– అగ్రసేన్ మహారాజ్ స్ఫూర్తితో రాష్ట్రాభివృద్ది
– అందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు కృషి
– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 :సేవే నిజమైన సంపద అని చాటి చెప్పి న అగ్రసేన్ మహారాజ్ ను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చి దిద్దేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రైతులు, కార్మికులు, మహిళలు, యువతతో సహా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామన్నారు. శంషాబాద్ లో తెలంగాణ అగర్వాల్‌సమాజ్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘5149వ అగ్రసేన్ జయంతి వేడుకల’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ కలిసి వృద్ధి సాధించినప్పుడే నిజమైన పురోగతి సాధ్యమవుతుందని ఈ సందర్భంగా ఆయన వివరించారు. అగ్రసేన్ మహారాజ్ కేవలం పాలకుడు మాత్రమే కాదని, ఒక గొప్ప సామాజిక శిల్పి అని కొనియాడారు. ఆయన ప్రవేశపెట్టిన ‘ఒక ఇటుక, ఒక నాణెం’ సూత్రం ప్రపంచంలోనే మొదటి స్టార్టప్ ఇంక్యుబేటర్ అని పేర్కొన్నారు. సంపదను కొద్దిమందికే పరిమితం చేయకుండా, సమాజంలో పంపిణీ చేసినప్పుడే అభివృద్ధి సాధ్యమని నిరూపించారన్నారు. సమ్మిళిత వృద్ధి, స్టార్టప్‌లు, సామాజిక న్యాయం గురించి ఈరోజు మనం చర్చించుకుంటున్నామంటే అందుకు ఆయన వేల ఏళ్ల కిందట వేసిన మార్గమే కారణమన్నారు. తెలంగాణ అగర్వాల్ సమాజ్ అగ్రసేన్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తుందని ప్రశంసించారు. కార్యక్రమంలో అగర్వాల్ సమాజ్ ప్రెసిడెంట్ అనిరుధ్ గుప్తా, వైస్ ప్రెసిడెంట్ రూపేష్ అగర్వాల్, జనరల్ సెక్రటరీ వికాస్ కేషన్, జాయింట్ సెక్రటరీ డా.సీమ జైన్, ట్రెజరర్ అచల్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





