ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల
సూర్యాపేట, ప్రజాతంత్ర, జనవరి 22 : ప్రజాస్వామ్య వ్యవస్థకు మీడియా నాలుగో స్తంభం అని, ప్రజలకు విశ్లేషణాత్మక కథనాలు అందించాలని ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డిలు కోరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వైట్ హౌస్ (స్వర్గీయ రాంరెడ్డి దామోదర్ రెడ్డి స్వగృహం)లో ప్రజాతంత్ర 2026 డైరీ, క్యాలెండర్లను వారు గురువారం ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాతంత్ర పత్రికకు ప్రత్యేక స్థానం ఉందని, ఏ పత్రికా కూడా తెలంగాణ పదం ఊసెత్తడానికి, ప్రచురించడానికి సాహసించని సమయంలో ప్రజాతంత్ర పత్రిక ఉద్యమానికి అండగా నిలిచిందని వారు పేర్కొన్నారు. 1998 జనవరి 2న సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ సారథ్యంలో ప్రారంభించిన పత్రిక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమ వార్తలను సమగ్రంగా అందించడం అభినందనీయమని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై విశ్లేషణాత్మక కథనాలు రాయాలని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సర్వోత్తంరెడ్డి, వేణారెడ్డిలు సూచించారు. కార్యక్రమంలో జిల్లా స్టాఫ్ రిపోర్టర్ సిహెచ్.రమణ, కాంగ్రెస్ నాయకులు కక్కిరేణి శ్రీనివాస్, గడ్డం వెంకన్న, రాజుల రాములు తదితరులు పాల్గొన్నారు.




