నాపై దుష్ప్రచారం చేస్తున్నారు

మావోయిస్టు లేఖలో లేని అంశాలతో అవమానిస్తున్నారు
జీవో 49 రద్దు కోసం తీర్మానించాం
బీఆర్‌ఎస్‌పై మంత్రి సీతక్క విమర్శలు

ఏటూరునగారం, ప్రజాతంత్ర, జూన్‌ 27: ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం ముందుంటామని, ఎస్టీ ఎమ్మెల్యేల సమవేశంలో జీవో 49 రద్దు చేయాలని తీర్మానం చేశామని, అత్యుత్సాహం ప్రదర్శించే అటవీ అధికారులపై చర్యలు చేపట్టామని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. ములుగు, భద్రాద్రి జిల్లాల్లో ఆదివాసీ, గిరిజనలకు అండగా నిలిచామన్నారు. అయితే మావోయిస్టుల లేఖ నేపథ్యంలో తనపై రాజకీయ స్వార్ధంతో అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళనని కూడా చూడకుండా అసభ్యపదజాలంతో దూషించడం ఆవేదన కలిగిస్తోందన్నారు. అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ములుగు జిల్లా ఏటూరునాగారం వచ్చిన ఆమె తనను కలసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇటీవల మావోయిస్టుల పేరిట వచ్చిన లేఖపై స్పందిస్తూ ఆ లేఖ ఆ పార్టీ ఇచ్చిందా? లేదా అన్న దానిపై స్పష్టత లేదన్నారు. అయితే ఆ లేఖలో లేని అంశాలపై కొన్ని మీడియా సంస్థలు, రాజకీయ పార్టీలు తప్పుడు వ్యాఖ్యలతో దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. మహిళ అని కూడా చూడకుండా మావోయిస్టుల లేఖను అడ్డం పెట్టుకొని తనను అవమానిస్తూ బీఆర్‌ఎస్‌ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. తాను ఎన్నడూ ప్రజలకు దూరంగా లేనని, వారంలో రెండుమూడు రోజులపాటు ములుగు, ఆదిలాబాద్‌ వంటి ప్రాంతాల్లో పర్యటిస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని పేర్కొన్నారు. అయితే తనను ఎన్నికల్లో ఓడిరచాలని పనిచేసిన శక్తులే ఇప్పుడు తనను టార్టెట్‌ చేశాయని తెలిపారు. ఒక కోయ మహిళకు జనరల్‌ పోర్ట్‌ఫోలియో దక్కడాన్ని బీఆర్‌ఎస్‌ జీర్ణించుకోలేకపోతోందని మంత్రి సీతక్క మండిపడ్డారు. 75 సంవత్సరాల్లో ఒక కోయ మహిళకు అతి పెద్దదైన పంచాయతీరాజ్‌ శాఖ రావాడన్ని సహించలేకే తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 49తో అడవి బిడ్డలు నష్టపోతారని, ఆ జీవోను తాను వ్యతిరేకించానని గుర్తు చేశారు. గిరిజన సంక్షేమ మంత్రిని కాకున్నా పార్టీలకతీతంగా ఎస్టీ ఎమ్మెల్యేలందరితో సమావేశమై జీవో 49ను రద్దు చేయాలని గతంలోనే తీర్మానించినట్లు తెలిపారు. ఏ హోదాలో, ఏ స్థాయిలో ఉన్నా తాను ఆదివాసి అడవి బిడ్డనేనని, వారి సంక్షేమం, అభివృద్ది కోసం తన జీవితం అంకితమని స్పష్టం చేశారు. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఘటనలు తమ దృష్టికి రాగానే అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్సర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ సువర్ణతో స్వయంగా మాట్లాడానని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపడతామని వారు హామీ ఇచ్చినట్లు తెలిపారు. అడవి బిడ్డల పట్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న అధికారులపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతిపక్షంలోనైనా, అధికార పక్షంలోనైనా తనదొకటే నినాదమన్నారు. అటవీ హక్కుల చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కొత్తగా అడవిని కొట్టొద్దు.. పాత అడవిని వదిలిపెట్టొద్దు అన్నదే తన విధానమన్నారు. తన నియోజకర్గంలో కొంతమంది అటవీ అధికారులు ఆదివాసి గుడిసెల మీద దాడి చేయగా తానే వారికి ఫోన్‌ చేసి వెనక్కు పంపినట్లు తెలిపారు. ఆదివాసులు, అట్టడుగు వర్గాలు, కష్టాల్లో ఉన్న ప్రజలకు నిరంతరం అండగా ఉంటామని తెలిపారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఆదివాసులపై దాడులు చేశారని, చంటి పిల్లల తల్లులను జైల్లో పెట్టారని సీతక్క గుర్తు చేశారు. పదవి పోయాక ఇప్పుడు ఆదివాసీల పట్ల ఆ పార్టీ మొసలి కన్నీరు కారుస్తోందని ఎద్దేవా చేశారు. మీ హయంలో పోడు సమస్యలు పరిష్కరించి అడవి బిడ్డలకు ఇండ్లు ఇస్తే ఇలాంటి సమస్యలే ఉత్పన్నం అయ్యేవి కావన్నారు. దేశంలో, రాష్ట్రంలో ఆదివాసీలు, బడుగు, బలహీనవర్గాల పక్షాన కాంగ్రెస్‌ పార్టీ నిలుస్తుందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *