క్రీడ‌లు క్ర‌మ‌శిక్ష‌ణ‌ను పెంచుతాయి

– దేశాభివృద్ధికి యువ‌త స‌రైన దిశ‌లో సాగాలి
– డా. వ‌కుళాభ‌ర‌ణం కృష్ణ‌మోహ‌న్‌రావు
-హైద‌రాబాద్‌లో ఘ‌నంగా సంస‌ద్ ఖేల్ మ‌హోత్స‌వం

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 27: క్రీడలు యువతలో క్రమశిక్షణను సహజంగా పెంపొందిస్తాయి. ఆ క్రమశిక్షణ వ్యక్తిగత జీవితాన్ని, సమాజాన్ని బలోపేతం చేస్తుంద‌ని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్, ప్రముఖ బీజేపీ నేత డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. మంగళవారం హైదరాబాద్ లో ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం సందర్భంగా నగరమంతా క్రీడోత్సాహంతో కదలాడింది. వివిధ ప్రాంతాల మైదానాలు క్రీడాకారులు, యువతతో నిండిపోయి ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఈ కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ  ప్రేరణతో, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, సికింద్రాబాద్ లోక్‌సభ సభ్యుడు  జి. కిషన్ రెడ్డి యువతకు అందిస్తున్న ప్రోత్సాహంతో, ఆయన పార్లమెంటరీ నియోజకవర్గమైన సికింద్రాబాద్ పరిధిలోని అంబర్‌పేట, బాగ్ అంబర్‌పేట ప్రాంతాల్లో పీఎం సంసద్ ఖేల్ మహోత్సవం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు ప్రసంగిస్తూ, యువత, క్రీడలు, ఆరోగ్యం, దేశ నిర్మాణం పరస్పరంగా అనుసంధానమై ఉన్న అంశాలుగా వివరించారు. యువత శక్తి సరైన దిశలో సాగినప్పుడే దేశ అభివృద్ధి నిలకడగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. బాగ్ అంబర్‌పేట ప్రాంతంలోని జీహెచ్‌ఎంసీ గ్రౌండ్స్‌లో, అలాగే అంబర్‌పేట హెచ్‌ఎమ్‌డబ్ల్యుఎస్ గ్రౌండ్స్‌లో క్రీడా పోటీలు నిర్వహించారు. రెండు వేదికలలోనూ చెరో 10 డివిజన్‌ టీమ్స్ పాల్గొని, ఐదు మ్యాచ్‌లు చొప్పున పోటీలు సాగాయి. మంగళవారం నాడు హైదరాబాద్‌లో ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవంలో భాగంగా నగరమంతా క్రీడా వాతావరణం నెలకొంది. తొలితగా రెండు మైదానాల్లో ఉస్మానియా యూనివర్సిటీ టీమ్ – జైస్వాల్ గార్డెన్ యూత్ అసోసియేషన్ టీమ్ (అంబర్‌పేట డివిజన్), అలాగే మరో వేదికలో కేఎల్పీ టీమ్ – రాయల్ డెక్కన్ టీమ్‌లు (బాగ్ అంబర్‌పేట డివిజన్) మధ్య మ్యాచ్‌లు నిర్వహించారు. డా. వకుళాభరణం టాస్ వేసి క్రీడలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగాయి. క్రీడాకారులనుద్దేశించి వకుళాభరణం ప్రసంగిస్తూ క్రీడలు యువతకు జీవన పాఠాలు నేర్పుతాయన్నారు. సమయపాలన అలవాటుగా మారుతుందని, జట్టుగా ఆలోచించే దృక్కోణం బలపడుతుందని చెప్పారు. ఓటమి నుంచి నేర్చుకునే సహనం పెరుగుతుందని, విజయం వచ్చినప్పుడు వినయం నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ లక్షణాలే రేపటి నాయకత్వానికి పునాదిగా మారుతాయని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి మరో కీలక ఆలోచన ప్రతిభకు అవకాశం అని తెలిపారు. ప్రతిభ ఒక ప్రాంతానికి పరిమితం అయ్యే అంశం కాదని, గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ, నగరాల్లోనూ అదే స్థాయిలో ఉంటుందని అన్నారు. ఆ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే వేదికగా సంసద్ ఖేల్ మహోత్సవం నిలుస్తోందని వివరించారు. మైదానాల వైపు అడుగులు వేస్తే శక్తి సానుకూలంగా మారుతుందని, ఆ శక్తి వ్యక్తిగత జీవితాన్ని మెరుగుపరుస్తుందని, సమాజానికి ఉపయోగపడుతుందని, దేశ నిర్మాణంలో భాగస్వామ్యాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. రెండు క్రీడా మైదానాల్లో గెలుపొందిన జట్లకు ఉచితంగా క్రికెట్ కిట్లు అందజేశారు. విజేత జట్లకు మెడల్స్, ప్రశంసా పత్రాలను డా. వకుళాభరణం  అందజేశారు. ఈ మహోత్సవంలో మైలారం రాజు, నాగభూషణాచారి, ఎడెల్లి రాజు, కంచి శ్రీధర్, సందీప్, భాస్కర్ గౌడ్, రాంచందర్ గుప్తా, శ్రీకాంత్, మాణిక్యం, రాజు నేత, మనోజ్ యాదవ్, పట్నం రాజు, శ్రవణ్ కుమార్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *