ఎనభై సంవత్సరాల కిందట, 1944 సంవత్సరం ఆగస్టు 20న బొంబాయి నగరంలో ఇందిరకు రాజీవ్ గాంధీ జన్మించినప్పుడు జవహర్ లాల్ నెహ్రూ కారాగారంలో నిర్బంధం అనుభవిస్తున్నారు. జవహర్ లాల్ ఆలోచనలు అప్పుడే పుట్టిన రాజీవ్ మీద కేంద్రీకృతమయ్యాయి. స్వాతంత్య్రానంతరం రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ బాల్యం తాత జవహర్ లాల్‌తో గడచింది. జవహర్ లాల్ ప్రభావం ఇద్దరి మీద ప్రసరించి ఉంటుంది. అయినా, రాజకీయాలలో, అధికారంలో సంజయ్‌కి గల ఆసక్తి రాజీవ్ కి అనిపించలేదు. ఇద్ద రు సోదరులది భిన్న మనస్తత్వం, విభిన్న మార్గాలు. ఝంఝా మారుతం వలె సంజయ్ విజృంభించారు, మలయ పవనం వలె రాజీవ్ ప్రవర్తించారు. రాజీవ్ కుటుంబ జీవనంలో శ్రద్ధ కనబరచారు. తమ్ముడు సంజయ్ దుర్మరణం, విస్సహాయురాలు తల్లి ప్రోద్బలం రాజీవ్ గాంధీని (సతీమణి సోనియా వ్యతిరేకించినా) భారత రాజకీయ రంగంలో ప్రవేశపెట్టాయి. రాజకీయ రంగంలో అడుగుపెట్టిన తరువాత ఆయన వెనుకకు తిరిగి చూడలేదు.
తల్లి దారుణ హత్యతో రాజకీయ అల్లకల్లోలం సంభవించి, దేశ పరిపాలనా బాధ్యత తన యువ భుజస్కంధాల మీద హఠాత్తుగా పడినప్పుడు రాజీవ్ అచంచల మనో స్థైర్యం ప్రదర్శించారు. అధికారాన్ని, బాధ్యతలను చేపట్టి ఆయన సవాళ్లను విషమ పరీక్షలను ధైర్యంతో ఎదుర్కొన్నారు. ‘నేను యువకుడిని, నాకు ఎన్నో కలలు’ అని రాజీవ్ ప్రకటించారు. మాతృభూమి భారత దేశాన్ని విజ్ఞాన శాస్త్రం, టెక్నాలజీ సహాయంతో అన్ని రంగాలలో ‘అత్యాధునికంగా ఒకటో శతాబ్దిలోకి పురోగమింప జేయాలని కలలుగన్నారు. రాజీవ్ గాంధీ రాజకీయ కుతంత్రాలు, కుట్రలు తెలియని స్వాప్నికుడు. రక్తసిక్తమయిన పంజాబ్ లో శాంతి స్థాపన కొరకు అకాలీ అధినేత లోంగోవాల్ తో కుదుర్చుకున్నఒప్పందం, అరాజకత్వం పాలయిన అస్సాంలో శాంతి భద్రతలు, సామరస్యం కోసం అఖిల అస్సాం విద్యార్థి సంఘం నాయకులతో చేసుకున్న ఒప్పందం, కాశ్మీరులో సామరస్యం కోసం చేసిన ప్రయత్నాలు రాజీవ్ సాధించిన చరిత్రాత్మక విజయాలు. అమెరికాలో పర్యటించి రాజీవ్ అమెరికన్ల హృదయాలను అపూర్వ రీతిలో సొంతం చేసుకున్నారు.
చైనాలో రాజీవ్ పర్యటన మహత్తరమయినది. చైనా అధినేత డెంగ్సియావోపింగ్ తో రాజీవ్ కరచాలనం ఎన్నటికీ మరువలేనిది. అనేక సంవత్సరాల నుంచి స్తబ్దమయిన భారత, చైనా సంబంధాలలో చైతన్యం కల్గించి, ‘తిరిగి స్నేహలతను చిగురింపజేయడానికి రాజీవ్ పర్యటన అమితంగా దోహదపడింది. అనేక దేశాలలో పర్యటించి రాజీవ్ భారత మహోన్నత ప్రతినిధిగా కోట్లాది ప్రజల హృదయాలను అలరించారు. నీరసిస్తున్న అలీన ఉద్యమానికి వినూత్న శక్తిని ప్రసాదించడంలో రాజీవ్ నిర్వహించిన పాత్ర విశిష్ట మయినది. వెనుకబాటు తనం, పేదరికం కోరల్లో చిక్కుకున్న ఆఫ్రికన్ ప్రజల సర్వతోముఖ అభివృద్ధి కోసం రాజీవ్ గాంధీ చొరవతో ఏర్పాటయిన ఆఫ్రికానిధి ఆయన మానవతా దృక్పథానికి మణిదీపం అని చెప్పాలి.
తన చుట్టూ ఉన్న వారందరూ తన వంటి నిర్మల హృదయులని, తన వాళ్లని, తనతో లాభపడుతున్న వారు కృతజ్ఞులని, కృతఘ్నులు కారని భ్రమపడి రాజీవ్ మోసపోయారు. నీచ రాజకీయాలకు నిలయం కాకూడని రాష్ట్రపతి భవన్ రాజకీయ కుతంత్రాలతో రాజీవ్ కు వ్యతిరేకంగా బుసలు కొట్టింది. ఏమయినా రాజీవ్ గాంధీ పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఉన్నత సంప్రదాయాలకు ఎన్నడూ భంగం కల్గించలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకు ఆయన అహర్నిశలు నిర్విరామ కృషి జరిపారు. యువ శక్తి మీద అపార విశ్వాసం తో రాజీవ్ వోటింగ్ హక్కు వయోపరిమితి పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించారు. పర్యవసానంగా దేశంలో ఎన్నో కోట్ల మంది యువకులకు వోటు. హక్కు లభించింది. అట్టడుగు స్థాయి ప్రజలకు అధికారాన్ని అప్పగించి అధికార వికేంద్రీకరణ ‘ జరిపే ఉదాత్త ఆశయం తో రాజీవ్ 73వ, 74వ రాజ్యాంగ సవరణలు జరిపి పంచాయతీలకు, స్థానిక స్వపరిపాలనా సంస్థలకు అనేక అధికారాలు అందించారు.
వాటిలో స్త్రీలకు 33 శాతం స్థానాలను రిజర్వ్ చేయించారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం రాజీవ్ ప్రవేశ పెట్టినదే.. దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఘనత రాజీవ్. ఆయన నేతృత్వంలో ఆర్థిక మంత్రిగా వి.పి.సింగ్ సమర్పించిన బడ్జెటు ఆర్థిక సంస్కరణలకు నాంది పలికింది. 1991 లోక్ సభ ఎన్నికల సందర్భంగా రాజీవ్ మార్గదర్శకత్వంలో కాంగ్రెస్ రూపొందించిన ఎన్నికల ప్రణాళిక ఆయన దూరదృష్టికి, రాజ నీతిజ్ఞతకు, ఆయన అభ్యుదయ భావాలకు, ఆయన బంగారు కలలకు ప్రబల నిదర్శనం. దేశానికి వినూత్న, యువ నాయకత్వం లభించిందని సంతో షించిన వారందరికి 1991 మే నెల 21వ తేదీన రాజీవ్ ఘోర హత్య అశనిపాతమైంది. ఈ దేశం ఎన్నడూ విస్మరించలేని యువ నాయకుడు రాజీవ్…
-ప్రజాతంత్ర





