– భారీగా తరలి వస్తోన్న జనం
– ఇప్పటికే జనజాతరగా మేడారం
వరంగల్, ప్రజాతంత్ర, జనవరి 23: సమ్మక్క సారలమ్మ జాతరకు మేడారం జనసంద్రంగా మారుతోంది. జాతర ప్రారంభానికి ముందే జనం తండోపతండాలుగా వస్తున్నారు. వాహనాల రద్దీ పెరిగింది. ఇప్పటికే ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఇప్ప్పుడు రైల్వే శాఖ కూడా వరంగల్, కాజీపేటల వరకు ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు వెల్లడించింది. ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరకు దక్షిణ మధ్య రైల్వే మేడారం జాతర ప్రత్యేక రైళ్లను ఈ నెల 28 నుంచి నడుపనుంది. సికింద్రాబాద్, మంచిర్యాల్, సిరిపూర్‌కాగజ్‌నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం ప్రాంతాల నుంచి మేడారం జాతర ప్రత్యేక రైళ్లు వరంగల్, కాజీపేటల వరకు నడుస్తాయని రైల్వే ముఖ్య పౌరసంబంధాల అధికారి ఎ.శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు నడిచే మేడారం జాతర ప్రత్యేక రైళ్లు పూర్తిగా అన్ రిజర్వుడ్ జనసాధారణ రైళ్లని, భక్తులు ఈ రైళ్లను వినియోగించుకోవాలని కోరారు. ఇవి ఆయా మార్గాల్లోని అన్ని స్టేషన్లలో ఆగుతాయని తెలిపారు. ఈనెల 28, 30, ఫిబ్రవరి 1 తేదీల్లో సికింద్రాబాద్ -మంచిర్యాల్- సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్లు కాజీపేట మీదుగా నడుస్తాయి.
రైళ్ల వివరాలు
సికింద్రాబాద్-మంచిర్యాల్ రైలు(07495) ఉదయం 5.45 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి ఉదయం 8.45 గంటలకు కాజీపేటకు, మధ్యాహ్నం 1.30 గంటలకు మంచిర్యాల్ చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం 3.30 గంటలకు మంచిర్యాల్-సికింద్రాబాద్ రైలు (07496) మంచిర్యాల్‌లో బయలుదేరి రాత్రి 8 గంటలకు కాజీపేటకు, రాత్రి 10.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. 29, 31 తేదీల్లో సికింద్రాబాద్- సిరిపూర్ కాగజ్‌నగర్- సికింద్రాబాద్ మేడారం (07497/07498) ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఈ తేదీలలో సికింద్రాబాద్ నుంచి ఉదయం ఉదయం 5.45 గంటలకు బయలుదేరి ఉదయం 8.45 గంటలకు కాజీపేటకు, మధ్యాహ్నం 2 గంటలకు సిరిపూర్ కాగజ్‌నగర్ చేరుకుంటాయి. అదే రోజు మద్యాహ్నం 2.30 గంటలకు సిరిపూర్ కాగజ్‌నగర్‌లో బయలుదేరి రాత్రి 7.45 గంటలకు కాజీపేటకు, రాత్రి 10.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటాయి. నిజామాబాద్- వరంగల్- నిజామాబాద్ మేడారం జాతర ప్రత్యేక రైళ్లు (07498/07499) ఈ నెల 28 నుంచి 31 వరకు రాకపోకలు సాగిస్తాయి. ఈ రైళ్లు నిజామాబాద్‌లో ఉదయం 7.05 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్ చేరుకుంటాయి. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 2.40 గంటలకు వరంగల్‌లో బయలుదేరి రాత్రి 10.30 గంటలకు నిజామాబాద్ చేరుకుంటాయి. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఖమ్మం-కాజీపేట- ఖమ్మం మేడారం ప్రత్యేక రైళ్లు (07503/07504) ఉదయం 10 గంటలకు ఖమ్మంలో బయలుదేరి మధ్యాహ్నం 12.50 గంటలకు కాజీపేట చేరుకుంటాయి. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు కాజీపేటలో బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు ఖమ్మం చేరుకుంటాయి. ఆదిలాబాద్- కాజీపేట (07501) మేడారం జాతర ప్రత్యేక రైలు ఈ నెల 28న రాత్రి 11.30 గంటలకు ఆదిలాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు (29 తేదీ) ఉదయం 11.45 గంటలకు కాజీపేటకు చేరుకుంటుంది. అలాగే కాజీపేట- ఆదిలాబాద్ (07502) మేడారం ప్రత్యేక రైలు ఈ నెల 29న మధ్యాహ్నం 1.15 గంటలకు కాజీపేటలో బయలుదేరి మరుసటి రోజు (30వ తేదీ) తెల్లవారు జామున 4 గంటలకు ఆదిలాబాద్ చేరుకుంటుంది.
——————————————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





