– సరదాగా ముచ్చటించుకున్న సభ్యులు
– హాజరైన ప్రధాని మోదీ, రాజ్‌నాథ్ సింగ్
- ప్రధాని విదేశీ పర్యటనపై ప్రియాంక ఆరా
న్యూదిల్లీ, డిసెంబర్ 19: పార్లమెంటు శీతాకాల సమావేశాలు మూడువారాలపాటు వాడివేడి చర్చలు, వాకౌట్లు, నిరసనల మధ్య ముగిసాయి. ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడటంతో సభలోని వాతావరణాన్ని తేలిక చేసేందుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం ఉదయం ఎంపీలందరికీ తన నివాసంలో తేనేటి విందు ఇచ్చారు. గత సమావేశాల మాదిరిగా కాకుండా ఈ టీ పార్టీకి విపక్ష ఎంపీలు కూడా హాజరయ్యారు. స్నేహపూర్వక వాతావరణంలో సరదా ముచ్చట్లతో సభ్యులంతా సందడిగా గడిపారు. లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ జర్మనీ పర్యటనలో ఉండటంతో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొని విపక్షం తరఫున ప్రాతినిధ్యం వహించారు. 20 నిమిషాలపాటు జరిగిన ఈ కార్యక్రమంలో ఓం బిర్లా, ప్రధాని మోదీతోపాటు రాజ్‌నాథ్ సింగ్ కూర్చుని ఉండగా ఆయన పక్కన ప్రియాంక ఆశీనులయ్యారు. మోదీ ఇటీవల జరిపిన ఇథియోపియా, జోర్డాన్, ఒమన్ పర్యటన గురించి ప్రియాంక అడగగా బాగా జరిగిందని ఆయన బదులిచ్చారు. సమాజ్‌వాదీ పార్టీ నేత ధర్మేంద్ర యాదవ్, ఎన్‌సీపీ (ఎస్‌పీ) నేత సుప్రియా సులే, సీపీఐ నేత డి.రాజా కూడా పాల్గొన్నారు. శీతాకాల సమావేశాలను మరికొద్ది రోజులు పొడిగించి ఉండాల్సిందని ధర్మేంద్ర యాదవ్ అభిప్రాయపడగా, ఆయనకు గొంతు నొప్పి రాకుండా ఇక్కడితో ముగించామని మోదీ సరదాగా బదులిచ్చారు. బాగా ప్రిపేర్ అయి సభకు వచ్చారంటూ ఎన్‌కే రామచంద్రన్ తదితర విపక్ష ఎంపీలను పీఎం అభినందించారు. పాత పార్లమెంటు భవనంలో మాదిరిగానే న్యూ పార్లమెంట్ బిల్డింగ్‌లో ఎంపీల కోసం ఒక సెంట్రల్ హాల్ చేర్చాలని పలువురు ఎంపీలు మోదీని కోరారు. సెంట్రల్ హాలులో ఎంపీలు, రిటైర్ అయిన ఎంపీలు చర్చించుకునే వారు. అది రిటైర్‌మెంట్ తర్వాత కదా.. ఇంకా మీరు చాలా సేవ చేయాల్సి ఉంది అని అనడంతో సమావేశంలో నవ్వులు వెల్లివిరిసాయి. విపక్ష పార్టీ సభ్యులను సభలో మాట్లాడేందుకు అనుమతించడం లేదని ఆరోపిస్తూ గత పర్యాయం స్పీకర్ టీ పార్టీని రాహుల్, ఇతర విపక్ష నేతలు బాయ్‌కాట్ చేశారు. అయితే ఈసారి పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో విపక్షాల విషయంలోనూ స్పీకర్ సముచితంగా వ్యవహరించారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అభిప్రాయపడ్డారని, స్పీకర్ టీపార్టీకి విపక్ష ఎంపీలంతా తప్పనిసరిగా హాజరుకావాలనే నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





