తప్పుడు సమాచారవ్యాప్తిని అరికట్టాలి

– ఇంధన నిల్వలు, సరఫరాపై కేంద్ర కార్యదర్శి వీసీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 25 : ఎల్‌పీజీ, సహజ వాయు, పెట్రోలియం ఉత్పత్తుల లభ్యత, సరఫరాపై దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులతో కేంద్ర పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఎల్‌పీజీ సిలిండర్లు, పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాల నిరంతర లభ్యత, ఉత్పత్తి, పంపిణీ, సరఫరాపై కార్యదర్శి సమీక్షించారు. ఎల్‌పిజి డిమాండ్, ప్రాంతీయ అవసరాల దృష్ట్యా తగిన నిల్వలను అందుబాటులో ఉంచి సమయానుకూలంగా పంపిణీ చేయాలని కేంద్ర కార్యదర్శి సూచించారు. పెట్రోల్, గ్యాస్ కొరతలపై వస్తున్న తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. ఎల్‌పీజీ నిల్వల్లో కొరత లేదని ఆయన స్పష్టం చేస్తూ పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వ్యవధిలోనే రీఫిల్ బుకింగ్ చేయాలనే నిబంధనలు యథాతథంగా ఉన్నాయని తెలిపారు. ప్రజలు తప్పుడు వార్తలను నమ్మకుండా, అనవసరపు భయంతో బుకింగ్ చేయవద్దని సూచించారు. ఇంకా గ్యాస్ నెట్‌వర్క్ విస్తరణ వల్ల కలిగే దీర్ఘకాల ప్రయోజనాలను సమావేశంలో ప్రస్తావించారు. ఎల్‌పీజీ నుంచి పైప్ ద్వారా వచ్చే సహజ వాయువు (పీఎన్‌జీ) వైపు మారడం గృహాలకు తక్కువ ఖర్చుతోపాటు సౌకర్యవంతమని అధికారులు తెలిపారు. ఈ మార్పును ప్రోత్సహించాలని రాష్ట్రాలకు సూచించారు. తమతమ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లభ్యత పంపిణీ విధానాన్ని నిరంతరం పర్యవేక్షించాలని ప్రభుత్వ కార్యదర్శులకు సూచించారు. ఇందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కేంద్రాలు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, జిల్లా పాలనా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలను అరికట్టాలని సూచించారు. ఈ కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *