– కార్యదర్శుల సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో రాష్ట్రానికి దక్కాల్సిన నిధులకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు పేర్కొన్నారు. సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శుల సమావేశం మంగళవారం జరిగింది. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం నిర్వహించిన ఈ సమావేశంలో సీఎస్ మాట్లాడుతూ కేంద్ర ప్రాయోజిత పధకాల నుండి అత్యధిక నిధులు పొందేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ సి.ఎస్.ఎస్ కింద రూ.5లక్షల కోట్ల బడ్జెట్‌లో ప్రతిపాదించిందని, దీనిలో భాగంగా జనాభా ప్రాతిపదికన తెలంగాణకు కనీసం రూ.25 వేల కోట్లు రావాల్సి ఉందని స్పష్టం చేశారు. ఈ బడ్జెట్‌లో ఫార్మా రంగ అభివృద్ధి, సెమి కండక్టర్ తయారీ, వ్యవసాయ రంగంలో పలు అంశాల అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చారని, ఈదిశగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాను కలుపుతూ టెంపుల్ కారిడార్ అభివృద్ధికి అవకాశం ఉందని, వరంగల్‌లో మామునూరు ఎయిర్‌పోర్టు కూడా వస్తున్నందున ఈ జిల్లాల్లో టూరిజం, పారిశ్రామిక, వాణిజ్య రంగాల అభివృద్ధికి గణనీయమైన అవకాశం ఉందని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ రాష్ట్రానికి మరో రూ.10 వేల కోట్ల రావాల్సి ఉందని, ఈ విషయంలో సంబంధిత శాఖల కార్యదర్శులు ప్రత్యేక కృషి చేయాలని ఆదేశించారు. 16 ఫైనాన్స్ కమిషన్‌లో భాగంగా 2011 జనాభా ప్రాతిపదికపై నిధుల మంజూరు ఉంటుందని, దీనితోపాటు డెమోగ్రాఫిక్ ఏరియా, పథకాల అమలు సామర్ధ్యం, నిధుల వినియోగం వంటి ప్రాతిపదికలపై కూడా నిధుల కేటాయింపు ఉంటుందని వివరించారు. ప్రధానంగా అభివృద్ధి ఆధారిత ఇండికేటర్ల ప్రాతిపదిక ప్రకారం నిధుల కేటాయింపునకు ప్రాధాన్యతనిచ్చారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో వినియోగం కాకుండా ఉన్న మిగులు నిధులను రాష్ట్రానికి దక్కేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సి.వి.ఆనంద్, వికాస్‌రాజ్, సంజయ్ కుమార్, జయేష్ రంజన్, సబ్యసాచి ఘోష్, అహ్మద్ నదీమ్, ముఖ్య కార్యదర్శులు సందీప్ సుల్తానియా, నవీన్ మిట్టల్, ఎన్.శ్రీధర్, వివిధ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





