“మమ్‌దానీ కమ్యూనిస్టో సోషలిస్టో అమెరికాను ప్రక్షాళన చేయగలిగే మహాశక్తివంతుడో అనిపించిందంటే, ఒక అసాధ్యమైన అడుగు విజయవంతంగా వేయగలగడమే అందుకు కారణం. అది అతని గెలుపే కాదు, అతనిని గెలిపించిన ప్రజలది కూడా. నిర్ణయాత్మకమైన సందర్భం ఎదురైనప్పుడు, తమలో విచక్షణ ప్రేరణ పొందినప్పుడు, ప్రజలు కాలగతిని మార్చగలరు. మరొకసారి నిరూపితమైన ఈ సత్యం అనేక పరీక్షాసందర్భాలలో ఆశలకు ఆలంబన అవుతూ ఉంటుంది. మార్పుకు ప్రాతినిధ్యవ్యక్తిగా చరిత్ర ఇచ్చిన అవకాశాన్ని సమర్థంగా వినియోగించుకుంటే, మమ్‌దానీ, ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రజాస్వామిక కార్యాచరణలకు ఒక నమూనాగా మిగులుతాడు.”

జోరాన్ మమ్‌దానీ న్యూయార్క్ మేయర్‌గా గెలిచాడు. లోకానికి కొత్త దారి దొరికిందని, ఈ చీకటి విడిపోతుందని జనం కేరింతలు కొడుతున్నారు. దిగులు ముఖాలన్నిటి మీదా విప్పారిన ఆనందాలను తొడుక్కుంటున్నారు. ఇది ఇట్లాగే ఉండదు, మారుతుంది, పాదుకుపోయిన దుర్మార్గానికి కూడా పునాదులు కదులుతాయి- అన్న నమ్మకం ఏదో మళ్లీ ఒకసారి అనేకులను ఆవహించింది. .
సమాజ చైతన్యానికే కాదు, భావోద్వేగాలకు కూడా కాపలాదారులుంటారు. మనం ఆశ పడుతుంటే అందులో దాగి ఉండే ఆశాభంగాలను గుర్తుచేస్తారు. మనం కుంగిపోతుంటే, రేపటి వెలుగు ఖాయమని హామీలు ఇస్తారు. స్థిత ప్రజ్ఞత ఒక ఆదర్శమూ విలువా నిజమే కానీ, సాధారణ మానవ స్పందనలు తక్షణత్వంలోనే వ్యక్తమవుతుంటాయి. కనుచూపు మేరలో నిష్కృతి లేనట్టుగా అనిపించే చీకటి అంతా అయిపోయిందన్న విరక్త విషాదాన్ని ప్రేరేపిస్తుంది. ముంచెత్తి తుడిచిపెట్టే వెల్లువలో, చిన్న ఆశ మీద మోయలేని బరువు పడుతుంది. ఈ ఆశ నిరాశల నిర్వహణలోనే మనుషుల జీవనపోరాటం సాగుతుంది.
మమ్‌దానీ కమ్యూనిస్టో సోషలిస్టో అమెరికాను ప్రక్షాళన చేయగలిగే మహాశక్తివంతుడో అనిపించిందంటే, ఒక అసాధ్యమైన అడుగు విజయవంతంగా వేయగలగడమే అందుకు కారణం. అది అతని గెలుపే కాదు, అతనిని గెలిపించిన ప్రజలది కూడా. నిర్ణయాత్మకమైన సందర్భం ఎదురైనప్పుడు, తమలో విచక్షణ ప్రేరణ పొందినప్పుడు, ప్రజలు కాలగతిని మార్చగలరు. మరొకసారి నిరూపితమైన ఈ సత్యం అనేక పరీక్షాసందర్భాలలో ఆశలకు ఆలంబన అవుతూ ఉంటుంది. మార్పుకు ప్రాతినిధ్యవ్యక్తిగా చరిత్ర ఇచ్చిన అవకాశాన్ని సమర్థంగా వినియోగించుకుంటే, మమ్‌దానీ, ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రజాస్వామిక కార్యాచరణలకు ఒక నమూనాగా మిగులుతాడు.
“దాదాపు రెండు సంవత్సరాల పాటు అమానవీయమైన మారణకాండ జరుగుతుంటే, ప్రపంచమంతా మౌనంతోనో, నిర్లక్ష్యంతోనో దాన్ని అనుమతించింది. ఏ విలువలూ లేని శూన్యంలో కేవలం సుంకాలు, ఆంక్షలు, బెదిరింపులు, యుద్ధాలు మాత్రమే చెలరేగుతున్నాయి. అగ్రరాజ్య అధిపతి ఒక జులాయి బాహుబలి వలె ప్రపంచం ఎదుట విన్యాసాలు చేస్తున్నాడు. అతను, అతనివంటి అనేకులు, ప్రజాస్వామ్యాన్నీ, సామరస్యసహజీవనాన్ని, మానవప్రాణాలకున్న విలువను అపహాస్యం చేస్తున్నప్పుడు, ఒక యువకుడు, ఒక సాత్వికమైన, ఖచ్చితమైన, బాధితులకు ఆశ్వాసన ఇచ్చే ఎజెండాతో ప్రజలను మెప్పించి, గెలవడమంటే, మానవభక్షక మహామాయావిని ఎదిరించడమంటే, ఎంతటి విజయం? రేపటి సంగతి రేపు. ఇప్పటికిదే విజయం.”
కానీ, రేపు అతని ప్రయాణం అతను చెప్పిన రీతిలో సాగుతుందా? సాగడానికి వీలు కుదురుతుందా? ప్రజలు తాము ఎంచుకున్న విలువల కొనసాగింపు కోసం మమ్‌దానీ పైన, అతని బృందం పైనా తమ ప్రభావశీలతను నిలబెట్టుకోగలుగుతారా? వ్యవస్థను మమ్‌దానీ మార్చగలుగుతారా? లేక వ్యవస్థే మమ్‌దానీని మార్చివేస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం మనకు కొంతవరకు ఇప్పటికే తెలుసు. ఎంత కీలకమైనదైనప్పటికీ, న్యూయార్క్ వేదిక ఒక స్థానికమైన, ప్రతీకాత్మకమైన వేదిక మాత్రమే. దానికి మించి, ఈ మేయర్ ఎన్నిక ఆవిష్కరించిన విలువలు విస్తరిస్తే, ప్రతిఘటన ఎంత తీవ్రంగా ఉంటుందో ఊహించవచ్చు. అవతలి శిబిరం శక్తియుక్తులు మాత్రమే కాదు, ఈ పోరాటంలోని ఇవతలి వైపు సంకల్ప సామర్థ్యాలు, స్థైర్యం కూడా ఇక్కడ కీలకం.
అయినంత మాత్రాన, ఈ విజయం సంబరపడదగింది కాదా? ఒక చిన్న ఆశను వేడుక చేసుకోకపోతే, ఆశ ఎట్లా కొనసాగుతుంది? ప్రతి ఆశను ఎండమావి అనుకుంటే, అది నిరాశావాదం కాదా? జాగ్రత్తతో కూడిన ఆశ, అప్రమత్తత కలిగిన ఆనందం, కాలజ్ఞానులకు కాసేపు వదిలేసి, ఈ క్షణానికి పండుగ చేసుకుంటే అది నేరమా? సుదీర్ఘకాలంగా కుంగుబాటులో, ఆశారాహిత్యంలో అణగారిపోయి ఉన్న ఆత్మలు, కోలుకోవడానికి ఆనందాలను ఆశ్రయిస్తే తప్పేమిటి?
లోకం నడిచే తీరును బోధపరచుకోలేని సమాజం, సుఖదుఃఖాలకు, ఉత్థానపతనాలకు కారణాలను తనకు తోచిన విధంగా వ్యాఖ్యానించుకుంది. కావడికుండలనో, రంగులరాట్నమనో చెప్పి అనివార్యతలను అంగీకరించింది. మరణజననాల చక్రాన్ని , దివారాత్రాల పునరపిని, కొనసాగింపుల ప్రతీకలుగా భావించింది. అనూహ్యతలను ఆలంబన చేసుకుని ఆశను వరించింది. రేపటి గురించి భయం వద్దని ‘నందోరాజా భవిష్యతి’ అని చెప్పుకుంది. మనుగడలో మిగలడమే ప్రాథమికమైనప్పుడు, అందుకు అనుగుణ్యమైన అన్ని విలువలను ఆశ్రయించింది. అది ప్రారబ్దాన్ని నమ్మడమైనా కావచ్చు, యథాస్థితిని మార్చగలిగే చొరవ తీసుకోవడమైనా కావచ్చు. విరుద్ధశక్తుల ఘర్షణలో చరిత్ర పురోగామిత్వంలోనే సాగుతుందనే అవగాహన లేకపోయినా, మార్పు నిరంతరాయమని మునుపటి మనిషికి కూడా తెలుసు. మార్పు కోసం పనిచేయడం సరే, మార్పుకోసం ఎదురుచూడడం కూడా తెలుసు. సాంప్రదాయిక, ఆధ్యాత్మిక ఆలోచన నుంచి కూడా మనుషులు ఆశాసంకేతాలను చూసి, మంచిరోజులను కలగంటారు.
“ఇప్పుడు బిహార్ లో మహాగట్‌బంధన్ గెలిస్తే అదో విప్లవం అవుతుంది. అప్పుడు, కెసిఆర్ ఓడిపోతే చాలనుకున్నారు, రేవంత్ కావాలనుకున్నారా? రాహుల్ గాంధీ విప్లవకారుడా? అతన్ని చూస్తే అప్పడప్పుడు ఎందుకు కొంత ఆశ కలుగుతుంది? తనేమిటో తానే చెబుతూ ఆశలను పరిమితంగానే పెట్టుకోమని అతను సూచిస్తూనే ఉంటాడు. కానీ, అందరికీ ఆ నిజాయితీ ఉంటుందా? మమ్‌దానీ ఎక్కువ మాట్లాడుతున్నాడా? లేక విజయోత్సాహంలో తలమునకలైపోయి పెద్ద ఆశలు కల్పిస్తున్నాడా?”
కానీ, అనేక గతానుభవాలు మనలను హెచ్చరిస్తుంటాయి. ఆశలు కొన్ని సార్లు భ్రమలు మాత్రమే అని నిరూపణ అవుతాయి. భారత స్వాతంత్ర్యోద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం దాకా, ప్రజలు నాయకుల మీద, సంస్థల మీద పెట్టుకున్న ఆశలే కాదు, తాము స్వయంగా నిర్మించుకున్న ఆశలు కూడా ఎట్లా అనేక ఆశాభంగాలను ఎదుర్కొన్నాయో తెలుసును. అనేక కమ్యూనిస్టు విప్లవాలు, సాధనలో, కొనసాగింపులో నిలబడలేక ఎట్లా కుప్పకూలిపోయాయో తెలుసు. నెల్సన్ మండేలా, ఎంతగా రాజీపడి ఒక మోస్తరు స్వాతంత్ర్యాన్ని తెచ్చుకోవలసి వచ్చిందో, ఆ దేశం నేడు ఎంతటి అగమ్యతలో ఉన్నదో తెలుసు. విప్లవాలో, తిరుగుబాట్లో, ఉద్యమాలో విఫలమైనంత మాత్రాన, మళ్లీ మళ్లీ ప్రయత్నించకుండా మానవులు ఎట్లా ఉండరో, ఆశలు కలలు విరిగిపోయినంత మాత్రాన, వాటిని పొదగకుండా ఉండరు. ఉండలేరు. ఎందుకంటే, ఆశ నుంచే మనిషి సక్రియాత్మక ఆచరణ సాగుతుంది. పీడకలలకు భయపడి ఎవరూ కలలు కనకుండా ఉండరు.
ఎంతటి దుర్మార్గమైన, కఠోరమైన పరిస్థితులలో ఉన్నామో మనం ఒక్కోసారి గుర్తించలేము. దాదాపు రెండు సంవత్సరాల పాటు అమానవీయమైన మారణకాండ జరుగుతుంటే, ప్రపంచమంతా మౌనంతోనో, నిర్లక్ష్యంతోనో దాన్ని అనుమతించింది. ఏ విలువలూ లేని శూన్యంలో కేవలం సుంకాలు, ఆంక్షలు, బెదిరింపులు, యుద్ధాలు మాత్రమే చెలరేగుతున్నాయి. అగ్రరాజ్య అధిపతి ఒక జులాయి బాహుబలి వలె ప్రపంచం ఎదుట విన్యాసాలు చేస్తున్నాడు. అతను, అతనివంటి అనేకులు, ప్రజాస్వామ్యాన్నీ, సామరస్యసహజీవనాన్ని, మానవప్రాణాలకున్న విలువను అపహాస్యం చేస్తున్నప్పుడు, ఒక యువకుడు, ఒక సాత్వికమైన, ఖచ్చితమైన, బాధితులకు ఆశ్వాసన ఇచ్చే ఎజెండాతో ప్రజలను మెప్పించి, గెలవడమంటే, మానవభక్షక మహామాయావిని ఎదిరించడమంటే, ఎంతటి విజయం? రేపటి సంగతి రేపు. ఇప్పటికిదే విజయం.
నికార్సయిన ప్రత్యామ్నాయాల కోసం మాత్రమే ఎదురుచూసే విలాసం ఇప్పుడు ప్రజలకు లేదు. తక్కువ శత్రువులతో పొత్తు పెట్టుకుని ఎక్కువ శత్రువుతో యుద్ధం చేస్తాయని వామపక్షాలను ఎద్దేవా చేస్తుంటారు. ఇప్పుడు ప్రజలు కూడా ఆ స్థితికే చేరిపోయారు. తక్కువ ప్రమాదకారిని వరించి సంతోషిస్తున్నారు. పాక్షికంగా మాత్రమే ఆశపడడానికి సమాధానపడిపోయారు. ఇప్పుడు బిహార్ లో మహాగట్‌బంధన్ గెలిస్తే అదో విప్లవం అవుతుంది. అప్పుడు, కెసిఆర్ ఓడిపోతే చాలనుకున్నారు, రేవంత్ కావాలనుకున్నారా? రాహుల్ గాంధీ విప్లవకారుడా? అతన్ని చూస్తే అప్పడప్పుడు ఎందుకు కొంత ఆశ కలుగుతుంది? తనేమిటో తానే చెబుతూ ఆశలను పరిమితంగానే పెట్టుకోమని అతను సూచిస్తూనే ఉంటాడు. కానీ, అందరికీ ఆ నిజాయితీ ఉంటుందా? మమ్‌దానీ ఎక్కువ మాట్లాడుతున్నాడా? లేక విజయోత్సాహంలో తలమునకలైపోయి పెద్ద ఆశలు కల్పిస్తున్నాడా?
మావోయిస్టులు నడుపుతున్నవిప్లవోద్యమం మీద ప్రభుత్వం తీవ్రమైన దమనకాండ సాగిస్తూ, ఇక ఆ ఉద్యమం ముగిసినట్టే అన్న అభిప్రాయం కలుగుతున్నప్పుడు, రాజకీయ, భావోద్వేగ వ్యాఖ్యాతలు, ఈ వ్యాసకర్తతో సహా, ప్రజారాజకీయాల పునరుత్థాన శక్తి గురించి చెప్పి ఓదారుస్తుంటారు. అటువంటి నిరాశ కానీ, ఆశాభావం కానీ, భావనాత్మకమేనా, వాస్తవ స్థితిగతులతో అవి సమన్వయిస్తాయా? తెలియదు. తాము సానుకూలమనుకున్న అంశాల గురించి చైతన్యయుతమైన స్పందనలుండాలన్న తపన తప్ప, సాధ్యాసాధ్యాల గురించి వారికి పెద్ద పట్టింపు ఉండదు.
ఎండమావి చివరకు దగా చేయవచ్చును కానీ, అక్కడిదాకా చేసే ప్రయాణంలో అది ప్రాణం నిలుపుతుంది. టాగోర్ రాసినట్టు, విశ్వాసం అనే పక్షి, ఇంకా తెల్లవారకముందే వెలుతురును అనుభవించి పాడుతుంది.
చిన్న విజయం నుంచి పెంచుకునే అత్యాశ అయినా, కుంగుబాటు నుంచి ధైర్యం తెచ్చుకోవడానికి ఊహించే మిణుగురు ఆశ అయినా – జీవశక్తిని ఒకే విధంగా నిలబెడతాయి.
కలవరపాట్లకు కష్టపడక్కరలేదు, అయాచితంగా కలుగుతూనే ఉంటాయి! అరుదుగా దొరికే ఆశలను ఎందుకు పారేసుకోవడం!?




