శ్రీ‌రామ‌ నవమి ఉత్సవాలను ఘ‌నంగా నిర్వహించాలి

– దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్

భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 23 : ఈనెల 27న జరగనున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం, 28న నిర్వహించనున్న మహా పట్టాభిషేకం కార్యక్రమాలను అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా అత్యంత ఘనంగా, విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతోందని, ఇందులో భాగంగా ఈనెల 27వ తేదీన ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన శిలాఫలకం ఏర్పాట్లు ఈనెల 25 నాటికి పూర్తి చేయాలని, ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా పటిష్టమైన బందోబస్తు, ట్రాఫిక్, భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. భూమి పూజ, శిలాఫలకం ఆవిష్కరణ కార్యక్రమాలకు ప్రత్యేక పాసులు జారీ చేసి రద్దీ తగ్గించే విధంగా పరిమిత సంఖ్యలోనే వ్యక్తులను అనుమతించాలని ఆదేశించారు. దేవాలయ స్థానాచారులతో చర్చించి శాస్త్రోక్తంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు నిమిష‌-నిమిషం ప్రణాళిక రూపొందించాలని, ముఖ్యమంత్రి దైవ దర్శనం అనంతరం భూమి పూజ కార్యక్రమం పూర్తి చేసి, తదనంతరం మిథిలా స్టేడియంలో జరిగే కళ్యాణ మహోత్సవానికి హాజరయ్యేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అన్నారు. మిథిలా స్టేడియంలో పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, వివిఐపీలు, వీఐపీలు పాల్గొనే అవకాశం ఉన్నందున సక్రమ ఏర్పాట్లు చేయాలని, వారికి ప్రత్యేక లైజనింగ్ అధికారులను నియమించాలని సూచించారు. కళ్యాణ అనంతరం ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రముఖులకు లంచ్ ఏర్పాట్లు చేయాలని, కార్యక్రమం ముగిసిన తర్వాత పాత్రికేయుల సమావేశం నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు ముందస్తుగా సిద్ధం చేయాలని తెలిపారు. ప్రతి సంవత్సరం కళ్యాణం అనంతరం తలంబ్రాల కోసం భక్తులు కల్యాణ మండపంపైకి రావడానికి ప్రయత్నించే పరిస్థితులు ఉండటం గమనించి ఈసారి అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భద్రాచల దేవస్థానం భూముల వివరాలు, దేవస్థానంలో ఉన్న సమస్యలు, పట్టణానికి సంబంధించిన కీలక అంశాలపై పూర్తి సమగ్ర సమాచారాన్ని సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ శ్రీరామనవమి, మహా పట్టాభిషేకం, ఆలయ అభివృద్ధి పనుల భూమి పూజ కార్యక్రమాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడే కార్యక్రమాలు కావున అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు ప్రణాళికతో పనిచేస్తున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా భద్రత, ట్రాఫిక్, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సదుపాయాలు వంటి అన్ని అంశాల్లో లోటుపాట్లు లేకుండా  చేస్తున్నామని పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. మిథిలా స్టేడియం, ఆలయ పరిసర ప్రాంతాల్లో జనసమ్మర్థాన్ని దృష్టిలో ఉంచుకుని బారికేడింగ్, క్యూలైన్లు, ప్రత్యేక ప్రవేశ-నిష్క్రమణ మార్గాలు ఏర్పాటు చేస్తున్నామని, పోలీసు శాఖతో సమన్వయంతో పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపడుతున్నామని వివరించారు. వివిఐపీలు, వీఐపీలకు అవసరమైన సౌకర్యాలు సమకూర్చేందుకు ప్రత్యేక బృందాలను నియమిస్తున్నామని తెలిపారు. అన్ని ఏర్పాట్లు సమగ్రంగా పూర్తి చేసి శ్రీరామనవమి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సమావేశంలో శిక్షణ కలెక్టర్ సౌరబ్ శర్మ, సిపిఓ సంజీవరావు, దేవస్థాన ఈ ఈ రవీందర్, తాసిల్దార్ వెంకటరమణ, పంచాయతీ ఈఓ శ్రీనివాసరావు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *