-రాలుతున్న గులాబీ రేకులు
– ఉత్సాహం నింపని రజతోత్సవం
– కుటుంబ కలహాల కుంపట్లో ఉద్యమ పార్టీ
– కూలుతున్న ఉద్యమ సౌధం
-కె.సి.ఆర్. మౌనం వెనుక మర్మమేంటో?
-అధికారం కోసం అన్నాచెల్లెలి పోటీ
(మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి )
ప్రత్యేకరాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ వొచ్చేనెల జూన్ 2న 12వ వసంతంలో కాలిడబోతున్నది. గత సంత్సవరంతో పోలిస్తే ఈ ఏడు అత్యంత ఘనంగా ఉత్సవాలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. పతాకా విష్కరణలు, ప్రసంగాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పాలనాపరంగా తీసుకునే పలు కార్యక్రమాలను ఆ రోజున ప్రకటించేందుకు సిద్దమైంది. అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా పేరున్న బి(టి)ఆర్‌ఎస్ మాత్రం పెద్ద చిక్కులోపడింది. రాష్ట్రసాధన తర్వాత తొమ్మిదిన్నర సంవత్సరాలు నిరాఘాటంగా పాలించిన బిఆర్‌ఎస్ ఇప్పుడు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. ఉద్యమ పార్టీగా పేరున్న ఆ పార్టీలో అంతర్యుద్దం మొదలైంది. అధికారం కోల్పోవడానికి ముందు దశాబ్ది ఉత్సవాల పేర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఇరవై ఒక్క రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన ఈ పార్టీ, మరో నాలుగు రోజుల్లో ప్రారంభంకానున్న వేడుకల సమయానికి చిక్కుల్లో పడటం గమనార్హం. పార్టీ అధినాయకుడిగా మాజీముఖ్యమంత్రి కెసిఆర్ ఇంకా అపదవిలో కొనసాగుతుండగానే పార్టీ అధిపత్యం పైన కుటుంబ సభ్యుల మధ్య తగాదా కొనసాగుతున్నది. వాస్తవానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కెసిఆర్ రెండవసారి బాధ్యతలు స్వీకరించడానికి ముందునుండే ఈ చర్చ మొదలైంది. ప్రధానంగా కెసిఆర్ కుటుంబ సభ్యుల్లోని ముగ్గురి లక్ష్యంగానే చర్చ జరుగున్నది. అది చిలికి చిలికి జడివానగా మారుతుందని కనీసంగా నైనా ఎవరూ ఊహించి ఉండరు. కాని, కెసిఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రికి రాసిన లేఖ మొత్తంగా రాష్ట్ర రాజకీయానే కుదిపివేస్తున్నది. పార్టీ అధ్యక్షుడికి కాకుండా తన తండ్రికి రాసిన లేఖ ఎలా బహిర్గతమైందన్న ప్రశ్నలోనే ఈ ఎపిసోడ్ మర్మం దాగి ఉంది.
తెలంగాణ ప్రత్యేకరాష్ట్రంగా కావాలన్న డిమాండ్‌తో 2001లో టీ(బి)ఆర్‌ఎస్ ఏర్పడింది. పద్నాలుగు ఏండ్ల పోరాటం ఫలితంగా రాష్ట్రాన్ని సాధించిన ఆపార్టీ అధినేత కెసిఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొమ్మిదిన్నర సంవత్సరాలు పాలన సాగించారు. మొదటినుండి కూడా తెలంగాణ తన అస్తిత్వం కోసం పోరాటం చేస్తూ వొస్తున్నది. ఈ అస్తిత్వానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. సాయుధ రైతాంగ పోరాటమైతేనేమీ, నిజాం నిరంకుశంపైన జరిగిన పోరాటమైతేనేమీ, తొలి మలి విడత తెలంగాణ పోరాటమైతేనేమీ తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి స్థానిక ప్రజల సంఘటిత పోరాటాలు చరిత్రపుటల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి. 1969 కన్నా ముందు కూడా తెలంగాణ కోసం విడతలవారీగా పోరాటాలు జరిగాయి. ఆ పోరాటాల్లో పలువురు నిర్బంధానికి గురికాగా, మరికొందరు ప్రాణత్యాగం చేశారు. అదే క్రమంలో తొలి తెలంగాణ పోరాటంగా చెప్పుకుంటున్న 1969లో కూడా సుమారు 360 మంది ప్రాణాలు కోల్పోయారు. సుదీర్ఘకాలం సాగిన మలివిడత పోరాటంలో వందల సంఖ్యలో ప్రజలు మృత్యువాతపడ్డారు. ఇందులో చాలామంది ఆత్మార్పణం చేసుకోవడమే ఇక్కడ విచారకర విషయం. ఈ ప్రాణత్యాగాలన్నీ ఇక్కడి ప్రజలు తమ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు చేసిన పోరాటాల వల్ల జరిగినవే. మలివిడత పోరాటాల్లో తెలంగాణ ప్రజల సంపూర్ణ భాగస్వామ్యం వల్లనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిందన్నది కాదనలేని నిజం. రాష్ట్రంలోని అన్ని కులసంఘాలు, సంస్థలందరిదీ ఈ పోరాటంలో ప్రత్యక్ష పాత్ర ఉంది. వీరందరిదీ అస్తిత్వ పోరాటమే. ఈ అస్తిత్వపోరాటం నుండి పుట్టిందే బిఆర్‌ఎస్. అధికారం చేపట్టిన తర్వాత ప్రజల ఆశలు, ఆశయాలను ఆ పార్టీ నాయకత్వం మరిచిపోయింది. ఉద్యోగ ఉపాధి రంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.
తెలంగాణా ఆత్మ గౌరవ పతాకను ఉద్యమ సమయంలో అంతర్జాతీయ స్థాయిలో రెపరెప లాడించించిన తెలంగాణా రాష్ట్ర సమితి ..రాష్ట్ర ఆవిర్భావం తరువాత 9 సంవత్సరాలు అధికారంలో ఉండి ..భారత రాష్ట్ర సమితి గా రూపాంతరం చెందిన నాటి నుంచే తన సొంత అస్థిత్వం కోసం తండ్లాడే దుస్థితి ఏర్పడింది… ఈ రోజు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కుటుంబ కొట్లాటలు రోడ్డున పడ్డాయి. పార్టీ మనుగడ ప్రశ్నార్థకం కానుందా ? భవిష్యత్తులో జాతీయ పార్టీల ఏలుబడిలోకి రాష్ట్రం పోనుందా ? పక్క రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం, జనసేన , వై ఎస్సార్ సీపీ, తమిళ నాడులో డి ఎమ్ కె , అన్నాడిఎమ్ కె లు బలంగా ఉన్నాయి. జాతీయ పార్టీలకు చోటివ్వడం లేదు. తెలంగాణా లో కూడా మరో ప్రాంతీయ పార్టీ కి అవకాశముందా ? ఫెడరల్ వ్యవస్థలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండాలని విశ్వసించే తెలంగాణా ప్రాంతీయ అభిమానం ఉన్న పలువురిని తొలుస్తున్న ప్రశ్న!
గత ప్రభుత్వాలను తలపించే విధంగా ధర్నాలు, ఆందోళనలపై అంకుశం మోపింది. అనేకమంది పైన కేసులు బనాయించింది. పోరాట యోధులను నిర్లక్ష్యం చేసింది. సాహితీ, సంస్కృతి రంగాలకు ఇవ్వాల్సినంత గౌరవాన్ని ఇవ్వలేదు. ఉద్యమంలో ఉర్రూతలూగించిన ‘జయజయహే తెలంగాణ’ పాటను జాతీయ గీతంగా ఆమోదించలేకపోయింది. ఉద్యమంలో కలిసి నడిచినవారిని పొమ్మనలేక పొగపెట్టినట్లు చేసింది. తెలంగాణకోసం ఉద్భవించిన అనేక పార్టీలను తనలో ఐక్యం చేసుకుని, వాటి అధినేతలకు బిఆర్‌ఎస్‌లోకాని, ప్రభుత్వంలోగాని చోటులేకుండా చేసింది. ఈ స్వయంకృతాపరాధ ఫలితాన్ని 2023 ఎన్నికల్లో అనుభవించింది. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుతుందనుకున్న బిఆర్‌ఎస్ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌కు అప్పగించింది. కాంగ్రెస్, బిజెపిలు జాతీయ పార్టీలు. ప్రాంతంపట్ల ప్రాంతీయపార్టీలకున్న శ్రద్ద, అవగాహన జాతీయ పార్టీలకు ఉండదన్నది స్థానిక ప్రజల అభిప్రాయం. తమిళనాడు మాదిరిగానే జాతీయపార్టీలను అధికారంలోకి రానివ్వకుండా డిఎంకె, ఆన్నా డిఎంకెల్లో ఏది అధికారంలో ఉన్నా ప్రాంత ప్రజల, అభివృద్ది విషయంలో ప్రాంతం వారికే నిర్ణయాధికారం ఉంటుందన్న అభిప్రాయాలున్నాయి. ఇక్కడ అధికారం కోల్పోగానే బిఆర్‌ఎస్‌నుండి ప్రజాప్రతినిధలు చెయ్యిజారడం ప్రారంభమైంది.
ఇప్పటికే పదిమంది ఎమ్మెల్యేలు , పదిమంది ఎమ్మెల్సీలు నిష్క్రమించారు. కోర్టు కేసు కారణంగా మరికొందరు దర్వాజాల్లో వేచిచూస్తున్న వారు లేకపోలేదు. మరోపక్క జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ అద్భుతమని మురిసిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు తలమీద కత్తిలా వేలాడుతున్నాయి. వీటికితోడు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు ఎమ్మెల్సీ కవిత బాంబులా పేల్చిన లేఖాస్త్రం ఆ పార్టీని నలిపేస్తున్నది. ఇది ఆ పార్టీలో ఆధిపత్య పోరన్నది స్పష్టమవుతున్నది. ఉద్యమసారధి కెసిఆర్‌కు చేదోడుగా విదేశాల నుంచి వొచ్చిన అన్నా చెల్లెలు కెటిఆర్, కవిత మంచి రాజకీయ నాయకులుగా ఎదిగారనడంలో అతిశయోక్తిలేదు. మూడు భాషల్లో అనర్గళంగా మాట్లాడి ప్రజలను ఆకట్టుకునే సామర్థ్యం ఉన్న వీరు నిన్నటి వరకు అరమరికలు లేని అన్నా చెల్లి గానే అందరూ భావించారు. అయితే 2018 పార్లమెంటు ఎన్నికల నుండి కవిత అంతర్గతంగా రగిలిపోతున్నదన్న విషయం గురువారం మీడియాతో ఆమె జరిపిన చిట్‌చాట్‌ద్వారా బయటపడింది. తాను ఎంపీగా ఎన్నిక కాకుండా పార్టీలోని వారే వ్యతిరేకంగా పనిచేసిన విషయాన్ని చెప్పడం ద్వారా ఆమె అందరినీ ఆలోచనలో పడేసింది. దానికి ముందు తన తండ్రికి రాసిన లేఖ వెలుగుచూసిన విషయంపైనే ఆమె పట్టుదలగా ఉంది. దాన్ని మీడియా ముందుకు తెచ్చినవారెవరన్నది తేలితేగాని కుట్రదారులెవరన్నది బహిర్గతమవుతుందంటున్న కవిత, ఈ సందర్భంగా మీడియాతో పంచుకున్న మాటలు పరోక్షంగా తన సోదరుడు కెటి రామారావు వైపు వేలెత్తి చూపేదిగా ఉంది.
ఏదిఏమైనా దీనికంతకు వరంగల్‌లో భారీస్థాయిలో నిర్వహించిన పార్టీ రజతోత్సవ సభ అంకురార్పణగా మారింది. ఆ సభలో జరిగిన మంచి చెడులు, కెసిఆర్ ప్రసంగంలో చోటుచేసుకున్న చేసుకోవాల్సిన అంశాలపైన ఒక తండ్రికి కూతురుగా ఇచ్చిన నివేదిక బహిరంగం కావడం తెలంగాణ రాజకీయాలను ఇప్పుడు కుదిపేస్తున్నది. గత రెండు మూడు రోజులుగా మీడియాలో ఇది ప్రధాన చర్చనీయాంశంగా మారింది. బిఆర్‌ఎస్ బిజేపీకి దగ్గర అవుతుందని కొందరు, కవిత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనుందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ఇప్పటికే ప్రత్యేక రాజకీయ పార్టీ ఏర్పాటుకు కవిత రంగం సిద్దం చేసుకుందని మరికొన్ని రాజకీయ విశ్లేషణలు వినవొస్తున్నాయి. ఇది కేవలం టీ కప్పులో తుఫాన్ లాంటిదే అన్నట్లుగా కవిత కొట్టిపారేస్తున్నా, ఆ దిశగానే ఆమె కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఉద్యమ కాలంనుండీ ఆమె ఆధ్వర్యంలో కొనసాగుతున్న జాగృతి సంస్థ శాఖలను ఆమె విస్తృతం చేయడమే అందుకు నిదర్శనం. ఇదిలాఉంటే దీనిపై ఇంతవరకు కెసిఆర్ స్పందించనేలేదు. పైగా ఈ విషయంలో ఎవరూ జోక్యంచేసుకోవొద్దని ఆయన హెచ్చరించినట్లు తెలుస్తున్నది. పక్క రాష్ట్రమైన ఏపిలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ షర్మిల మధ్య నెలకొన్నట్లుగానే ఇక్కడ కూడా కవిత, కెటిఆర్ మద్య నెలకొన్న విభేదాలు తారస్థాయికి చేరుకున్నట్లు స్పష్టమవుతున్నది. అయితే ఆక్కడ ఆ పార్టీ అధినాయకుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అకస్మాత్తుగా మృతిచెందిన తర్వాత వారిద్దరి మధ్య విభేదాలు పొడసూపాయి.
కాని ఇక్కడ పార్టీ అధినేతగా ఇంకా కెసిఆర్ కొనసాగుతుండగానే ఆధిపత్యం కోసం కొట్లాడుకోవడం చూస్తుంటే, పార్టీపైన కెసిఆర్ పట్టు సడలిందేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలాకాలంగా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నట్లు ఆయనేమైనా ఆనారోగ్యంగా ఉన్నారా అన్న అనుమానానికి తావేర్పడుతున్నది. కాని పక్షంలో ఇంకా ఎన్నికలకు మూడేళ్ళ సమయం ఉండగానే పార్టీ ఆధిపత్యం కోసం బహిరంగ యుద్దానికి వీరెందుకు దిగినట్లన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వాస్తవంగా కవిత ఎపిసోడ్ కన్నా ముందు కెసిఆర్ మేనల్లుడు హరీష్‌రావు పార్టీ వీడిపోతాడని, ఆయనే కొత్తగా పార్టీ ఏర్పాటు చేస్తాడని లేదా బిజెపిలోకి వెళ్తాడన్న వార్తలు విస్తృతంగా చక్కర్లు కొట్టాయి . హరీష్‌రావు వాటిని నిర్ద్వదంగా కొట్టిపారేశారు. కెసిఆరే తమ నాయకుడని, కెటిఆర్‌కు సారధ్యం అప్పగించినా ఆయన నేతృత్వంలో పనిచేస్తానని చెప్పడం ద్వారా ఆయన ఆరోపణలకు అడ్డుకట్ట వేశారు.
అయితే కవిత విషయంలో హరీష్‌రావు సైలెంట్ వెనుక అర్థాలు వెతుకుతున్నారు. పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరున్న ఆయన పోటీపడుతున్న ఇద్దరిలో ఎటువైపుంటారన్న విషయం కూడా ప్రబలంగా చర్చ జరుగుతున్నది. ఇదిలా ఉంటే కవిత లేఖ బహిర్గతం కావడం వెనుక వారి కుటుంబానికి సంబందించిన మరో వ్యక్తి సంతోష్ (మాజీ ఎంపి)పేరుకూడా ప్రచారంలోకి వొచ్చింది. బహిర్గతమైన లేఖపైన కవిత కామెంట్ చేసినప్పుడు ఆయన విదేశంలో ఉన్నట్లు తెలిసింది. ఇందులో ఆయన పాత్ర ఏమిటన్నది కూడా స్పష్టంకావల్సి ఉంది. తెలంగాణ రాష్ట్ర పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఉత్సాహ పడుతున్న బిఆర్‌ఎస్ శ్రేణుల్లో ఇప్పుడు నిర్వేదం చోటుచేసుకుంది. ఈ ఎపిసోడ్‌తో కవిత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటోంది. కెటిఆర్ యుకె, యుఎస్ పర్యటనలో ఉన్నారు. కెసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ఎంక్వైయిరీ కమిటి ముందు హాజరయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకల నాటికైనా తమ పార్టీలో నెలకొన్న ఉధృత వాతావరణం చల్లారుతుందేమోనన్న ఆశాభావం గులాబీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.





