– ఖైరతాబాద్ ఎమ్మెల్యే నాగేందర్‌కు నోటీసు జారీ
– 30న హాజరు కావాలని ఆదేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 28: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల అంశంపై సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణలో వేగం పెంచారు. ఇందుకు సంబంధించి తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 30న ఉదయం స్పీకర్ కార్యాలయంలో హాజరు కావాలని ఆయనను ఆదేశించారు. అదేవిధంగా ఫిర్యాదు చేసిన బీఆరఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కూడా నోటీసులు అందాయి. ఆరోజు ఉదయం 10:30 గంటలకు బీఆరఎస్ ఫిర్యాదుపై, మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫిర్యాదుపై విచారణ జరగనుంది. ఎమ్మెల్యేల అనర్హత అంశంలో జాప్యం జరుగుతోందని భావించిన సుప్రీంకోర్టు ఈ నెల 19న స్పీకర్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. చర్యలు తీసుకోకపోతే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించిన నేపథ్యంలో స్పీకర్ పెండింగ్‌లో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్ అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇప్పటికే అరికపూడి గాంధీ సహా మరో ఏడుగురికి ’క్లీన్ చిట’ లభించిన సంగతి తెలిసిందే. అయితే మిగిలిన ఎమ్మెల్యేలతో పోలిస్తే దానం కేసు భిన్నమైనది. ఆయన బీఆరఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బి`ఫామ్‌పై ఎంపీగా పోటీ చేశారు. ఇది స్పష్టమైన ఫిరాయింపు కిందకు వస్తుందని, అందుకే ఆయనపై అనర్హత వేటు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. ఒకవేళ స్పీకర్ అనర్హత వేటు వేస్తే దానం తన ఎమ్మెల్యే పదవిని కోల్పోతారు. మరోవైపు స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే దానం నాగేందర్ తన పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం కూడా గట్టిగా సాగుతోంది.
నేను బీఆరఎస్‌కి రాజీనామా చేయలేదు : దానం అఫిడవిట్
తనపై బీఆరఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌పై దానం నాగేందర్ స్పీకర్‌కు అఫిడవిట్ అందజేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలను ఆయన ఖండిస్తూ ఆ పిటిషన్‌ను కొట్టివేయాలని స్పీకర్‌ను కోరారు. తాను బీఆరఎస్‌కి రాజీనామా చేయలేదని, అలాగే పార్టీ తనను సస్పెండ్ చేసినట్లు సమాచారమూ అధికారికంగా తనకు అందలేదని అఫిడవిట్‌లో నాగేందర్ స్పష్టం చేశారు. మార్చి 2024లో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి హాజరైన విషయాన్ని అంగీకరించినప్పటికీ అది పూర్తిగా వ్యక్తిగత హోదాలో జరిగినదేనని చెప్పారు. ఒక పార్టీ సమావేశానికి వ్యక్తిగతంగా హాజరవడమే ఫిరాయింపుగా పరిగణించడాన్ని తప్ప్పుబట్టారు. విÖడియా కథనాల ఆధారంగా తాను పార్టీ మారినట్లు బీఆరఎస్ భావించడం అనుచితమని, ఆ నిర్దారణకు చట్టపరమైన ఆధారాలు లేవని చెప్పారు. అనర్హత పిటిషన్ రాజకీయ ప్రయోజనాల కోసం దాఖలు చేసినట్లు వాదించిన దానం పిటిషన్‌లో బలం లేదని, అందువల్ల దానిని కొట్టివేయాలని స్పీకర్ కోర్టును కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





