సభలు సజావుగా జరిగేలా చూడాలి

– అన్ని విభాగాల అధికారులు అందుబాటులో ఉండాలి
– ఉన్నతాధికారులతో స్పీకర్‌ గడ్డం సమావేశం
– రేపటినుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 29: రాష్ట్ర శాసనసభ, శాసనమండలి(Assembly, Council) సమావేశాలు శనివారం నుండి ప్రారంభం కానున్న నేపధ్యంలో సభ నిర్వహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ ఉన్నతాధికారులతో శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్‌ బండా ప్రకాష్‌ ముదిరాజ్‌, లెజిస్లేటివ్‌ సెక్రటరీ డాక్టరు వి.నరసింహాచార్యులుతో కలిసి సభాపతి గడ్డం ప్రసాద్‌ కుమార్‌(speaker Gaddam Prasad Kumar) శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పదవీ కాలం పొడిగింపు పొందిన చీఫ్‌ సెక్రటరీ కె.రామకృష్ణారావుకు స్పీకర్‌, చైర్మన్‌, డిప్యూటీ చైర్మన్‌లు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ మాట్లాడుతూ రేపటినుండి శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభవుతున్నాయని, గతంలోలాగానే ఈ సమావేశాలకు కూడా ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలని కోరారు. గౌరవ సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని, శాఖలకు సంబంధించిన చర్చ జరుగుతున్నప్పుడు సంబంధిత విభాగాల అధికారులు అందుబాటులో ఉంటూ మంత్రులకు, సభ్యులకు తగిన సమాచారం అందిస్తూ సహకరించాలని, సమావేశాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరగడానికి పోలీసు శాఖ తరపున చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జనం జరుగుతున్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే భారీ వర్షాలు కురిసి కొన్ని రూట్లలో రోడ్లు దెబ్బతిన్నాయని, ట్రాఫిక్‌ అధికారులు సమన్వయం చేసుకుని గౌరవ సభ్యులు సరైన సమయానికి సభకు చేరుకునే విదంగా సహకరించాలని సూచించారు. సభ జరుగుతున్న సమయంలో ధర్నాలు, ఆందోళనలు జరగకుండా ముందస్తుగానే సమాచారం అందుకుని అడ్డుకోవాలని, తద్వారా సమావేశాలు సజావుగా జరుగుతాయని అన్నారు.

కౌన్సిల్‌ చైర్మన్‌ సుఖేందర్‌ రెడ్డి మాట్లాడుతూ శాసనమండలి సమావేశాలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమష్టిగా పనిచేయాలన్నారు. అవసరమైన నోడల్‌ అధికారులను, లైజనింగ్‌ ఆఫీసర్లను నియమించాలని, పెండింగ్‌లో ఉన్న ప్రశ్నలకు వెంటనే సమాధానాలు పంపించాల ఆదేశించారు. తెలంగాణ పోలీసు దేశంలోనే సమర్ధవంతమైనదని, మంచి పేరు ఉన్నదని, మీ ఆద్వర్యంలో శాసనమండలి సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించాలిలని కోరారు.

చీఫ్‌ సెక్రటరీ రామకృష్ణారావు మాట్లాడుతూ సభ సజావుగా జరగడానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామన్నారు. అన్ని శాఖలను సమన్వయం చేస్తూ అవసరమైన అధికారులను అందుబాటులో ఉంచుతామని, సభ నిర్వహణకు ఇబ్బందులు లేకుండా, సజావుగా జరిగేలా ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో సహకరిస్తామన్నారు. సమావేశానికి జీఏడీ కార్యదర్శి రఘనందన్‌ రావు, అడిషనల్‌ సెక్రటరీ(ఫైనాన్స్‌) రాయ రవి, డైరెక్టర్‌ (ప్రొటోకాల్‌) శివలింగయ్య.హోం శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రవి గుప్తా, డీజీపీ డాక్టర్‌ జితేందర్‌, ఏడీజీ, లా అండ్‌ ఆర్డర్‌ మహేష్‌ భగవత్‌, అడిషనల్‌ సీపీ (లా అండ్‌ ఆర్డర్‌) విక్రమ్‌ సింగ్‌ మాన్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనర్లు సుధీర్‌బాబు, అవినాష్‌ మహంతి, ఇంటెలిజెన్స్‌ ఐజీ కార్తికేయ, అసెంబ్లీ ఛీఫ్‌ మార్షల్‌ కర్ణాకర్‌, కౌన్సిల్‌ చీఫ్‌ మార్షల్‌ సంజీవరెడ్డి తదితరులు హాజరయ్యారు.


 

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్‌ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్‌ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్‌ చానల్‌ను సబ్‌ స్క్రైబ్‌ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్‌ చేయడం మరిచిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *