చేతిలో ఎర్రజెండాను ఒడిసి పట్టుకొని

దిగువ మధ్యతరగతి కుటుంబంలోనే పుట్టినప్పటికీ, పేదల ఆకలి కడుపుల కేకలు బాగా విన్నవారు. సమాజంలోని అజ్ఞానాన్ని, అశాస్త్రీయతను తొలగించాలని కొన్ని దశాబ్దాలుగా తన ఆలోచనలతో, అక్షరాలతో అనునిత్యం పోరాటం చేస్తున్నవారు. అన్నింటికీ మించి శ్రామికులు, కార్మికులు, కర్షకులు, చిరుద్యోగులకి ఆప్తులు పతివాడ నాస్తిక్‌. సమసమాజం కోసం ఆయన కంటున్న కలలు, కోరుకున్న మార్పు ఆయన కవిత్వం ‘కొలిమి రాజెయ్యాల్సిందే’ ప్రతిపేజీలో ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తూ, కదిలిస్తూనే ఉంటాయి. సానుభూతి కంటే సమస్యల పరిష్కారం పట్ల నిబద్ధత ముఖ్యమని నమ్మేవ్యక్తి నాస్తిక్‌. పుస్తకంలో కవితల వరుస ‘చెమట గంధం’తో మొదలై ‘అనిర్వచనీయం’తో ముగుస్తాయి.
నీ శీతలగది కరెంటు ఉత్పాదనలో బొగ్గుగని కార్మికుల ఊపిరాడని ఉక్కపోత నీకు అర్థం అవ్వాలంటే మానవత్వపు గుండెతడి నిన్ను స్పర్శించాలంటే మొద్దుబారిపోతున్న కాలాన్ని అడగమంటాడు.

ఏసీ గదుల్లోనే కాలాన్ని దొర్లించకుండా ఫ్యాన్‌ లేని చీకటిగదిలో కాసేపు కూర్చోమని అందరినీ ఆహ్వానిస్తూ, చెమటగంధం విశిష్టతను ఘాటుగానే చెబుతున్నారు. దయచేసి మీ నగర జీవన మైకపువలల్ని ఆ అమాయకజీవుల మీద విసరి వాళ్ళబతుకుల్ని ఛిద్రం చేయకండి! వాళ్లే రేపటి ఉదయానికి రాత్రి సిద్ధం చేయగల సూర్యబింబాలంటూ మట్టిని నమ్ముకున్న చేతుల్ని చూపిస్తారు. తినడానికి రొట్టే లేదు/ తాగటానికి నీళ్లులేవు/ గుక్కెడు బురదనీళ్లతో డొక్కలు చల్లార్చుకునే దిక్కుమాలినస్థితి/ నిత్యం బిక్కుబిక్కుమంటుందంటూ సామాన్య ప్రజల ఆవేదనను తనలోకి ఆవాహన చేసుకొనీ నేటి సమాజపు రాజకీయనేతల్ని బలంగానే ప్రశ్నిస్తూనే, పాఠకులను ఆలోచింపజేసేలా చేస్తారు పుస్తకమంతా.

అద్దె ఎంతని అప్పుడే జేబులు తడుముకోకండి/ మీరనుకున్నట్టు అది/ ఇవాళ మీ జేబులో దూరి/ రేపు ఇంకొకడి జేబుకు కన్ను కొట్టే పచ్చనోటు కాదు/ ఎప్పటికీ తరిగిపోని ప్రేమ ఊటను మన గుండె గదుల్లోకి దూరి అద్దె విలువను తెలియజేస్తారు. ఆహా ఎంత చల్లనిగాలి/ ఓహూ ఎంత కమ్మనిలాలి/ అది గాలా, కాదు కాదునా బ్రతుకు రంగస్థలం మీద అలవోకగా సాగే నా నాట్యకేళి/ అంటూ పైరగాలి మనవైపు వీచేలా దారి మళ్ళీస్తారు. కమురుకంపు వాసనలతో కాలిపోయే కట్టెలా కాకుండా చిగురించేచెట్టులా బతుకుదామని దాతృత్వాన్ని గుండెలనిండా నింపుకోవాలనీ మనకు మంచిమాటలు చెప్తారు. పాలరాతి మేడమీద పూరి గుడిసె గోడమీద సమానంగా వెన్నెల వెలుగుల్ని విరజిమ్మే పున్నమిచంద్రున్ని సొంతం చేసుకోమంటాడు. వెల్లువెత్తిన కమ్యూనిస్టు చైతన్యంతో చేతిలో ఎర్రజెండాను ఒడిసి పట్టుకొని ఉద్యమించండంటాడు. నిరుద్యోగుల బాధలను దయచేసి నాకు ఉద్యోగం ఇప్పించండంటూ  కళ్ళకు కట్టినట్లు కన్నీటితో ఆవిష్కరిస్తారు.
బాల్యం ఇక్కడో ఘనీభవించిన మంచు శిల/ యవ్వనం అంగట్లో నిలబెట్టిన అమ్మకపు సరుకు/ వార్థక్యం తినిపారేసిన ఎంగిలి విస్తరి. ఇలాంటి జీవితసారపు అంశాలను తనదైనశైలితో పాఠకులను ఆకర్షిస్తారు. ప్రతీకవితలో బలమైన ఆవేదనను వ్యక్తపరుస్తూనే కార్ల్‌ మార్క్స్‌ కన్నకలలను చైనా, రష్యా నిజం చేయలేకపోయాయనీ ఇండియా నిజం చేయాలని ఆకాంక్షిస్తాడు.

పాఠశాలలో, కళాశాలలో పిల్లాడు తప్పు చేస్తే మాస్టార్లు సరిచేస్తారు మరీ ఈ వ్యవస్థ తప్పుచేస్తే సరి చేయాల్సిన బాధ్యత ఎవరు. తీసుకుంటున్నారని ప్రశ్నిస్తూనే మార్పుకోసం ఆశావాదాన్ని వినిపిస్తారు. ‘చూస్తూ ఉండు మన మనవరాల్ని కవిగా ఎలా సానపట్టి నిలబెడతాను అంటూ తన వారసత్వపు ఉద్దేశాన్ని కవిత్వమయం చేయడానికి తాపత్రయపడుతున్నారు. శ్రీశ్రీ ఆదర్శాలతో పతివాడ నాస్తిక్‌ రాసిన కవిత్వాన్ని మనమంతా స్వాగతిస్తూ పదండి ముందుకు..

 ఫిజిక్స్‌ అరుణ్‌ కుమార్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *