~ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి దూసుకుపోతోందని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ప్రజలందరూ తమ హక్కులను ఉపయోగించుకుంటూ బాధ్యతలను విస్మరించకుండా దేశ సేవకు దేశాభివృద్ధికి పాటుపడాలని అన్నారు. బుధవారం వికారాబాద్ కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రసాద్ కుమార్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఎగుర వేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజని, దేశమంతా 1947 ఆగస్టు 15న స్వాతంత్య్ర సంబరాల్లో మునిగిపోతుంటే హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే ఉన్నారని తెలిపారు. నిజాం ప్రైవేట్ సైన్యం రజాకార్ల దమనకాండ కొనసాగడంతో ఈ నిర్భంధానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు సాయుధ రైతాంగా పోరాటాలు చేసి ఎంతోమంది తమ ప్రాణాలు కోల్పోయారని ప్రసాద్ కుమార్ గుర్తు చేశారు.
రైతులను రుణ విముక్తి చేయడానికి దేశ చరిత్రలోనే మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ చేసిందన్నారు. వికారాబాద్ జిల్లాలో రైతు రుణ మాఫీ పథకం కింద మొత్తం లక్షా 358 మంది రైతులకు రూ.849 కోట్ల రుణ మాఫీ చేశారని తెలిపారు. వికారాబాద్ జిల్లాలో ఈ వానాకాలంలో 2 లక్షల 76 వేల 537 మంది రైతులకు గాను 363 కోట్ల 10 లక్షలను ఆయా రైతుల ఖాతాలో జమ చేశారని పేర్కొన్నారు. జిల్లాకు మంజూరైన 13,640 ఇళ్ళలో ఇప్పటివరకు 11,681 గృహాలు నిర్మించడానికి ఆమోదించారని అన్నారు. గృహ జ్యోతి పథకం కింద జిల్లాలో 200 యూనిట్లలోపు విద్యుత్ వాడుతున్న మొత్తం 1 లక్ష 39 వేల 812 కుటుంబాలకు ఉచితంగా సరఫరా జరుగుతున్నదని తెలిపారు. చేయూత పథకం ద్వారా జిల్లాలో మొత్తం లక్షా 9 వేల 283 మంది లబ్దిదారులకు ప్రతి నెలా 27. 36 కోట్ల ఆసరా పెన్షన్లు చెల్లించబడుతోందని తెలిపారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద జిల్లాలో 19,888 కుటుంబాలకు రూ.11.93 కోట్ల చెల్లింపులు చేశారని చెప్పారు.పేదలు కడుపునిండా తృప్తిగా అన్నం తినాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యాన్ని ఇస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ వసతి గృహాలలో పదేళ్ల తర్వాత డైట్ ఛార్జీలను 40 శాతం, కాస్మోటిక్ ఛార్జీలను 200 శాతం పెంచారని గుర్తుచేశారు. జిల్లాలో రూ.235 కోట్లతో వికారాబాద్ మెడికల్ కళాశాల, కొడంగల్ లో రూ.125 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. వికారాబాద్ లో నూతన జిల్లా హాస్పిటల్ ను ప్రారంభించగా పరిగి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను 30 పడకల నుంచి 100 పడకల దవాఖానగా అప్ గ్రేడ్ చేయడానికి శంకుస్థాపన చేసుకున్నామని చెప్పారు. 2035 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే మహత్తర లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ – 2047 ఉంటుందని, ఇది కేవలం ప్రణాళిక కాదు ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పంతో పనిచేస్తుందని స్పీకర్ ప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డి, తాండూర్ శాసన సభ్యులు మనోహర్ రెడ్డి అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్ సుధీర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ రెడ్డి బీసీసీబీ డైరెక్టర్ కిషన్ నాయక్, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




