దంపతులను మోసం చేశారని, ఈ విషయాన్ని డాక్టర్ నమ్రత అంగీకరించారని పేర్కొన్నారు. రాజస్థాన్ దంపతులనూ సరోగసీ విషయంలో మోసం చేసిందని, వాళ్లు డీఎన్‌ఏ పరీక్షల నివేదికలు కావాలని అడగడంతో విషయం బయట పడుతుందని తప్పించుకున్నారని తెలిపారు. కొన్ని రోజుల సమయం ఇస్తే తప్పును సరిదిద్దుతామని వారికి చెప్పారని, వినకపోవడంతో తన కుమారుడితో రాజస్థాన్ దంపతుల్ని బెదిరించారని కూడా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సరోగసీ పేరుతో సృష్టి సెంటర్ చాలా మోసాలు చేసిందని, ఐవీఎఫ్ కోసం వచ్చే వారిని సరోగసీ వైపు మళ్లించి డబ్బులు దోచుకున్నారని, ఏపీలో కొంతమంది ఏఎన్‌ఎంల సహాయం కూడా తీసుకున్నారని, గాంధీ హాస్పిటల్ అనస్థీషియన్ డాక్టర్ సదానందం వీరికి పూర్తిస్థాయిలో సహకరించారని పోలీసులు తెలిపారు.





