– ఇది ముమ్మాటికీ అనైతిక చర్యే అవుతుంది
– ఇలాంటివి నిరోధించేలా చట్టం తీసుకు రావాలి
– శాసనసభాపతుల సదస్సులో స్పీకర్ అయ్యన్న వ్యాఖ్య
లక్నో, జనవరి 21: శాసనసభకు ఒక్క రోజు కూడా హాజరు కాకుండా కొందరు ఎమ్మెల్యేలు జీతభత్యాలు తీసుకుంటున్నారని ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. నో వర్క్.. నో పే’ అనే విధానం చట్టసభల్లోనూ రావాలని అన్నారు. దానికనుగుణంగా చట్టం చేయాలని, దానికి సభాపతుల సదస్సులో తీర్మానం చేయాలని ఆయన ప్రతిపాదించారు. ఆయా విభాగాల్లో ఉద్యోగులు విధులకు హాజరుకాకపోతే సంబంధిత అధికారులు క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం సహా వారి వేతనాలు నిలిపి వేస్తున్నారన్నారు. మరి తాము ఎన్నుకున్న ఎమ్మెల్యేలు సభకు రానప్పుడు ఎందుకు చర్యలు తీసుకోరని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అయ్యన్న తెలిపారు. ఇలాంటి అనైతిక ప్రవర్తనను ఎలా సమర్థించగలుగుతామని ప్రశ్నించారు. ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలో నిర్వహించిన వివిధ రాష్ట్రాల శాసనసభాపతుల సదస్సులో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రజల పట్ల శాసనవ్యవస్థ జవాబుదారీతనం అనే అంశంపై అయ్యన్న మాట్లాడారు. కొందరు ఎమ్మెల్యేలు ఒక్క చర్చలోనూ పాల్గొనలేదు. సభకు రాకుండా జీతాలు తీసుకుంటున్నారు. అలాంటి వారిని చూస్తుంటే వేదన కలుగుతోంది. అనైతిక ప్రవర్తనతో ప్రజల దృష్టిలో చులకన కాకుండా ఉంటారా? ఇలాంటి సభ్యుల వ్యవహారశైలిని నిషేధించే నిబంధనలేవీ ప్రస్తుతం లేవు. అలాంటి వారిని రీకాల్ చేసేలా ప్రజలకు హక్కు కల్పించాలని అయ్యన్నపాత్రుడు సూచించారు. 2024 ఎన్నికల తర్వాత అసెంబ్లీకి ఒక్కరోజు కూడా రానివారు ఉన్నారని, సభలో జరిగే ప్రశ్నోత్తరాలు, చర్చల్లోనూ పాల్గొనడం లేదని పేర్కొన్నారు. దీనివల్ల తమను ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేస్తున్నారని వ్యావ్యాఖ్యానించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





