‘మంచిగనిపించింది!’.. అన్నారొక ఫ్రెండ్. ఒకరు కాదు, ఇద్దరు ముగ్గురు అయిదుగురు పదిమంది.. అదే మాట అన్నారు.
‘ బాగా జరిగింది’ అనడం వేరు. ఎడం జరిగి, బయటి నుంచి అనే మాట. మంచిగా అనిపించడం లోపలి మాట. అది ఫీలింగ్.
‘ఛాయా’ సాహిత్యోత్సవం విజయవంతం అయిందని గనుక అనుకుంటే, అందుకు కారణం అక్కడికి వెయ్యిన్నర మంది వచ్చారనో, సదస్సులన్నీ సందడిగా జరిగాయనో కాదు. ముగింపు దిగులు కమ్మిన సాయంత్రాన్ని గోరటి వెంకన్న మంత్రించి వదిలాడనీ కూడా కాదు.
వచ్చినవారిలో మనసు నిండిపోయింది కాబట్టి.
చాలా కాలం తరువాత మంచిగనిపించింది కాబట్టి.
“వారం కిందట అక్టోబర్ 25 రోజున, జూబ్లీ హిల్స్ లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంగణం మనసు బార్లా తెరచుకుని అక్షరలోకాన్ని తనలోకి ఆహ్వానించింది. రెండు నెలల కిందట ప్రకటించి, ప్రయత్నాలను ఆగమేఘాల మీద పరుగులెత్తించి, వివరాల విశేషాల ప్రచారంతో ఊరించి ఊరించిన ‘ఛాయా సాహిత్యోత్సవం ( సిఎల్‌ఎఫ్)-2025’ ఆరోజే. ఒక మూలన నక్కిన సందేహాన్ని పటాపంచలు చేస్తూ, ఉదయం పది కాకముందే సిఎస్‌టిడి లోయ జనంతో నిండిపోయింది!”
వారం కిందట అక్టోబర్ 25 రోజున, జూబ్లీ హిల్స్ లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంగణం మనసు బార్లా తెరచుకుని అక్షరలోకాన్ని తనలోకి ఆహ్వానించింది. రెండు నెలల కిందట ప్రకటించి, ప్రయత్నాలను ఆగమేఘాల మీద పరుగులెత్తించి, వివరాల విశేషాల ప్రచారంతో ఊరించి ఊరించిన ‘ఛాయా సాహిత్యోత్సవం ( సిఎల్‌ఎఫ్)-2025’ ఆరోజే. ఒక మూలన నక్కిన సందేహాన్ని పటాపంచలు చేస్తూ, ఉదయం పది కాకముందే సిఎస్‌టిడి లోయ జనంతో నిండిపోయింది!
నాలుగు వేదికలు. సమాంతరంగా సమకాలంలో సదస్సులు. చర్చలు, పుస్తకావిష్కరణలు, రచయితలతో ముచ్చటలు. కలయికలతో కరచాలనాలతో, చాయకప్పులతో జరిగిన జనాంతిక సభలు. బారులు తీరిన పుస్తకాలతో బాతాఖానీ. సొంత పుస్తకాల వాయినాలు. క్షణాలను వలవేసి పట్టే గ్రూపు ఫోటోలు, సెల్ఫీలు. వీటన్నిటి మధ్య నుండి ఉత్సవం ప్రవహించింది. ఉద్గ్రంథాలు, మహాకావ్యాల లాంటి మనుషులందరినీ ఒకే పేజీలో కట్టిపడేసింది.
సాహిత్యోత్సవాలు మనకు కొత్త కాదు. ప్రభుత్వాలు, సాంస్కృతిక సంస్థలు, రచయితల సంఘాలు సభలు, మహాసభలు, వార్షికత్సవాలు నిర్వహిస్తూనే ఉంటాయి. ఆశ్రిత కవి పండితుల సమీకరణకు కొన్ని, ఆశయనిబద్ధతలను ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమాలు కొన్ని జరుగుతాయి కానీ, ఒక కనీస ప్రాతిపదిక మీద వివిధ, విభిన్న సాహిత్య జీవులకు లభించే ఉమ్మడి వేదికలు తక్కువ. అదీ కాక, పఠనం తగ్గిపోయింది, పుస్తక విక్రయాలు తగ్గిపోయాయి, అన్న ఆవేదన పెరిగిన కాలంలో, ఒక భాషా సమాజం సాహిత్యసంస్కారాన్ని మదింపు వేసుకుని, మరమ్మత్తులు చేసే పని అవసరం. పొరుగుభాషలతో ఇచ్చిపుచ్చుకోవడాలు, రచయితల మధ్య సంభాషణలు, వివిధ కళారంగాల మేళవింపు, ఇవన్నీ ప్రతి సాంస్కృతిక సమాజానికీ కీలకాలు! సాటి భాషా సమాజాలు మనకంటె మెరుగైన అభిరుచులతో ముందుకు వెళుతున్నప్పుడు, ఈ జోక్యం మరింత అవసరం. ‘ఛాయ’ దాన్ని గుర్తించింది. పెద్ద పనే అయినా, ధైర్యం చేసింది. సక్సెస్ అయింది.
“బుక్ బ్రహ్మ, హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్,జైపూర్, కేరళ ఫెస్టివల్స్ వంటి నమూనాలోనే, ఛాయ ఫెస్టివల్ రూపకల్పన కూడా జరిగినట్టనిపించినా, ఈ పండుగ తనదైన సంస్కారాన్ని పొదువుకుంది. తెలుగు సమాజాల విభిన్నతలు, సాహిత్య ధోరణులు, ప్రక్రియలు, వివిధ సామాజిక, ప్రాంతీయ అస్తిత్వాలు వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని, సాధ్యమైనంత సమ్మిళిత ప్రాతినిధ్యం కోసం ప్రయత్నించింది. అయినా, ఇది పూర్తి లోపరహితమేమీ కాదు. ఇది కేవలం మొదటి ప్రయత్నమే, మొదటి ఉత్సవమే, రెండు మూడు సభలు చూసిన తరువాత, ‘ఛాయ’ తమ విలువల గురించి ప్రత్యేకంగా ఇక చెప్పుకోవలసిన పని ఉండదు!”
బుక్ బ్రహ్మ, హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్,జైపూర్, కేరళ ఫెస్టివల్స్ వంటి నమూనాలోనే, ఛాయ ఫెస్టివల్ రూపకల్పన కూడా జరిగినట్టనిపించినా, ఈ పండుగ తనదైన సంస్కారాన్ని పొదువుకుంది. తెలుగు సమాజాల విభిన్నతలు, సాహిత్య ధోరణులు, ప్రక్రియలు, వివిధ సామాజిక, ప్రాంతీయ అస్తిత్వాలు వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని, సాధ్యమైనంత సమ్మిళిత ప్రాతినిధ్యం కోసం ప్రయత్నించింది. అయినా, ఇది పూర్తి లోపరహితమేమీ కాదు. ఇది కేవలం మొదటి ప్రయత్నమే, మొదటి ఉత్సవమే, రెండు మూడు సభలు చూసిన తరువాత, ‘ఛాయ’ తమ విలువల గురించి ప్రత్యేకంగా ఇక చెప్పుకోవలసిన పని ఉండదు!
సభల వివరాలు చూసి విమర్శించినవారున్నారు. సభలు జరిగాక వ్యాఖ్యానించిన వారున్నారు. ప్రతి పరిశీలనా, సూచనా విలువైనవే. తెలుగు సాహిత్యసమాజంలో విమర్శనాత్మకత ఎక్కువ. దాన్ని సానుకూల ప్రయోజనాలకు వాడుకోవాలి. స్పర్ధతోనే విద్యలు వర్ధిల్లుతాయి కాబట్టి, అనేకులు ‘ఛాయ’ నుంచి స్ఫూర్తి పొంది తాము కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో వేరువేరు చోట్ల ఇటువంటి పండుగలు నిర్వహించాలి. అన్ని పెస్టివల్స్ కు అందరూ వెళ్ళాలి.
రచయితల నైపుణ్యాలను పెంచడానికి ప్రత్యేకంగా కృషి జరగాలి. రచనలు భాషల సరిహద్దులను దాటి పాఠకులను చేరుకోవాలి. కొత్త తరాల పాఠకులను చేరుకునే ప్రయత్నం చేయాలి. యువసాహిత్యకారులకు వేదిక ఇవ్వాలి. తరాల మధ్య సంభాషణ జరుగుతూ ఉండాలి. ఇటువంటి సాధారణ లక్ష్యాలతో, స్థూల ప్రగతిశీల, ఉదారభావ మార్గాల సాహిత్యాన్ని మరింత విస్తరింపజేయాలి. బహుశా, ‘ఛాయ’ ఈ ఆలోచనలతోనే తెలుగు ఫెస్టివల్ ఆలోచన చేసి ఉండాలి. తెలుగు సమాజపు సాహిత్య స్పృహ, అభిరుచి, స్థాయి పెరగడానికి ఇటువంటి ఉత్సవాలు దీర్ఘ కాలంలో పునాదులు వేస్తాయని వారి ఆశ కావచ్చు!
ఛాయ ఉత్సవ ప్రాంగణంలో యువజనులు అధిక సంఖ్యలో కనిపించడం, ప్రఖ్యాత రచయితలు అందరితో కలివిడిగా ఉండడం, అన్ని వేదికలూ కిటకిట లాడిపోవడం, సాహిత్య కార్యక్రమాలకు హాజరయ్యే వారిని ఆశ్చర్యపరిచాయి. ఒకరికొకరు అంటీముట్టనట్టు ఉండే వేరువేరు బృందాలు ఈ ఫెస్టివల్ లో కలసి పాల్గొనడం మరో విశేషం. సానుకూల శక్తులు కూడా శకలాలుగానే మిగిలిపోయినప్పుడు, ఒక సకలత్వ సంకేత స్థలాలు ఎంత అవసరం?
“మనుషులకు కొత్త పండుగలు కావాలి. ద్వేషం లేని, విషం లేని పండగలు కావాలి. చీకటిలో వెలుగు పాటలు, చావువేళల్లో బారసాలలు కావాలి. స్వరపేటికలను చిదిమివేస్తున్నప్పుడు గుండెచప్పుళ్ల డప్పు మోగాలి. ఓటమి గుదిబండ కింద నలుగుతూనే ఒక గెలుపు పాట పాడాలి. అరణ్యాలు అంతరిస్తున్నప్పుడు విత్తనాల జాతర జరగాలి. బహుశా, ఇటువంటి అవసరమేదో ఇప్పుడు మునుపెన్నడూ లేనంత ఎక్కువగా ఏర్పడి ఉండాలి! మనుషులు, ముఖ్యంగా మాటలు పేర్చే కైతలు కట్టే ప్రతిసృష్టిచేసే మనుషులు, తమలోపలా, బయటా స్థలాల కోసం, కలయికలతో ప్రాణం పోసుకునే క్షణాల కోసం వెదుకుతూ ఉంటారు!”
సంకల్పానికి, పట్టుదలకు, కార్యదక్షతకు, క్రమశిక్షణకు- ‘ఛాయ’ ను ప్రశంసిద్దాము. వారి కష్టం ఫలించినందుకు అభినందిద్దాము. ‘ఛాయ’ చుట్టూ ఉన్న వెలుతురుపిట్టలను కూడా భుజం తడదాము. కానీ, ఈ విజయాన్ని నూటికి నూరు పాళ్లు వారి ఖాతాలో మాత్రమే వేయలేము. వారికి తెలియని, బహుశా వారు సంకల్పించని యాదృచ్ఛిక రహస్యోత్సవం కూడా అక్కడ జరిగి ఉండకపోతే, జనానికి అంత మంచిగనిపించి ఉండేది కాదనిపిస్తోంది! దాహం ఉన్నది కాబట్టే చలివేంద్రానికి కీర్తి దక్కింది!
వ్యక్తులుగా, చిన్నచిన్న బృందాలుగా వచ్చి అక్కడొక సందోహంగా మారిన మనుషులు, ఆ సామీప్యాలకు, ఆ చిరునవ్వులకు, ఆ కనుమెరుపులకు, తక్కిన గుంపు అంతటిలోనూ గుప్పుమన్న మనిషి వాసనకీ, పలకరింపుల్లో మాటకచేరీల్లో తొణికిసలాడిన సృజనకీ పరవశించిపోయి ఉంటారు. ఆ సమూహతే, అందులోని వివిధత్వమే, సగర్వతను, సాధికారతను కలిగించి ఉంటుంది! భయసంకోచాలను, నిర్లిప్త అనాసక్తతలను, కంచెలు మొలిచిన కైవారాలను కాసేపైనా ఆ వాతావరణం చెదరగొట్టి ఉంటుంది! వేడుక అంటే ఏమిటి? వేయి బాహువులు మొలిచిన ఆలింగనమే కదా! సంబరమంటే ఏమిటి? మనసులు మంచితనంలో ఓలలాడడమే కదా!
మనుషులకు కొత్త పండుగలు కావాలి. ద్వేషం లేని, విషం లేని పండగలు కావాలి. చీకటిలో వెలుగు పాటలు, చావువేళల్లో బారసాలలు కావాలి. స్వరపేటికలను చిదిమివేస్తున్నప్పుడు గుండెచప్పుళ్ల డప్పు మోగాలి. ఓటమి గుదిబండ కింద నలుగుతూనే ఒక గెలుపు పాట పాడాలి. అరణ్యాలు అంతరిస్తున్నప్పుడు విత్తనాల జాతర జరగాలి. బహుశా, ఇటువంటి అవసరమేదో ఇప్పుడు మునుపెన్నడూ లేనంత ఎక్కువగా ఏర్పడి ఉండాలి! మనుషులు, ముఖ్యంగా మాటలు పేర్చే కైతలు కట్టే ప్రతిసృష్టిచేసే మనుషులు, తమలోపలా, బయటా స్థలాల కోసం, కలయికలతో ప్రాణం పోసుకునే క్షణాల కోసం వెదుకుతూ ఉంటారు!
అటువంటి మనుషులకు వెదుకులాటలోనో, తడుములాట లోనో ఈ ఉత్సవం ఒక చిన్న మజిలీ గా తారసపడింది తప్ప, ఇందులో ’ఛాయ’ గొప్పేమీ లేదు. ఒక సృజనాత్మక మానవీయ అవసరానికి వేదిక నివ్వడం తప్ప, ఒక నమూనాకు రూపునివ్వడం తప్ప, విషతుల్య నిస్ఫృహల నడుమ మినుకుమినుకు మిణుగురులను పోగువేయడం తప్ప ‘ఛాయ’ చేసిందేమీ లేదు! ఇటువంటి సంభాషణలు, సమ్మర్ద సమావేశాలు లక్షోపలక్షలు జరిగితే తప్ప, సంక్షుభిత మానసి ఆకలి తీరదు. ఇది కేవలం ఒకానొకటి, ఒకే ఒక్కటి కాదు!
ఔరా! ఒక ఆశ కు నీరుపోయడం, ఒక ఉక్కపోతకు గాలివీయడం, మండుటెండలో గొడుగు పట్టడం, చిన్న పనేనా, ఛాయా!?





