స్పీకర్ నిర్ణయంతో రాజకీయ దుమారం!

బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారని ఆరోపణలు ఎదుర్కొం టున్న పదిమంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయి ఎట్టకేలకు బుధవారం దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను కూడా కొట్టివేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీసుకున్న నిర్ణయం అనుకున్న విధంగానే తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. ఇంత కాలం తాత్సారం చేసి, వీరెవ్వరూ పార్టీ మారినట్టు ఆధారాలు లేవని స్పీకర్ చావు కబురు చల్లగా చెప్పినట్టు వెలువరించిన నిర్ణయం రాజ్యాంగంలోని పదవ షెడ్యూలుకు వ్యతిరేకంగా ఉన్నదంటూ బీఆరఎస్, బీజేపీలు నిప్పులు చెరుగుతున్నాయి. ప్రస్తుతం బీఆరఎస్ నాయకులు స్పీకర్ నిర్ణయాన్ని అధ్యయనం చేస్తున్నారు. సుప్రీంకోర్టులో ఈ నిర్ణయాన్ని సవాలు చేయాలని పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. ముఖ్యంగా దానం నాగేందర్ బీఆర్‌ఎస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికై, తర్వా త కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ ఎంపీ స్థానంలో పోటీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయనపై అనర్హత వేటు పడక తప్పదని బీఆర్‌ఎస్ ఇప్పటివరకు పెట్టుకున్న నమ్మకాన్ని స్పీకర్ తన నిర్ణయం దెబ్బతీయడంతో  ఆ పార్టీ నాయకులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఇక రెండో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించి పార్టీ కార్య కలాపాల్లో పాల్గొంటున్నప్పటికీ, సాంకేతిక ఆధారాలను సాకుగా చూపి ఆయన అనర్హత పిటిషన్‌ను కూడా స్పీకర్ కొట్టేయడం ఎంతవరకు సబబని వారు ప్రశ్నిస్తున్నారు.

నిజానికి కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చి రెండేళ్లు దాటిన తర్వాత ఇంత కాలానికి స్పీకర్ నిర్ణయం వెలువడటం, అదికూడా ఎమ్మెల్యేలకు అనుకూలం గా రావడం బీఆర్‌ఎస్, బీజేపీలను తీవ్ర ఆగ్రహానికి లోను చేశాయి. ఈ తీర్పు రాజ్యాంగంలోని పదవ షెడ్యూలను అతిక్రమించేదిగా ఉన్నదని అవి విమర్శిస్తున్నాయి. అనర్హత పిటిషన్ల విచారణపై గతంలో బీఆర్‌ఎస్, హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో కేసులు దాఖలు చేసింది. నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం  చేస్తున్నందుకు సర్వోచ్ఛ న్యాయస్థానం స్పీకర్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీచేసింది కూడా. ఈ నేపథ్యంలో కోర్టు విచారణ మరో రెండు రోజులు లేదా కొద్ది రోజులు ఉందనగా స్పీకర్ తన నిర్ణయాలు ప్రకటిస్తూ రావడం గమనార్హం. కేవలం కోర్టు ఆగ్రహం నుంచి తప్పించుకోవడానికి మాత్రమే స్పీకర్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారని విపక్ష నేతలు ఆరోపణలు గుప్పించడం కూడా కొనసాగుతూ వొచ్చింది. అంతేకాదు ఈ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు  వేస్తే, తక్షణం ఎన్నికలు వొస్తాయని, వీటిని కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొనే పరిస్థితిలో లేకపోవడం వల్లనే ఈ తాత్సార రాజకీయాలకు తెరలేపిందని గతంలో బీఆర్‌ఎస్ విరుచుకుపడింది.

నిజానికి స్పీకర్ మొత్తం నాలుగు విడతలుగా ఈ అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ వొచ్చారు. గత ఏడాది డిసెంబర్‌లో అరెకపూడి గాంధీ తెల్లం వెంకట్రావు సహా ఐదుగురు ఎమ్మెల్యేలు, ఈ ఏడాది జనవరిలో పోచారం శ్రీనివాస రెడ్డి, కాలె యాదయ్యలు, ఫిబ్రవరిలో జగిత్యాల ఎమ్మెల్యే ఎం. సంజయ్‌కుమార్, తాజాగా బుధవారం దానం నాగేందర్, కడియం శ్రీహరిల పై వొచ్చిన అనర్హత పిటిషన్లపై విచారించి తగిన ఆధారాలు లేవంటూ కొట్టివేశారు. చివరి ఇద్దరి ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం వెలువడిన వెంటనే బీఆర్ఎస్ తాము సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు  పార్టీ మారి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న వీడియోలు, ఫోటోలు ఉన్నప్పటికీ వాటిని స్పీకర్ పట్టించుకోలేదన్నది బీఆరఎస్ అభియోగం. అందువల్ల స్పీకర్ నిర్ణయం ఏకపక్షం, రాజకీయ దురుద్దేశంతో కూడినదని బీఆర్‌ఎస్ సుప్రీంకోర్టులో తన వాదనను వినిపించనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా 1992లో నాగాలాండ్‌కు చెందిన ఎమ్మెల్యే కిహొతో హోలోహన్ వర్సెస్  స్పీకర్ జాచిల్హు రింగా వడియో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వీరు ప్రముఖంగా ప్రస్తావించే అవకాశముంది. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి అత్యంత సంక్లిష్టమైన కేసు ఇది. ప్రస్తుత బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కేసు కూడా సరిగ్గా ఇదేమాదిరిగా ఉండటం  గమనార్హం. ఈ కేసుకు సంబంధించి ఇచ్చిన తీర్పులో, “స్పీకర్ తీర్పు తుది నిర్ణయం కాబోదని” స్పష్టం చేసింది. విచారణలో స్పీకర్ ఒక ట్రిబ్యునల్ మాదిరిగా వ్యవహరిస్తారు కనుక, న్యాయసమీక్ష పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేసింది. ఇప్పుడు బీఆర్‌ఎస్ నాయకులు ఈ కేసు ఆధారంగా కోర్టులో తమ వాదనలు వినిపించే అవకాశముంది. అంతేకాదు మహారాష్ట్ర, మణిపూర్‌లకు సంబంధించిన కేసుల అధ్యయనంలో బీఆరఎస్ నేతలు తలమునకలుగా ఉన్నారు.

నిజం చెప్పాలంటే కేసీఆర్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్‌ను రాష్ట్రంలో లేకుండా చేస్తానని ప్రతినపూని మరీ వలసలను ప్రోత్సహించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు,  “మీరు చేస్తే ఒప్పు…మేం చేస్తే తప్పా?”అని ప్రశ్నించవొచ్చు. కానీ ఒకరు తప్పు చేశారని మనం కూడా అదే బాటలో వెళితే ఇక దీనికి అంతూపొంతూ ఉండదు. ఇక ఎమ్మెల్యేలు కూడా తమకు పదవి ఉంటే  చాలు, పార్టీ ఏదైనా ఫరవాలేదనే స్థాయికి నేటి రాజకీయాలు దిగజారాయనడానికి ఈ పది మంది ఎమ్మెల్యేల ఉదం తమే గొప్ప ఉదాహరణ. వర్తమాన రాజకీయాల్లో ఎన్నికైన ఎమ్మెల్యేలకు తిరిగి ఎన్నికవుతామో లేదో అన్న నమ్మకం లేకపోవడం ఇటువంటి సమస్యలు ఉత్పన్నం కావడానికి ప్రధాన కారణం. ఇటువంటి వారిని చేర్చుకునే పార్టీలు నెంబర్ కౌంట్‌ను చూసుకుంటున్నాయి తప్ప, పార్టీ ప్రతిష్ట మసకబారుతుందన్న సత్యాన్ని విస్మరిస్తున్నాయి.

ఇది అన్ని పార్టీలకు వర్తించే సత్యం! ఇంత తాత్సారం జరిగిన తర్వాత స్పీకర్ వెలువరించిన నిర్ణయంపై బీఆర్ఎస్ కోర్టుకు వెళితే, ఇప్పటికే త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్న ఈ ఎమ్మెల్యేల భవితవ్యం మరింత సందిగ్ధంలో పడక మానదు. వొచ్చే ఎన్నికల దాకా ఈ విచారణ కొనసాగితే, ఈ గెలిచిన ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ ప్రజలకు ఏం సమాధానం చెబుతారు? ఇప్పటికీ వీరు బీఆరఎస్‌లో ఉన్నారో, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారో తెలియని సందిగ్ధ స్థితి!  పార్టీ ఫిరాయించినప్పుడు అంతా “చట్టపరిధిలోనే” జరిగిందన్న ధీమా నిండా ముంచడంతో, వీరి రాజకీయ భవితవ్యమే ప్రశ్నార్థకంగా మారింది. వీరిని ఏదోవిధంగా అనర్హులుగా ప్రకటింపజేస్తే, వొచ్చే ఉప ఎన్నికల్లో తన సత్తా చూపాలన్నది  బీఆర్ఎస్   వ్యూహం. నెంబర్ గేమ్‌లో వీరిని కాపాడుకోవాలన్నది కాంగ్రెస్ తాపత్రయం! కోర్టు తీర్పు ఎప్పుడు వొస్తుందో తెలియదు. అటువంటప్పుడు ఈ సమస్యకు ప్రస్తుతానికి పరిష్కారం లేనట్టే. కోర్టు తీర్పు వీరికి వ్యతిరేకంగా వొస్తే, తెలంగాణ రాజకీయాలు పెద్ద కుదుపునకు గురికావడం ఖాయం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *