గ్రామీణ క్రీడా మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత

– క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి

మక్తల్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 12: గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధి జరగాలంటే క్రీడా మౌలిక సదుపాయాలు మెరుగుపడాల్సిన అవసరం ఉందని క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్‌ నియోజకవర్గం మక్తల్‌, ఆత్మకూరు, నార్వ, ఉట్కూరు మండల కేంద్రాల్లో, అమరచింత, వనపర్తి జిల్లా కేంద్రాల్లో క్రీడా మైదానాలు, మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం అధికారులతో కలిసి ఆయా ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలు అభివృద్ధి చెందాలంటే మండల, నియోజకవర్గ కేంద్రాల్లో క్రీడా మౌలిక సదుపాయాలు సమృద్ధిగా ఉండాలని, ఆ ఆలోచనతోటే ఇప్పటివరకు మౌలిక సదుపాయాల్లేని మండల కేంద్రాలపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. అంచలంచెలుగా అన్ని నియోజకవర్గాల్లో, మండల కేంద్రాల్లో క్రీడా మైదానాల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. క్రీడల అభివృద్ధికి నూతన క్రీడా విధానం ప్రకటించుకొని దాన్ని పటిష్టంగా అమలు చేయడానికి జరుగుతున్న కృషిలో భాగంగానే క్రీడా మైదానాల నిర్మాణం, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టామని తెలిపారు. ఇప్పటివరకు ఎంతో వెనుకబాటుకు గురైన మక్తల్‌ నియోజకవర్గంలో సమర్థవంతమైన క్రీడాకారులు ఉన్నారని వారిని గుర్తించి ప్రోత్సహించడానికి కృషి చేస్తామని తెలిపారు. స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ శివసేన రెడ్డి మాట్లాడుతూ మంత్రి వాకిటి శ్రీహరి నేతృత్వంలో గ్రామీణ క్రీడారంగ మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తూ స్పష్టమైన కార్యాచరణకు పూనుకోవడం హర్షణీయమన్నారు.

పోస్టర్‌ ఆవిష్కరణ

అన్ని రాష్ట్రాల్లోకన్నా ఈ సంవత్సరం తెలంగాణలో జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహిస్తామని మంత్రి వాకిటి తెలిపారు. స్పోర్ట్స్‌ అథారిటీ ఆధ్వర్యంలో జాతీయ క్రీడల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 25న ఎల్‌బి టెన్నిస్‌ కాంప్లెక్స్‌లో సూపర్‌ స్పెషాలిటీ హెల్త్‌ క్యాంపు నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ పర్యటనలో స్పోర్ట్స్‌ అథారిటీ వైస్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సోనీ బాలాదేవి, జిల్లా కలెక్టర్‌ ఆదర్శ సురభి, స్థానిక ప్రజాప్రతినిధులు, స్పోర్ట్స్‌ అథారిటీ అధికారులు చంద్రారెడ్డి, రవీందర్‌, బాషా, అశోక్‌ కుమార్‌, మధు తదితరులు పాల్గొన్నారు.

స్థల పరిశీలన చేసిన మంత్రి 

మహబూబ్‌నగర్‌: జిల్లాలోని ఆత్మకూరు మున్సిపాల్టీలో నూతనంగా నిర్మించనున్న క్రీడా మైదానాలకు రాష్ట్ర స్పోర్ట్‌ అథారిటి చైర్మన్‌ శివసేన రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభితో కలిసి మంత్రి వాకిటి శ్రీహరి స్థల పరిశీలన చేశారు. ఆత్మకూరు మున్సిపాల్టీ పరిదిలో జాతర మైదానం పక్కన అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఒక మినీ స్టేడియం, జాతర మైదానంలో నడక వ్యాయామదారులకు సౌకర్యాలు అధునీకరించడంతోపాటు పక్కనే ఒక ఇండోర్‌ స్టేడియం కోసం ప్రణాళికలు సిద్దం చేయాలని అధికారులకు సూచించారు. ఈ మైదానాలకు దాదాపు రూ.5 కోట్ల నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ప్రత్యేక చొరవ తీసుకొని నాలుగెకరాల స్థలాన్ని కేటాయించారని, ఇండోర్‌ స్టేడియం ఏర్పాటుకు సైతం స్థలం కేటాయించినందుకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఆత్మకూర్‌లో నిర్మించనున్న క్రీడా మైదానాలకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్దం చేసి స్పోర్ట్‌ అథారిటీకి సమర్పిస్తే నెల రోజుల్లో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన హంగులతో క్రీడా మైదానాలు పూర్తి అయితే ఆత్మకూర్‌, అమరచింత మున్సిపాల్టీల రూపురేఖలు మారిపోతాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *