– పక్కదారి పడుతున్న క్రీడా నిధులు
– విద్యార్థులకు ప్రోత్సాహం కరువు
– బిల్లుల్లో మాత్రమే విద్యార్థుల శారీరక వికాసం
– మౌనంగా విద్యాశాఖ అధికారులు
– విద్యార్థులకు ప్రోత్సాహం కరువు
– బిల్లుల్లో మాత్రమే విద్యార్థుల శారీరక వికాసం
– మౌనంగా విద్యాశాఖ అధికారులు
మిర్యాలగూడ, ప్రజాతంత్ర, డిసెంబర్ 7 : విద్యార్థుల దేహ దారుఢ్యంతోపాటు మానసిక పరిపక్వతను కలిగించేందుకు ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నది. చదువుతోపాటు క్రీడలకు తగిన సమయాన్ని కేటాయించి శారీరక కౌశలాల వికాసానికి పాటుపడాల్సిన రీతిలో విద్యార్థుల క్రీడల కోసం ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేసి నిధులు అందిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అవి దుర్వినియోగం అవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రతి ఏడాది ప్రాథమిక పాఠశాలలకు రూ. 10 వేలు, ఉన్నత పాఠశాలకు రూ. 25 వేలు నిధులను అందిస్తుంది. కానీ ఈ నిధులు ఎక్కువ శాతం ఖర్చు చేయకుండా కొంతమంది ఉపాధ్యాయులు స్వకార్యానికి వినియోగిస్తూ క్రీడా నిధులను స్వాహా చేస్తున్నారు. కేవలం కాగితాలపై మాత్రమే అత్యంత పారదర్శకంగా వినియోగిస్తున్నామంటూ బిల్లులను సృష్టించి ప్రభుత్వానికి నివేదికల ద్వారా పంపుతున్నట్లు సమాచారం. విద్యార్థుల శారీరక దృఢత్వం కోసం ఖర్చు చేయాల్సిన నిధులు నకిలీ బిల్లుల దృఢత్వం కోసం వెచ్చిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అనేక పాఠశాలలలో క్రీడా సామగ్రి లేకపోయినప్పటికీ ఉన్నట్లుగా చూపెడుతూ క్రీడా నిధులను స్వాహా చేస్తున్నారు. దీనికి తోడు ఉన్నత అధికారులు సైతం ఆయా పాఠశాలలకు క్లీన్ చిట్ ఇవ్వడం హాస్యాస్పదం. కొన్ని పాఠశాలలలోనీ వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ ఆయా పాఠశాలల హెచ్.ఎంలు, కొందరు మండల విద్యాశాఖ అధికారులు మాత్రం వచ్చిన నిధులను స్వాహాకార్యానికి వినియోగించడం పట్ల వ్యాయామ ఉపాధ్యాయులు నిరుత్సాహపడుతున్నట్లు తెలుస్తున్నది. క్రీడా సామగ్రి కోసం పక్కాగా ఖర్చు చేయాల్సిన నిధులను పక్కాగా పక్కదారి పడుతున్న పాఠశాలల అధికారులపై తగు పర్యవేక్షణ లేకపోవడంతో వారి ఇష్టారాజ్యానికి అంతులేకుండా పోయిందని విమర్శలు ఉన్నాయి. అయితే అనేకమంది ఉపాధ్యాయులు క్రీడా పరికరాల కోసం ప్రభుత్వం ఇస్తున్న నిధులను డబ్బు రూపంలో కాకుండా, క్రీడా సామగ్రి రూపంలో పంపిణీ చేస్తే బాగుంటుందని అభిప్రాయం సైతం వ్యక్తపరుస్తున్నారు. దీనివల్ల కొంతమేర అయినా నిధులు పక్కదారి పట్టకుండా విద్యార్థులకు ఉపయోగపడుతుందని భావన వ్యక్తమవుతోంది. క్రీడా నిధులు పక్కదారి పడుతున్నాయని ఆరోపిస్తూ గత ఏడాది పలు సంఘ నాయకులు, వ్యాయామ ఉపాధ్యాయులు జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రాలు అందించినప్పటికీ స్పందన లేకపోవడం విచారకరమని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 2025 – 26 విద్యా సంవత్సరానికి క్రీడా పరికరాలు, క్రీడా స్థలంలో కోర్టుల నిర్మాణాల కోసం ప్రభుత్వం గత నెలలో సగం నిధులను ఆయా పాఠశాలల అకౌంట్లో జమ చేయగా, ఇటీవల రెండో విడతలో పూర్తిగా ఆయా పాఠశాలలకు నిధులను జమ చేసినట్లుగా తెలిసింది. ప్రాథమిక పాఠశాలకు రూ.10వేల చొప్పున, ఉన్నత పాఠశాలకు రూ. 25 వేల చొప్పున జమ చేసిన ఈ నిధులు ఈ ఏడాది అయినా పక్కదారి పట్టకుండా పకడ్బందీగా ఉన్నత అధికారుల చొరవతో విద్యార్థుల భవిష్యత్తు కోసం నిధులు సద్వినియోగం అయ్యేలా చూడాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
———————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



