వెంటాడే ఇంటి దిగులు

మేం అమెరికా చేరుకొని దాదాపు పాతికేళ్లు కావస్తోంది. ఇప్పటికీ పుట్టినగడ్డకి దూరంగా వున్నామన్న భావన బలంగానే వుంది. సామాజిక మాధ్యమాలు ఎంత ‘దగ్గిర’గా వున్నా, ఈ దూరాన్ని మాత్రం అవి చెరిపేయలేవని రోజురోజుకీ బలపడుతోంది. ముఖ్యంగా భాష అనే ముడిసరుకుతో పనిచేసే రచయితలకూ, పరిశోధకులకూ, అధ్యాపకులకూ ఇది రోజువారీ వేదన. అమెరికన్ జీవనశైలి ఎప్పటికైనా  అలవాటవుతుందని నేను ఇప్పటికీ అనుకోవడం లేదు. బహుశా, అది  మా తరవాతితరంలో కొంత సాధ్యం కావచ్చు. ఈ కోణం నుంచే ప్రవాస స్థానికత గురించి మాట్లాడవచ్చు. ఎక్కడ వున్నా వెంటాడే ఇంటి దిగులు– అదే ప్రస్తుతం నా రచనలకు ఆలంబన కావచ్చు. స్థానికతకి ఇంకో కోణం ‘ప్రవాస స్థానికత” అని ఇంతకుముందే నా ‘కథ-స్థానికత’ వ్యాసాల్లో కొంత చెప్పాను. అయితే, ప్రవాస స్థానికత నిజంగా తెలుగు సాహిత్యంలోకి ప్రవేశించింది మాత్రం సెప్టెంబరు 11 తరవాతనే. అదీ కొంతమంది మాత్రమే ఆ వాతావరణాన్ని సాహిత్యంలో పట్టుకోగలిగారు.

ఆ సెప్టెంబర్ 11 పరిణామాల ప్రభావం ఇంకా తీవ్రంగా వున్నకాలంలోనే మేం అమెరికాలో అడుగుపెట్టాం. చాలామంది మిత్రులు ఆ సమయంలో అమెరికాలో మా భవిష్యత్తు గురించి కంగారుపడ్డారు. ఈ పరిణామాల వల్ల ఏమవుతుందో అన్న భయం మాలోనూ వుంది. అదేసమయంలో యూనివర్సిటీ కాంపస్ లో ముస్లిం విద్యార్థుల ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. వీటన్నీటి మధ్యా వుండే సందిగ్ధం మొదట నా కవిత్వంలోనూ, తరవాత నా కథల్లోనూ కొంత వ్యక్తం చేశాను. ముస్లిం అస్తిత్వానికీ, చైతన్యానికి సంబంధించిన కొత్తఆలోచనలు ప్రవేశించినకాలం ఇది. వీటిని తెలుగు సాహిత్య సందర్భంలో ఎలా చూడవచ్చు అన్న ప్రశ్న తరవాతి నా పరిశోధనలకూ, నా టీచింగ్ కీ బాగా వుపయోగపడింది. ఈ విధమైన అన్వేషణే 2013 తరవాత ‘సారంగ’ పత్రికలో వనరుగా మారింది.

ఈ దశ అమెరికాలోని నల్లజాతివాళ్ళ ఉద్యమాలవల్ల ఇంకా ఊపు అందుకుంది. ఈ రెండుదశల్లోనూ నేను వ్యక్తిగా, రచయితగా చాలా నేర్చుకున్నాను. పైగా, యూనివర్సిటీ అధ్యాపకుడిగా నిరంతరం కొత్త తరానికి దగ్గిరగా మసులుకుంటూ వుండడం వల్ల ఆ ఉద్యమాల అనేకకోణాలకి ప్రత్యక్షసాక్షిగా కొన్ని రచనలు చేశాను. ఇంకా రాయాల్సింది వుంది. ముఖ్యంగా, ఈ దశాబ్దంలో తెలంగాణ ప్రవాసుల సంఖ్య పెరగడం వల్ల ఒక తెలంగాణ రచయిత మీద మరింత భారం పడింది. అయితే, అమెరికాలాంటి చోట ఇప్పటికీ తెలంగాణ స్థానికులు తక్కువే. సాహిత్యంలో మరీ తక్కువ. ఈ వెలితిని పూరించే భారం కూడా ఇప్పుడున్న కొద్దిమంది  అమెరికా తెలంగాణ రచయితల మీద వుంది. అందులో కొంతైనా భాగస్వామ్యం పంచుకోవాలని నా ఆకాంక్ష.

అస్తిత్వాన్ని గురించి బహుముఖ కోణం నుంచి ఎలా చెప్పాలన్న తపన మొదలైంది. అమెరికా రాకపోతే ఇది సాధ్యమయ్యేది కదా అంటే, సాధ్యమయ్యేది కానీ, ఈ ఒరవడిలో కాదు. ఈ ఉరవడిలో కాదు. రచనకి దృక్పథమే కాదు, ఎలాంటి దృక్పథం వుండాలన్న విషయంలో మొదటినించీ– అంటే కారంచేడు, చుండూరు బాధితులను దగ్గిరగా చూసిన నా బెజవాడ రోజుల నుంచే వున్నా- అమెరికా వచ్చాక, ఇక్కడి లాటిన్ అమెరికన్లూ, ఆఫ్రికన్ అమెరికన్లూ, ముస్లిందేశాల వలస ప్రజలూ ఇచ్చిన అనుభవ సంపద గొప్పది. అలాగే, వాళ్ళ అనుభవంలోంచి ప్రసరించిన జ్ఞానసంపద, వనరులూ నా మటుకు నాకు అద్భుతమైన treasure mine.

తరవాతిదశలో ప్రవాసంలో కూడా తెలంగాణ ఉద్యమ సందర్భం బలపడడం వల్ల అమెరికాలోని వివిధ నగరాలకు వెళ్ళి మాట్లాడే అవకాశం దొరికింది. ముఖాముఖీ కలయికల వల్ల కొత్త భావోద్వేగాలు తెలిసి వచ్చాయి. ముఖ్యంగా, వృత్తులపరంగా తెలంగాణ ప్రవాసుల్లో వున్న వైవిధ్యం తెలిసింది. ఈ భిన్నత్వాన్ని చెప్పడానికి ఇంకా ప్రయత్నిస్తూనే వున్నా. అలాగే, ప్రాంతాలని బట్టి మారే స్వభావాలూ, దృక్పథాలూ ఇక్కడా గట్టిగానే పనిచేస్తాయి. ఉదాహరణకు: నేను టెక్సాస్ లో వున్నప్పుడు రాసిన కవిత్వమూ, కథలు వేరు. ఇప్పుడు ఫిలడెల్ఫియా వచ్చాక రాస్తున్న రచనలు వేరు. తెలంగాణని, ఇతర అస్తిత్వ సమూహాల వారితో సరిపోల్చి ఎలా మాట్లాడవచ్చో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. అలాగే, కేవలం కవిత్వం సరిపోదనీ, వచనంలోకి ప్రయాణించడం వల్ల ఈ భిన్నత్వం ఇంకా బాగా చెప్పవచ్చనీ గట్టిగా అనుకుంటున్నా. ఆ విధంగా తెలంగాణ వివిధ ఉద్యమదశలనుంచి ఇంకా నేర్చుకుంటూనే వున్నా.

అమెరికా వచ్చిన తొలిరోజుల్లోనే నాకు వివిధ అంతర్జాతీయ సాహిత్యసదస్సుల్లోనూ, పొయెట్రీ రీడింగ్ సెషన్స్ లో కూడా పాల్గొనే అవకాశం దక్కింది. అక్కడ నేను ముఖ్యంగా చదివిన రచనలు తెలంగాణ ముస్లిం అస్తిత్వానికి సంబంధించినవే కావడం వల్ల అవి ఎక్కువ చర్చలకు దారితీసాయి. ఒక అంతర్జాతీయ వేదికమీద తెలంగాణ ముస్లింగా ఎలా మాట్లాడవచ్చు అనేది ఈ దశలోనే నేర్చుకున్నా. యూనివర్సిటీలలో ముస్లిం జీవన నేపథ్యాలనుంచి రాసే, మాట్లాడే అనేకదేశాల వాళ్ళతో ఏర్పడిన పరిచయాలు తరవాత స్నేహాలుగా మారాయి.

అయితే, ఎంత స్నేహం వున్నా లోపల డొల్లతనం వుంటే అసలేమాత్రం ఒప్పుకోని కఠినమైన రచయితలూ, విద్యావేత్తల మధ్య సంచరించడం వల్ల చాలా నేర్చుకున్నా. అంత కఠినత్వం నేర్చుకోలేదు కానీ, కొంత సూటిదనం అలవాటైందని మాత్రం చెప్పగలను. అలాగే, ప్రపంచ సాహిత్యం ఎక్కువగా చదువుకునే అవకాశం దొరికింది. గొప్ప స్కాలర్లతో కలిసి పనిచేసే అవకాశం దక్కింది. ఇవన్నీ నాలోపలి రచయితకి కొత్త ఊపిరి అందించాయనే చెప్పాలి. చరిత్ర పరిశోధకుడిగా, అధ్యాపకుడిగా ఏమైనా సాధించి వుంటే అది కేవలం అమెరికా వలసజీవనం వల్లనే సాధ్యపడిందని మాత్రం ఖాయంగా చెప్తాను.

-అఫ్సర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *