సామాజిక సేవ అంటే ఆర్థిక సాయమే కాదు

– సరైన మార్గదర్శనం ద్వారా కూడా మార్పు తేవొచ్చు
– సమాజంలో ఒంటరిగా అభివృద్ధి చెందలేం
– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 30: ఆర్థిక సాయమొక్కటే కాక మన చుట్టూ ఉండే వారి అవసరాలను అర్థం చేసుకోవడం, వారికి మద్దతు ఇవ్వడం, సరైన మార్గదర్శనం చేయడం ద్వారా వారి జీవితాల్లో సానుకూల మార్పును తేవడం కూడా సామాజిక సేవే అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. మానవ జీవితంలో సమాజమే కీలకమని, ఒంటరిగా కాక సామూహికంగానే అభివృద్ధి చెందగలమని అన్నారు. గౌలిదొడ్డిలోని బ్రాహ్మణ సదనంలో సెంటర్‌ ఫర్‌ బ్రాహ్మిణ్‌ ఎక్స్‌లెన్స్‌(సీబీఈ) ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ‘సమాజానికి మనం ఎంత ఇస్తే అది అంతకు రెట్టింపు తిరిగి ఇస్తుంది.. అది ధనం రూపంలో కాకపోయినా ఆత్మ సంతృప్తి రూపంలో, ఆశీర్వాదాల రూపంలో తిరిగి వస్తుంది.. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం నాకు ఎల్లప్పుడూ సంతృప్తినిచ్చే అంశం’ అని చెప్పారు. వర్తమానంలో సమాజం పట్ల మన బాధ్యతలు ఏమిటి.. భవిష్యత్తుకు ఎలా మార్గదర్శనం చేయగలమో తెలుసుకొని ఆ దిశగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఉద్బోధించారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటికే రూ.25 కోట్లు కేటాయించామని, రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు ఇస్తామని, సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తుందని వివరించారు. విద్య, ఉపాధి రంగంలో బ్రాహ్మణ యువతను అత్యున్నతస్థాయికి చేరేలా మార్గనిర్దేశం చేస్తున్న సీబీఈ సేవలు స్ఫూర్తిదాయకమని మంత్రి కొనియాడారు. ఈ సంస్థ ద్వారా సమాజం కోసం తమవంతుగా పాటుపడుతున్న రిటైర్డ్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఉన్నతాధికారులు, ఇతర నిపుణుల కృషి అనిర్వచనీయమన్నారు. యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ సహకారంతో ఈ సంస్థ ద్వారా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సీబీఈ ద్వారా సివిల్స్‌ కోసం సిద్ధమవుతున్న ఐదుగురు అభ్యర్థుల బాధ్యతను స్వీకరించేందుకు ముందుకొచ్చిన ప్రణీత్‌ కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత నరేందర్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మరికొందరు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వాణీదేవి, పురాణం సతీష్‌కుమార్‌, వాలంటే టెక్నాలజీస్‌ సీఈవో, కో ఫౌండర్‌ విజయ్‌ వొద్దిరాజు, ఓబుల్‌రెడ్డి పబ్లిక్‌ స్కూల్‌ చైర్మన్‌ ఎస్‌.రావు, వేణుగోపాలచారి, ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఐవైఆర్‌ కృష్ణారావు, జ్వాలా నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *