స్పీక‌ర్ నోటీసుల‌పై వ్యూహ‌ప్ర‌తివ్యూహాలు

– ఎమ్మెల్యేల‌ను కాపాడుకునే ప‌నిలో కాంగ్రెస్‌
– ఉప ఎన్నిక‌పై బీఆర్ఎస్ దృష్టి
– రాష్ట్ర రాజ‌కీయాల‌పై జూబ్లీహిల్స్ ఎన్నిక ప్ర‌భావం

                                                                              (మండువ రవీందర్‌రావు )

దేశంలోని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాన్ని అనుసరించి కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరిన పదిమంది బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏలకు స్పీకర్‌ ‌నోటీసు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. ముందు అయిదుగురు ఎంఎల్‌ఏలకు నోటీసులు జారీచేసిన స్పీకర్‌ ‌రెండవ విడతగా మరో అయిదుగురికి నోటీసులు పంపిస్తున్నారు. స్పీకర్‌ ‌నోటీసులకు ఏదోఒక సమాధానం చెప్పుకోక తప్పని పరిస్థితి ఇప్పుడు ఆ ఎంఎల్‌ఏలకు ఏర్పడింది. ఇలాంటి పరిస్థితి గతంలో ఏనాడు ఎదురుకాలేదు. స్వాతంత్య్రం వచ్చినప్పటినుండి అనేకమంది ఎంఎల్యేలుగా ఎన్నికైన పార్టీనివీడి తమకు నచ్చిన పార్టీలో ఇష్టం వచ్చినంతకాలం గడిపిన సంఘటనలే ఎక్కువ. అంతేకాదు రెండు మూడు నెలల్లోనే వివిధ పార్టీల్లోకి పరకాయ ప్రవేశం చేసిన నాయకులూ లేకపోలేదు. కాని ఇక్కడ భారత రాష్ట్ర సమితి ఇలాంటి వ్యవస్థకు ఒక విధంగా ఫుల్‌స్టాప్‌కు కారణం కాబోతున్నది. వాస్తవంగా బిఆర్‌ఎస్‌ ‌కూడా గత పదేళ్ళుగా అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి తంతే సాగించినప్పటికీ, ఈసారి మాత్రం తమ పార్టీ సింబల్‌పై గెలిచిన ఎంఎల్యేలను అంత సులభంగా వదులుకోదల్చుకోలేదు. అందుకే హైకోర్టు నుండి సుప్రీంకోర్టువరకు వెళ్ళి ఫిరాయింపు ఎంఎల్యేలు తమ పదవులను వదులుకోక తప్పని పరిస్థితిని కల్పించింది. అయితే నిజంగానే ఈ పదిమంది ఎంఎల్‌ఏలు తమ పదవులను వదులుకుంటారా అంటే అదిప్పుడప్పుడే తేలేపరిస్థితి కనిపించడంలేదు. స్పీకర్‌ ‌వారికి నోటీసులైతే జారీ చేస్తున్నప్పటికీ కాంగ్రెస్‌ ‌పార్టీ మాత్రం వారిని ఈ ఆపదనుండి ఎట్లా గట్టెక్కించాలన్న సమాలోచన చేస్తున్నది. ఈ విషయమై శనివారం కాంగ్రెస్‌ ‌కోర్‌కమిటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికార గృహంలో సుదీర్ఘంగా చర్చించింది. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఇతర రాష్ట్రాలు ఎలా వ్యవహరించాయన్నది అధ్య‌యనం చేయడంతోపాటు, న్యాయనిపుణులకూడా సంప్రదించాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. అయితే ఇక్కడ విచిత్రకర విషయమేమంటే పార్టీ మారినప్పుడు చాలా అట్టాహసంగా కాంగ్రెస్‌ ‌పార్టీ కండువాలను కప్పుకున్న ఈ పదిమంది ఎంఎల్‌ఏపై విమర్శలు మొదలైనప్పుడు ఒక్కొక్కరు ఒక్కో విధంగా సమర్థించుకుంటూ వచ్చారు. కండువా కప్పినవారు కాంగ్రెస్‌ ‌నాయకులే అయినా తమకు దేవుడి పంచెలు కప్పారని ఒకరు, తమ నియోజకవర్గ అభివృద్ది కోసం ముఖ్యమంత్రిని కలుస్తే తప్పేంటని మరికొందరు, తమను సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రే ఆహ్వానించారని ఇంకొకరు, అసలు సాంకేతికంగా ఇంకా తాము బిఆర్‌ఎస్‌లోనే ఉన్నామని ఇలా ఎవరికి తోచినట్లు వారు చెప్పుకుంటూ వచ్చారు. అయితే కాంగ్రెస్‌ ‌పార్టీ కార్యక్రమాల్లో ఎవరెవరు ఎలా పాల్గొన్నారన్న సాక్షాధారాలను బిఆర్‌ఎస్‌ ‌సుప్రీంకోర్టు ముందుంచిన నేపధ్యంలో ఇప్పుడు అడకత్తరలో పోకచెక్కలా వారిపరిస్థితి ఏర్పడింది. కాగా అయిదుగురు ఎంఎల్యేల విషయంలో మాత్రం గట్టి సాక్షాధారాలుండడం వల్ల కాంగ్రెస్‌ ‌పార్టీ వారిని పక్కకు పెట్టకతప్పదన్న వార్తలు వస్తున్నాయి. వారిలో ప్రధానంగా స్టేషన్‌ ‌ఘనపూర్ ఎంఎల్ ఏ కడియం శ్రీహరి, ఖైరతాబాద్‌ ఎంఎల్‌ఏ ‌దానం నాగేందర్‌, ‌గద్వాల ఎంఎల్‌ఏ ‌బండ్ల క్రిష్ణమోహన్‌రెడ్డి, షేర్‌ ‌లింగంపల్లి ఎంఎల్‌ఏ అరికపూడి గాంధీలున్నట్లు తెలుస్తున్నది. వీరు ఎంఎల్‌ఏ ‌పదవులకు రాజీనామా ఇచ్చేందుకు సిద్దపడినట్లు తెలుస్తున్నది. త్వరలో జూబ్లీహిల్‌ ఎన్నికలు ఉన్నందున, ఆ ఎన్నికల షెడ్యూల్‌ ‌విడుదలైన తర్వాతనే రాజీనామాచేయడంద్వారా ఖాళీ అయ్యే స్థానాల ఉప ఎన్నికలకు కొంత సమయం తమకు లభిస్తుందని కాంగ్రెస్‌ ఆలోచిస్తున్నట్లు వినికిడి.
ఇదిలాఉంటే రాజీనామాలద్వారా ఏర్పడనున్న పది నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికల్లో తమ సత్తా చాటుకోవాలని బిఆర్‌ఎస్‌తో పాటు బిజెపి ఎదురుచూస్తున్నది. ఇప్పటికే ఎనిమిది శాసనసభ నియోజకవర్గాలను కైవసం చేసుకున్న బిజెపి ఈ పదింటిలో సాధ్యమైనన్ని స్థానాలను రాబట్టుకోవాలన్న ఆలోచనలోఉంది. కాగా  సుప్రీంకోర్టు తీర్పుతో నైతిక విజయాన్ని సాధించామని ఉత్సాహపడుతున్న బిఆర్‌ఎస్‌, ఎట్టిపరిస్థితిలో ఈ పది ఎంఎల్‌ఏ ‌స్థానాలను వదులుకోవద్దన్న పట్టుదలతోఉంది. వాస్తవంగా ఈ పది స్థానాలు గత ఎన్నికల్లో తాము గెలుచుకున్నవే కావడంతో తిరిగి వాటిని స్వంతం చేసుకోవాలని ఇప్పటికే పార్టీ శ్రేణులను ఆ పార్టీ నేతలు సమాయత్త పరుస్తున్నారు. ఈ ఉప‌ఎన్నికలతో కాంగ్రెస్‌కు బై బై చెప్పాలని ఆ పార్టీ వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌తమ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తులు చేస్తున్నారు. అయితే ముందుగా జరిగే జూబ్లీహిల్‌ ‌నియోజకవర్గ ఉప ఎన్నికపైన కూడా ఈ మూడు ప్రధాన పార్టీలు దృష్టిపెట్టాయి. ఇక్కడినుండి బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏగా గెలిచిన మాగంటి గోపీనాథ్‌ అకాలమరణంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే తమ స్థానాన్ని పదిలపర్చుకోవాలని బిఆర్‌ఎస్‌ ‌పట్టుదలగా ఉండగా, హైదరాబాద్‌లో తమకు పట్టుందని నిరూపించుకోవాలని బిజెపి పట్టుదలగాఉంది. కాగా అధికారంలోఉండి రాష్ట్ర రాజధాని పరిధిలోని నియోజకవర్గాన్ని వదులుకుంటే అప్రదిష్ట పాలవుతామని కాంగ్రెస్‌ ‌భావిస్తున్నది. ఏదిఏమైనా జూబ్లీహిల్‌ ఎన్నికఫలితాలు తెలంగాణ రాజకీయాల మార్పుకు కారణమవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
—-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *