– మంత్రి శ్రీధర్‌బాబు
మహేశ్వరం, ప్రజాతంత్ర, ఆగస్టు 5: పేదల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని, అందులో భాగంగా అర్హులైన పేదలకు రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని, ప్రతి కుటుంబానికి సగటున రూ.1200 విలువైన బియ్యాన్ని ప్రతినెలా ఉచితంగా అందజేస్తున్నామని రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండలం మల్లాపూర్‌లోని వైఏఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ జిల్లాలో 12 వేల కొత్త రేషన్ కార్డుల జారీతో సగటున 50 వేల మందికి సన్నరకం బియ్యం అందిస్తున్నామన్నారు. గతంలో తమ ప్రభుత్వం కృష్ణా నీటిని తీసుకొచ్చి హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్య లేకుండా చేసిందని, ప్రస్తుతం ముఖ్యమంత్రి గోదావరి నీటిని తీసుకురావడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారని చెప్పారు. ఈ ప్రాంతానికి కొత్త పరిశ్రమలను తీసుకొస్తున్నామని, యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 65 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పేదలకు రేషన్ కార్డులు అందించడం నిరంతర ప్రక్రియ అని, ఇంకా అర్హులైన వారు ఉంటే వారిని కూడా త్వరలో గుర్తించి కార్డులు ఇస్తామని, వడ్డీ లేని రుణాల పథకంతో మహిళలకు కోట్ల రూపాయలు కేటాయించి, వారికి వ్యాపార నైపుణ్యాలలో శిక్షణ అందించి ఇందిర మహిళా శక్తి ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నామని వివరించారు. అనంతరం నియోజకవర్గంలోని మహేశ్వరం, బాలాపూర్ మండలాల వారికి మంత్రి రేషన్ కార్డులు పంపిణీ చేసి లబ్ధిదారులతో సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, టీయూఎఫ్‌ఐడీసీ చైర్మన్ చల్లా నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ యాదయ్య, కందుకూరు ఆర్డీవో రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.





