వరదల నివారణకు ప్రత్యేక నోడల్ ఏజెన్సీ

– ఆధునిక పరిజ్ఞానంతో వరదలను అడ్డుకునేందుకు పటిష్ట చర్యలు
– ప్రకృతి వైపరీత్యాలతోపాటు మానవ తప్పిదాలతోటే వరదలు
– 2024 సెప్టెంబర్‌లో సంభవించిన వరదల ఉధృతితో భారీ నష్టం
– మున్నేరు ఉప్పొంగడంతో అతలాకుతులమైన ఖమ్మం జిల్లా
– తల్లి లాంటి నదుల పరిరక్షణకు సంఘటితంగా కృషి
– మూసీ నది పునరుద్ధరణ చరిత్రాత్మక ఘట్టం
– రాష్ట్ర అభివృద్ధిలో కృష్ణా, గోదావరి నదుల పాత్ర కీలకం
– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18: వర్షాకాలంలో సంభవించే వరదల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని నీటిపారుదల, పౌర సరఫరాల శాUల మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అందుకనుగుణంగానే ప్రత్యేకించి నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ అభివృద్ధి సంస్థలో కేంద్ర జలవనరుల సంఘం, కృష్ణా, గోదావరి బేసిన్ ఆర్గనైజేషన్‌ల ఆధ్వర్యంలో బుధవారం జరిగిన వరద మైదానాల జోనింగ్‌పై జరిగిన ప్రాంతీయస్థాయి శిక్షణ శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్ర జలసంఘం ప్రతినిధి మాధురీయా, కేఆరఎంబీ చైర్మన్ బి.పి.పాండే, జి.ఆర్.ఎం.బి చైర్మన్ బిశ్వాస్, పోలవరం ప్రాజెక్టు మెంబర్ సెక్రటరీ ఎం.రఘురాంలతోపాటు ప్రకృతి విపత్తుల నిర్వహణాధికారులు. ఐ.టి, ఎనఐటిలతోపాటు ఉస్మానియా విశ్వవిద్యాలయాలకు చెందిన నిపుణులు పాల్గొన్నారు. కేంద్ర జలసంఘం చైర్మన్ అనుపమ ప్రసాద్ సందేశాన్ని సి.డబ్లు.సి గ్రీష్మ కృష్ణన్ చదివి వినిపించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రసంగిస్తూ ఆధునిక పరిజ్ఞానంతో వరదల వల్ల సంభవిస్తున్న విపత్తులను అరికట్టేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలకు ఉపక్రమించిందని వెల్లడించారు. ప్రకృతి వైపరీత్యాలతోపాటు మానవ తప్పిదాలతోనే తరచుగా వరద విపత్తులు సంభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో భారీ ఎత్తున నష్టం

2024 సెప్టెంబర్‌లో సంభవించిన వరదల ఉదృతికి రాష్ట్రంలో భారీ ఎత్తున నష్టం సంభవించిందని, కిందటేడాది మున్నేరు ఉప్పొంగడంతో ఖమ్మం పట్టణంలోనీ పలు కాలనీలు అతలాకుతలం కావడంతోపాటు పెద్ద ఎత్తున పంట పొలాలు ధ్వంసమయ్యాయని, పశుపక్ష్యాదులు విగత జీవులుగా మారాయని ఆయన గుర్తు చేశారు. 2024 వరదల విపత్తు సంభవించిన నేపథŠ్యంలో తాను స్వయంగా ఖమ్మం జిల్లాను సందర్శించిన విషయాన్ని ప్రస్తావిస్తూ మున్నేరు నది ఉప్పొంగి 36 అడుగుల ఎత్తుకు నీరు చేరడంతో ఖమ్మం పట్టణం అతలాకుతలం అయిందని, అక్కడి కుటుంబాలు వారసత్వంగా నిర్మించుకున్న ఇండ్లుపై కప్పుల వరకు మునిగిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. 110కి పైచిలుకు గ్రామాలు ముంపునకు గురికావడంతో ఆయా ప్రాంతాల ప్రజలు రక్షణార్థం కొండలు, గుట్టలు,ఇంటి పైకప్పుల మీదకు చేరి పడవల కోసం నిరీక్షించిన ఉదంతం తనను ఎంతో కలచివేసిందన్నారు. ఆ వరదల విపత్తుకు 29మంది మృత్యువాతపడ్డారని, రూ.5,438 కోట్ల నష్టం వాటిల్ల‌డంతోపాటు 20 లక్షల ఎకరాల్లో పంట నీటిపాలైందని ఆయన గణాంకాలతో వివరించారు. దీనికితోడు 1023 కి.మీ రహదారులు, 257 వాగులు, చెరువులు దెబ్బతిన్నాయన్నారు. ఖమ్మం జిల్లాలో 30 ఏండ్లుగా ఇటువంటి విపత్తు చవి చూడలేదని ఉత్తమ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా వర్షాకాలంలో భద్రాచలం సమీపంలోని గోదావరి నది ప్రమాదస్థాయిని మించి వరద ఉధృతి రావడంతో భద్రాచలం-నెల్లిపాక రహదారి తెగిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ వరదల ప్రభావం 29 జిల్లాలపై పడిందన్నారు. ఇవి గణాంకాల కోసం చెప్పడం లేదని, ఈ నష్టం ప్రజల మనోవ్యధకు అద్దం పడుతోందని ఆయన తెలిపారు. భారీ వర్షాలు, తుఫాన్‌లతో వచ్చే విపత్తుల కంటే సహజసిద్ధంగా ప్రవహించే కాలువల ప్రవాహాన్ని ఆక్రమణల ద్వారా అడ్డుకోవడంతోటే తీవ్రంగా నష్టం వాటిల్లుతోందని చెప్పారు. తల్లి లాంటి నదుల పరిరక్షణకు సంఘటితంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. విపత్తులు పునరావృతం కాకుండా శాస్త్రవేత్తలు ఏఐ, జిఐఎస్‌ల వంటి ఆధునిక పరిజ్ఞానంతో సురక్షిత మార్గాలు అన్వేషించాలని కోరారు మూసీ నది భాగ్యనగరానికి జీవనాడి అని, అటువంటి నదిని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించడం అభినందనీయమని ఆయన కొనియాడారు. సెంట్రల్ వాటర్ కమిషన్ సూచించిన విధంగా సీడబ్ల్యూసీ ప్రొటెక్టెడ్ జోన్, రెగ్యులేటరీ జోన్, వార్నింగ్ జోన్‌లుగా అమలు చేస్తామని తెలిపారు. ఫ్లడ్ ప్లెయిన్ జోనింగ్ అభివృద్ధికి వ్యతిరేకం కాదని, సుస్థిర అభివృద్ధికి మార్గమని అన్నారు. మూసీ నది రెజువెనేషన్ ప్రాజెక్ట్ దేశంలోనే అతిపెద్దదని, పట్టణ నది పునరుద్ధరణ ప్రాజెక్టులలో ఒకటిగా మంత్రి పేర్కొన్నారు. ఈనెల 13న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఫేజ్-1 ప్రణాళికలు విడుదలయ్యాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులో సీడబ్ల్యూసీ మార్గదర్శకాలను పూర్తిగా అమలు చేసి, మూసీ నది పరిధిలో ప్రొటెక్టెడ్, రెగ్యులేటరీ జోన్‌లను గుర్తిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో కృష్ణా , గోదావరి నదులు ముఖ్య భూమిక పోషిస్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *