దిగ్గజ కంపెనీలకు గమ్యస్థానంగా హైదరాబాద్‌

– నగరంలో జాగర్‌ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ ప్రారంభం
– రాబోయే రోజుల్లో 500మందికి ఉపాధి
– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు

హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 3: తెలంగాణను ఏఐ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్గా మార్చడమే తమ ప్రభుత్వ సంకల్పమని, ఆ దిశగా పకడ్బందీ కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. హైటెక్ సిటీలో అమెరికాకు చెందిన ప్రముఖ ఎంటర్‌ప్రైజ్ ప్రొక్యూర్‌మెంట్, సప్లయర్ కొలాబరేషన్ సంస్థ జాగర్ (JAGGAER) గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను బుధవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ‘ఒక్క టెక్నాలజీనే కాకుండా అన్ని రంగాలకు చెందిన ప్రపంచ దిగ్గజ సంస్థలకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారింది. ఈ జాబితాలో జాగర్ కూడా చేరడంతో తెలంగాణ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తం అవుతుంది. కొత్తగా ప్రారంభమైన ఈ జీసీసీ ద్వారా కొత్తగా 180 మందికి ఉపాధి లభిస్తుంది. రాబోయే రోజుల్లో ఆ సంఖ్య 500కు చేరుతుంది’ అని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ‘జాగర్ ఏఐ ప్లాట్ ఫాం, ఏఐ ఆధారిత ప్రొక్యూర్‌మెంట్ పరిష్కారాల అభివృద్ధికి ఈ జీసీసీ ఒక వ్యూహాత్మక కేంద్రంగా పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా తయారీ, విద్య, ఎఫ్‌ఎంసీజీ, రిటైల్ తదితర రంగాలకు సాఫ్ట్‌వేర్, క్లౌడ్ ఆపరేషన్ సేవలను అందిస్తుంది’ అని తెలిపారు. ‘జీసీసీల ఏర్పాటుకు తెలంగాణ అనుకూలం. దేశంలోనే ఎక్కడా లేని విధంగా గతేడాదిలో 70 జీసీసీలు హైదరాబాద్ లో ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది 100 జీసీసీలను కొత్తగా ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని చెప్పారు. ‘ఏఐ రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు ప్రత్యేకంగా ఏఐ సిటీని అభివృద్ధి చేయనున్నాం. ప్రపంచానికి ఏఐ నిపుణులను అందించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ఏఐ యూనివర్సిటీ, ఏఐ ఇన్నోవేషన్ హబ్ ను ఏర్పాటు చేయబోతున్నాం’ అని చెప్పారు. కార్యక్రమంలో జాగర్ సీఈఓ ఆండ్రూ రోస్కో, చీఫ్ డిజిటల్ & ఏఐ ఆఫీసర్ – డెవలెప్ మెంట్ గోపీనాథ్ పోలవరపు, చీఫ్ కస్టమర్ ఆఫీసర్ ట్రాయ్ మేయర్ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *