– హైదరాబాద్ పురోగతికి రూ.100 కోట్లు కేటాయింపు
– మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
ఎల్బీనగర్, ప్రజాతంత్ర, ఆగస్టు 1: రేషన్ కార్డు అనేది ఆత్మగౌరవ పత్రం అని, రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల జారీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తోందని ఐటీ పరిశ్రమల శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గం కర్మంజ్‌పత్‌లోని కొత్తకాపు యాదవరెడ్డి గార్డెన్స్‌లో శుక్రవారం జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా వివిధ సంక్షేమ పథకాల అమలులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుల ద్వారా ప్రతి ఒక్కరికీ 6 కిలోల బియ్యం అందిస్తోందని చెప్పారు. గత ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసినప్పటికీ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ప్రతి ఇంటికీ బియ్యం అందించే కార్యక్రమాన్ని అమలు చేయడం ద్వారా హామీని నిలబెట్టుకుంటున్నామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక తొలిసారిగా గ్రేటర్ హైదరాబాద్ పురోగతికి సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు బడ్జెట్‌లో రూ.10వేల కోట్లు కేటాయించామని, ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మురుగు నీటి వ్యవస్థ, డ్రైనేజీ, రోడ్ల నిర్మాణానికి ప్రత్యేకంగా రూ.200 కోట్లు కేటాయించినట్లు వివరించారు. నగరాన్ని నాలుగు దిశలకూ సులభంగా చేరుకోవడానికి ప్రభుత్వం ఆర్టీసీ బస్సు, మెట్రో రైలు సౌకర్యాలను కల్పించడానికి చర్యలు తీసుకుంటోందని, మెట్రో రైలుకు నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రంలోని సంబంధిత శాఖ మంత్రిని పదేపదే కోరినప్పటికీ నిధులు మంజూరు కాకపోవడం దురదృష్టకరమని అన్నారు. జిల్లా కేంద్రాలకు సులభంగా, సురక్షితంగా చేరుకోవడానికి ఔటర్ రింగ్ రోడ్డు నుండి ప్రాంతీయ రింగ్ రోడ్డుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, రెండేళ్లలో పూర్తి చేయబోతున్నామని మంత్రి వివరించారు. గోదావరి జలాలను పూర్తిస్థాయిలో తీసుకురావడానికి ప్రస్తుతం కొత్త ప్రాజెక్టును చేపడతామన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపు 65 వేల ఉద్యోగాలు సృష్టించామని, దీనితోపాటు రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకొస్తున్నామని చెప్పారు. గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూనే మరో వైపు అభివృద్ధితోపాటు సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడిరచారు. అనంతరం జీహెచ్‌ఎంసీ పారిశుధ్య సిబ్బందికి రక్షణ పరికరాల కిట్లను మంత్రి అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పట్నం మహేందర్రెడ్డి, దయానంద్ గుప్తా, టీయూఎఫ్‌ఎడీసీ చైర్మన్ చల్లా నర్సింహరెడ్డి, రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి, ఆర్డీవో రాజేశ్వరరెడ్డి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి పారిజాత, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.



