సీజనల్ వ్యాధులపై సమీక్షలో మంత్రి దామోదర
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 5: సీజనల్ వ్యాధుల నివారణ, నియత్రణపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శనివారం సమీక్ష నిర్వహించారు. డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాలు, గ్రేటర్ హైదరాబాద్‌లో యాంటి లార్వల్ ఆపరేషన్‌ను విస్తృతం చేయాలని అధికారులను ఆదేశించారు. వాతావరణ పరిస్థితుల మార్పు కారణంగా వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉన్న జీహెచ్‌ఎంసీ జోన్లకు స్పెషల్ ఆఫీసర్లను నియమించాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణపై కలెక్టర్లతో రివ్యూ చేయాలని హెల్త్ సెక్రటరీకి సూచించారు. ట్రైబల్ ఏరియాలపై ఎక్కువగా ఫోకస్ చేయాలని, ఐటీడీఏ పీవోలతో సమన్వయం చేసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేసి ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాల్లో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పర్యటించాలని మంత్రి ఆదేశించారు. సీజనల్ వ్యాధుల బారిన పడిన పేషెంట్లకు చికిత్స అందించేందుకు హాస్పిటళ్లలో అవసరమైన అన్ని వసతులతో సిద్ధంగా ఉండాలని, అన్ని హాస్పిటల్స్‌లో అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. డెంగీ, ప్లేట్‌లెట్స్ పేరిట పేషెంట్లను దోచుకునే ప్రైవేట్ హాస్పిటల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌ను ఆదేశించారు. సీజనల్ వ్యాధులపై ప్రతి సోమవారం నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆరోగ్యశాఖ రూపొందించిన కరపత్రాలను ఈ సందర్భంగా మంత్రి ఆవిష్కరించారు. రాష్ట్రంలో మే నెల నుంచే వర్షాలు ప్రారంభమయ్యాయని, వాతావరణంలో మార్పుల వల్ల మే, జూన్ నుంచే అక్కడక్కడ సీజనల్ వ్యాధులు మొదలయ్యాయని అధికారులు మంత్రికి వివరించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి చాలా జిల్లాల్లో డెంగీ కేసులు తక్కువగా నమోదయ్యాయని, గ్రేటర్ హైదరాబాద్‌లో స్వల్పంగా కేసులు పెరిగాయని తెలిపారు. 19 జిల్లాల్లో పది కంటే తక్కువ కేసులు నమోదవగా, మిగిలిన జిల్లాల్లో పదికంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయన్నారు. గతేడాదితో పోలిస్తే టైఫాయిడ్ కేసులు చాలా తక్కువగా నమోదయ్యాయన్నారు. సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవిందర్ నాయక్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరేంద్ర కుమార్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, మెడికల్ కార్పొరేషన్ ఎండీ ఫణీంద్ర రెడ్డి, జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్ రఘు ప్రసాద్, పబ్లిక్‌హెల్త్ అడిషనల్ డైరెక్టర్ అమర్ సింగ్ నాయల్, జాయిట్ డైరెక్టర్ శివబాలాజీ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.





