ఉల్లంఘనలు కనబడని, వినబడని ఎలక్షన్ కమిషన్!

“జూబిలీ హిల్స్ ఉప ఎన్నికలలో పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎల్ దీపక్ రెడ్డికి ప్రచారంలో మాట్లాడుతూ బండి సంజయ్, ఆ అభ్యర్థి గుణగణాల గురించి చెప్పి వోటు అడిగే బదులు, ఈ ఎన్నికను హిందువులకూ ముస్లింలకూ మధ్య యుద్ధంగా అభివర్ణించి, హిందువులందరూ బిజెపి అభ్యర్థికి వోటు వేయాలని కోరారు. భారతదేశంలో ఎన్నికలను నిర్దేశించే 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 123 (3) వోట్లు అడగడానికి మతాన్ని ప్రాతిపదికగా చూపడాన్ని కచ్చితంగా నిషేధించింది. అటువంటి “అక్రమ ప్రవర్తనకూ ఎన్నికల నేరానికీ” పాల్పడితే మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించాలని కూడా సెక్షన్ 125 ఆదేశించింది.”

అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్, బిజెపి ప్రధాన ప్రత్యర్థులుగా హోరాహోరీగా జరిగిన జూబిలీ హిల్స్ ఉప ఎన్నిక అయిపోయింది. రేపు ఫలితం కూడా వస్తుంది. ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా ఈ ఎన్నిక జరిగిన తీరు గురించి, ప్రత్యేకంగా ఎన్నికల ప్రచార సందర్భంలో నాయకులు మాట్లాడిన తీరు గురించి, అసలు మొత్తంగా మన ఎన్నికల వ్యవస్థలోని అక్రమాల గురించి చర్చించుకోవడానికి ఇది తగిన సమయం. గడిచిన ఏడున్నర దశాబ్దాల భారత పార్లమెంటరీ ఎన్నికల చరిత్రలో, జరిగిన వేలాది ఎన్నికలలో చట్ట ఉల్లంఘనలు, అక్రమాలు లేకుండా జరిగిన ఎన్నిక ఒక్కటంటే ఒక్కటైనా మచ్చుకైనా దొరుకుతుందా పరిశోధించవలసిన విషయమే. ఇప్పుడు మాత్రం ప్రత్యేకంగా జూబిలీ హిల్స్ ఎన్నికలలో కొందరు ప్రచార కర్తలు చేసిన అభ్యంతరకరమైన, చట్ట వ్యతిరేకమైన ఉపన్యాసాల గురించి మాట్లాడుకోవాలి. అటువంటి మాటలు మాట్లాడడంలో ఏ ఒక్క పార్టీకీ, ఏ ఒక్క నాయకుడికీ, నాయకురాలికీ మినహాయింపు లేదు గాని ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకుడు, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ రహమత్ నగర్ లో నవంబర్ 8న ఇచ్చిన ఉపన్యాసాన్ని పరిశీలించవలసి ఉంది.

జూబిలీ హిల్స్ ఉప ఎన్నికలలో పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎల్ దీపక్ రెడ్డికి ప్రచారంలో మాట్లాడుతూ బండి సంజయ్, ఆ అభ్యర్థి గుణగణాల గురించి చెప్పి వోటు అడిగే బదులు, ఈ ఎన్నికను హిందువులకూ ముస్లింలకూ మధ్య యుద్ధంగా అభివర్ణించి, హిందువులందరూ బిజెపి అభ్యర్థికి వోటు వేయాలని కోరారు. భారతదేశంలో ఎన్నికలను నిర్దేశించే 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 123 (3) వోట్లు అడగడానికి మతాన్ని ప్రాతిపదికగా చూపడాన్ని కచ్చితంగా నిషేధించింది. అటువంటి “అక్రమ ప్రవర్తనకూ ఎన్నికల నేరానికీ” పాల్పడితే మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించాలని కూడా సెక్షన్ 125 ఆదేశించింది.

“అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా కార్మికులతో సమావేశంలో వారికి వాగ్దానాలు చేశాడని, ఎన్నికల ప్రచార సమయంలో ఒక నిర్దిష్ట బృందానికి వాగ్దానాలు చేయడం అధికార దుర్వినియోగమేనని, ఎన్నికల కోడ్ ఉల్లంఘన అని భారత రాష్ట్ర సమితి ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మీద కూడా ఎటువంటి చర్యా తీసుకోలేదు. కెటి రామారావుతో సహా భారత రాష్ట్ర సమితి ఎన్నికల ప్రచారకులు కూడా ప్రజా ప్రాతినిధ్య చట్టపు ఉల్లంఘనలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు చేశారని పత్రికల్లో అచ్చయిన వారి ఉపన్యాసాలు, సామాజిక మాధ్యమాలలో వారి ప్రచారాలు చూస్తే తెలుస్తుంది. వారి మీద ఎవరైనా ఫిర్యాదు చేశారో లేదో తెలియదు. చర్యలు తీసుకున్నట్టు ఎక్కడా వార్తలు రాలేదు.”

కాని ఈ దేశంలో చట్టబద్ధ పాలనను అమలు చేసే బృహత్తర బాధ్యత ఉన్న భారత ప్రభుత్వ హోమ్ మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రిగా ఉన్న వ్యక్తి ఈ ఉపన్యాసంలో ఏమి అన్నాడో చూడండి: “ఇది మొల్దారం గట్టినోనికి మొల్దారం లేనోనికి మధ్య పోటీ. బొట్టు ఉన్నోళ్లకు బొట్టు లేనోళ్లకు మధ్య పోటీ. గాజులు ఏసుకున్నోళ్లకు గాజులు ఏసుకోనోళ్లకు మధ్య పోటీ. మీరు బొట్టు పెట్టుకొని దుర్గమ్మ, లక్ష్మమ్మ అయితే ఇటు వోటేయండి. లేకుంటే అటు ఏయండి. జూబిలీ హిల్స్ ను కాంగ్రెసోళ్లు ఖాన్ బేగం నగర్ గా మారుస్తారు, ఊకుంటరా? మనమే గెలిస్తే ఈ జూబిలీ హిల్స్ ను సీతారాం నగర్ గా మారుస్తం. ఖాన్ బేగం నగర్ గావాల్నా, సీతారాం నగర్ గావాల్నా?” అని వోటర్ల మధ్య మత ప్రాతిపదిక మీద విభజన తెచ్చాడు.

బిఆర్ఎస్ నాయకుడు కెటిఆర్ ను అవమానకరమైన పేరుతో ప్రస్తావిస్తూ, “నలబై వేల బురఖాలు తెప్పించిండట, పాకిస్తాన్ నుంచి తెప్పించిండట” అని ఆరోపిస్తూ, “ఇది హిందూ ముస్లిం మధ్య వార్. 80 శాతం ఉన్న హిందువులు గెలుస్తరా, 20 శాతం ఉన్న తురకోళ్లు గెలుస్తరా?” అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. “కాంగ్రెస్ పార్టీ తురకోళ్ల వైపున్నది. భారతీయ జనతా పార్టీ హిందువుల వైపున్నది. తెలంగాణలో హిందూ రాజ్యం రావాలంటే జూబిలీ హిల్స్ లో హిందువులంతా ఒక్కటి గాండి. తెలంగాణ రాష్ట్రాన్ని హిందూ రాజ్యంగా మారుస్తం. కాంగ్రెస్ గెలిస్తే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చడానికి ప్లాన్ చేస్తున్నది” అన్నాడు. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి, తురకోళ్ల టోపీ పెట్టుకొని వోట్లడుగుతడు” అని ఆరోపించాడు. “కాంగ్రెస్, ఎంఐఎం కలిసి మీ బంగారం గుంజుకపోతారు. కాంగ్రెస్ గెలిస్తే మీ పార్కులన్నీ కబరస్తాన్ లయితయి. ఈద్గాలైతయి. జూబిలీ హిల్స్ వీథులన్నీ బక్రీద్ రక్తంతో ఏర్లై పారుతయి” అని ముస్లిమ్ వ్యతిరేక, కాంగ్రెస్ వ్యతిరేక అబద్ధాలు వల్లించాడు. అవతలి అభ్యర్థుల నుంచి ఇరవై వేలైనా తీసుకోండి, కాని బిజెపి అభ్యర్థికి వోటు వేయండి” అని ప్రజా ప్రాతినిధ్య చట్టం నిర్దిష్టంగా నిషేధించిన ద్రవ్యరూప ప్రలోభాల గురించి కూడా మాట్లాడాడు.

అంటే ఈ మాటల్లో ఏ ఒక్కదాని మీదనైనా కేంద్ర ఎన్నికల సంఘం గాని, రాష్ట్ర ఎన్నికల సంఘం గాని, జిల్లా ఎన్నికల అధికారులు గాని తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవచ్చు. న్యాయస్థానాలు సువో మోటు ఈ చట్టపర ఉల్లంఘనల మీద కేసు నమోదు చేయమని ఆదేశించవచ్చు. పోలీసులు స్వయంగా కేసు నమోదు చేయవచ్చు. ఇవేవీ జరగలేదంటే అధికార వర్గాలలో ఉన్నవారికి అవినీతిని, అక్రమాలను యథావిధిగా పోనివ్వడం, చూసీ చూడనట్టు పోవడం అలవాటయిందన్నమాట. కనీసం ప్రత్యర్థులు ఫిర్యాదు చేసినప్పుడైనా తక్షణమే స్పందించి, వెంటనే దర్యాప్తు జరిపి విచారణ ప్రారంభించవచ్చు. ఆ మాటలు ఉల్లంఘన అవునా కాదా, చట్టవ్యతిరేకం అవునా కాదా, అక్రమం అవునా కాదా అని మీనమేషాలు లెక్కించేసరికి కాలం గడిచిపోతుంది. లేదా మీనమేషాల బదులు మోడీషాల రాయంలో అక్రమమే సక్రమం అయిపోతున్నదేమో. కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గ సభ్యుడే ఇంత పెద్ద ఎత్తున అక్రమాలకు, ఉల్లంఘనలకు పాల్పడితే, ఆ నేరాన్ని సజావుగా సాగిపోనిచ్చినవాళ్లందరూ నేరస్తులే.

“దేశంలో ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, సక్రమంగా నిర్వహించడానికి ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 తయారయింది. అందులో అవినీతికర ప్రవర్తనలు పేరుతో ఒక అధ్యాయంలో ఎన్నో నిబంధనలున్నాయి. కుల, మత, ప్రాంత, జాతి, సమూహ, భాష భేదాలను ఎన్నికలకు వాడుకోవడం, వాటి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, ధన, మద్య, వస్తు ప్రలోభాలు చూపడం వంటి ఎన్నో అవినీతికర ప్రవర్తనలను నమోదు చేసి అవి ఎన్నికల ప్రక్రియను దెబ్బతీస్తాయని, కనుక శిక్షార్హమైన నేరాలు అని చట్టం ప్రకటించింది. ఎన్నికల ప్రక్రియలో అటువంటి అవాంఛనీయ ధోరణులను అరికట్టడానికి, అభ్యర్థులకు, పార్టీలకు, ప్రచారానికి విధి నిషేధాలు నిర్దేశించడానికి నమూనా ప్రవర్తనా నియమావళి తయారయింది. ఈ రెంటి ఆధారంగా ఎన్నికల ప్రక్రియను చట్టబద్ధంగా, సజావుగా నడిపించడానికి రాజ్యాంగబద్ధ సంస్థగా ఎన్నికల సంఘం తయారయింది. కాని వాస్తవంగా అభ్యర్థులు, పార్టీలు, ప్రచారాలు ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని, నమూనా ప్రవర్తనా నియమావళిని నగ్నంగా, బహిరంగంగా, విచ్చలవిడిగా ఉల్లంఘిస్తుంటే ఎన్నికల సంఘం ఏమీ చేయడం లేదు.”

ఈ మాటల్లో ప్రతి ఒక్కటీ చట్టవ్యతిరేకమైనవి, నమూనా ప్రవర్తనా నియమావళి నిబంధనలకు వ్యతిరేకమైన మాత్రమే కాదు. అవి అనాగరికమైనవి, విద్వేషపూరితమైనవి, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేవి. ఒక సమూహం మీదికి మరొక సమూహాన్ని హింస జరపమని ప్రేరేపించేవి. ఆధునిక నాగరిక సమాజ విలువలకు, ప్రజాస్వామిక సంప్రదాయాలకు అభ్యంతరకరమైనవి.

ఇది బండి సంజయ్ ఒక్కడి మాటల సమయ మాత్రమే కాదు, గత రెండు మూడు వారాలలో ఎవరి ఎన్నికల ఉపన్యాసమైనా చూడండి. స్వయంగా ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కె టి రామారావు కూడా ఇటువంటి చట్టవ్యతిరేక, విద్వేషపూరిత, అభ్యంతరకరమైన వ్యాఖ్యలే చేశారు. గత ఏడు దశాబ్దాలలో, ముఖ్యంగా గత రెండు మూడు దశాబ్దాలలో మితిమీరిన ధనమదం, అధికారమదం, మతాహంకారం, కులాహంకారం రాజకీయాలను శాసించడం పెరిగిపోయినప్పటి నుంచీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, ఎన్నికల ప్రక్రియ మొత్తంగానే ఇలా ఉన్నాయి. సవరించవలసిన, నియంత్రించవలసిన, శిక్షించవలసిన రాజ్యాంగబద్ధ, చట్టబద్ధ సంస్థగా ఎన్నికల సంఘం భయంకరమైన బాధ్యతా రాహిత్యంలో మునిగి తేలుతున్నది. ఎలక్షన్ కమిషన్ కు ఎన్నికల చట్టాలను తు.చ. తప్పకుండా అమలు చేసే చిత్తశుద్ధి ఉంటే ఈ మాటలు అన్న ప్రతి ఒక్కరినీ ఎన్నికల ప్రక్రియ నుంచి తొలగించవలసి ఉంటుంది. బహిష్కరించవలసి ఉంటుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం నిర్దేశించిన శిక్షలు విధించమని న్యాయస్థానానికి వెళ్లవలసి ఉంటుంది. తనంత తానే ఆ పని చేయవలసిన ఎలక్షన్ కమిషన్ ప్రత్యర్థి పార్టీల నుంచి ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు వచ్చినా ఎవరి మీదా చర్యలు తీసుకోలేదు. రాజ్యాంగం చర్యలు తీసుకోవలసిన బాధ్యత తన మీద పెట్టిందనే కనీస గుర్తింపును కూడా చూపలేదు.

ప్రత్యేకంగా బండి సంజయ్ బోరబండలో నవంబర్ 6న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడని, నవంబర్ 8న మత ప్రాతిపదికపై వోట్లు అడిగాడని, మత విద్వేషాలు రెచ్చగొట్టాడని, వోటర్లను ప్రత్యర్థి పార్టీల దగ్గర డబ్బులు తీసుకొని, బిజెపికి వోటు వెయ్యమని అడిగాడని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది. తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఆ ఫిర్యాదు మీద దర్యాప్తు జరిపి నివేదిక ఇమ్మని ఆదేశిస్తూ జిల్లా ఎన్నికల అధికారికి పంపారు. నిజానికి ఈ సందర్భంలో ఎటువంటి దర్యాప్తూ అవసరం లేదు. ఆ అభ్యంతరకర వ్యాఖ్యల ఉపన్యాసం పూర్తి పాఠం యూట్యూబ్ మీద, ఇతర సామాజిక మాధ్యమాల మీద ఉంది. వేలాది మంది దాన్ని విపరీతంగా ప్రచారంలో పెట్టారు. మన ఎన్నికల అధికారులు సామాజిక మాధ్యమాలు చూడనివారేమీ కాదు. చూసినా చూశామని ఒప్పుకోదలచుకోలేదన్నమాట. చెడు కనకు, చెడు వినకు అనే గాంధీ సూక్తిని అక్షరాలా పాటిస్తున్నారన్నమాట. లేదా పూర్తి వివరాలు తెలిసి కూడా ప్రధాన ఎన్నికల అధికారి తాత్సారం ద్వారా, కింది అధికారుల నుంచి నివేదికలు అడగడం అనే ఎడతెగని గొలుసు ప్రారంభించడం ద్వారా సమస్యను తేలగొట్టదలిచారన్నమాట. చట్ట ప్రకారం కఠినమైన శిక్షలు విధించవలసి ఉండగా కనీసం సంజాయిషీ అడగడం, మందలింపు వంటి చర్యలు కూడా తీసుకోలేదు.

అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా కార్మికులతో సమావేశంలో వారికి వాగ్దానాలు చేశాడని, ఎన్నికల ప్రచార సమయంలో ఒక నిర్దిష్ట బృందానికి వాగ్దానాలు చేయడం అధికార దుర్వినియోగమేనని, ఎన్నికల కోడ్ ఉల్లంఘన అని భారత రాష్ట్ర సమితి ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మీద కూడా ఎటువంటి చర్యా తీసుకోలేదు. కెటి రామారావుతో సహా భారత రాష్ట్ర సమితి ఎన్నికల ప్రచారకులు కూడా ప్రజా ప్రాతినిధ్య చట్టపు ఉల్లంఘనలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు చేశారని పత్రికల్లో అచ్చయిన వారి ఉపన్యాసాలు, సామాజిక మాధ్యమాలలో వారి ప్రచారాలు చూస్తే తెలుస్తుంది. వారి మీద ఎవరైనా ఫిర్యాదు చేశారో లేదో తెలియదు. చర్యలు తీసుకున్నట్టు ఎక్కడా వార్తలు రాలేదు.

అంటే మన ఎన్నికల అధికారులకు, మన ప్రభుత్వాధికారులకు ప్రజా ప్రాతినిధ్య చట్టంలో, ఎన్నికల నమూనా ప్రవర్తనా నియమావళిలో ఏమున్నదో తెలియదా?

దేశంలో ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, సక్రమంగా నిర్వహించడానికి ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 తయారయింది. అందులో అవినీతికర ప్రవర్తనలు పేరుతో ఒక అధ్యాయంలో ఎన్నో నిబంధనలున్నాయి. కుల, మత, ప్రాంత, జాతి, సమూహ, భాష భేదాలను ఎన్నికలకు వాడుకోవడం, వాటి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, ధన, మద్య, వస్తు ప్రలోభాలు చూపడం వంటి ఎన్నో అవినీతికర ప్రవర్తనలను నమోదు చేసి అవి ఎన్నికల ప్రక్రియను దెబ్బతీస్తాయని, కనుక శిక్షార్హమైన నేరాలు అని చట్టం ప్రకటించింది. ఎన్నికల ప్రక్రియలో అటువంటి అవాంఛనీయ ధోరణులను అరికట్టడానికి, అభ్యర్థులకు, పార్టీలకు, ప్రచారానికి విధి నిషేధాలు నిర్దేశించడానికి నమూనా ప్రవర్తనా నియమావళి తయారయింది. ఈ రెంటి ఆధారంగా ఎన్నికల ప్రక్రియను చట్టబద్ధంగా, సజావుగా నడిపించడానికి రాజ్యాంగబద్ధ సంస్థగా ఎన్నికల సంఘం తయారయింది. కాని వాస్తవంగా అభ్యర్థులు, పార్టీలు, ప్రచారాలు ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని, నమూనా ప్రవర్తనా నియమావళిని నగ్నంగా, బహిరంగంగా, విచ్చలవిడిగా ఉల్లంఘిస్తుంటే ఎన్నికల సంఘం ఏమీ చేయడం లేదు. పైగా తన మౌనం ద్వారా, నిష్క్రియ ద్వారా, తాత్సారం ద్వారా ఆ తప్పుడు ధోరణులను యథావిధిగా సాగనిస్తున్నది. అందుకు ఏడు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా వందలాది, బహుశా వేలాది ఉదాహరణలున్నాయి. ప్రస్తుత జూబిలీ హిల్స్ ఉప ఎన్నిక ఆ అసంఖ్యాక ఉదాహరణల్లో ఒకానొకటి. అసలే అటువంటి అక్రమాలకు నిలయమైన ఎన్నికల సంఘాన్ని మోషా తమ జేబు సంస్థగా మార్చుకుని, దానికి మిగిలి ఉండిన సిగ్గుబిళ్ల కూడా తొలగించి నగ్నంగా నిలబెట్టారు.

కథలో చెప్పినట్టు రాజుగారి దేవతావస్త్రాలు లేవని చిన్న పిల్లలైనా గుర్తించగలుగుతున్నారు గాని, మేధావులూ బుద్ధిజీవులూ మాట్లాడగలిగినవాళ్లూ రాయగలిగినవాళ్లూ గుర్తించడం లేదు. భారత్ పార్లమెంటరీ ఎన్నికల “పవిత్రత” గురించి పాఠాలు చెపుతున్నారు!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page