నెర‌వేర‌ని ప్ర‌త్యేక రాష్ట్ర ల‌క్ష్యం

– బీఆర్‌ఎస్ దోచుకుంటే కాంగ్రెస్ కూడా అదే చేస్తోంది
– తెలంగాణ ప్రజలు జాగృతం కావాలి
– రెండు రాష్ట్రాల అభివృద్ధికి మోదీ సహకారం
– పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌ బిల్లుపై చర్చలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

న్యూదిల్లీ, ఏప్రిల్ 1: సుదీర్థమైన పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని ధ్రువీకరిస్తూ బుధవారం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ(సవరణ) బిల్లు-2026పై చర్చలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ 1969లో జై తెలంగాణ అన్నందుకు 369మంది ఉద్యమకారులను కాల్చి చంపిందని, చివరి దశ తెలంగాణ ఉద్యమంలోనూ 1200మంది ఆత్మబలిదానం చేశారని వ్యాఖ్యానించారని, వారి త్యాగంతోనే తెలంగాణ వచ్చిందని చెప్పారు. నాలుగు కోట్ల మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నారన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా పోటీగా అభివృద్ధి చెందాలని భావించాం.. కానీ అక్కడి సోదర, సోదరీమణలులు  రాజధాని లేదని బాధపడే పరిస్థితి నెలకొనడం దురదృష్టకరం. ఈరోజు బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు కొందరు తెలంగాణకు విమానాశ్రయాలు లేవని చెప్పారు. అందుకు కారణం ఎవరు.. ఆ పాపం ఎవరిదో చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. ఏపీలో ఎనిమిది విమానాశ్రయాలుంటే తెలంగాణలో ఒక్కటే ఉంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు విమానాశ్రయాలు ఇవ్వలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కొత్తగూడెం, వరంగల్, ఆదిలాబాద్‌లలో విమానాశ్రయాలకు భూమి కోసం నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి లేఖలు రాసినా కనీసమాత్రంగానైనా స్పందించలేదు అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు రైల్వేలు, జాతీయ రహదారుల అభివృద్ధి జరగలేదన్నారు. తెలంగాణ అనేక రకాలుగా వెనుకబడింది కాబట్టే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వచ్చింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధాని కావాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.. ఇవాళ ఈ దిశగా ఓ సానుకూలమైన పరిస్థితి రావడం చాలా సంతోషంగా ఉందని కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏపీలో కూడా గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటైందని, ఏపీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తోందని తెలిపారు. అంతేకాక తెలంగాణలోనూ రైల్వేలు, జాతీయ రహదారులు మొదలుకుని అన్ని రకాల అభివృద్ధి పనులకు కేంద్రం అండదండగా నిలుస్తోందన్నారు. 42 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ ఏకకాలంలో చేసుకుంటున్నామని, గతంలో 2500 కిలోమీటర్ల జాతీయ రహదారులుంటే ఈ పదేళ్లలో అదనంగా దాదాపు మూడు వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందని వివరించారు. కాంగ్రెస్ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలను నిర్లక్ష్యం చేసింది కాబట్టే మోదీ హయాంలో అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. ఇవాళ అమరావతి రాజధానిగా ఏర్పాటవుతున్న సందర్భంగా ఏపీ ప్రజలందరికీ తెలంగాణ ప్రజల పక్షాన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అమరావతి అద్భుతమైన రాజధానిగా అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు. గతంలో పదేళ్లపాటు తెలంగాణనుబీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరఆర్ టాక్స్ పేరుతో దోచుకుంటోందని విమర్శించారు.  తెలంగాణ ప్రజలు జాగృతం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణను తెచ్చుకున్నామో ఆ లక్ష్యాల సాధన జరగడం లేదని, తెలంగాణ ప్రజల పోరాటాన్ని నవ్వులపాలు చేసే విధంగా కాంగ్రెస్ పాలన సాగుతోందని కిషన్‌రెడ్డి విమర్శించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *