‘ఎంత సౌందర్యం?’ రెప్పలార్పకుండా తెరిచిన నోరు ముయ్యకుండా అంది మగపురుగు.
‘నన్ను పొగడడమే నీకు విధిలాగుంది’ రెప్పల్తెరవకుండా ఆవలింత తీస్తూ అంది ఆడపురుగు.
‘నిన్ను కాదు’ మాటలు రానట్టు తన్మయంతో చూపు తిప్పకుండా అంది మగపురుగు.
ఆ మాటకు వులిక్కిపడి కళ్ళుతెరచి చూస్తూ తనూ రెప్పలు కదపకుండా అలానే వుండిపోయింది ఆడపురుగు.
రంగురంగుల పిట్ట వొకటి అంతవరకూ నీళ్ళమధ్యలోని రాయిమీద వాలి ముత్యంలా మెరిసింది. అది యెండకు కందిపోయిందేమో నీళ్ళలో బుడుంగున ములిగివచ్చి మళ్ళీ రాయిమీద రెక్కలాడిస్తూ వాలింది. దాని వొంటిమీంచి రాలిన నీటిచుక్కలు రత్నాలు రాలినట్టు రాలాయి.
ఆ రాయికి పట్టిన నాచుమీంచి పాకుతూ వచ్చిన పురుగులు రెండూ అబ్బురంగా పిట్టని చూశాయి.
‘ఇంద్రధనస్సు రంగులన్నీ వొంటికి పూసుకున్నట్టుంది’ అంది మగపురుగు.
‘కదా? అదీ అందమంటే’ నొసలు చిట్లించింది ఆడపురుగు.

గాలికి రెపరెపలాడుతున్న యీకలు జొన్నపొత్తు నూగుకన్నా మెత్తనినూలులా కదిలి రంగులు మారుతున్నాయి.
‘ఇంత అందమైన పిట్టకి ఆహారమైపోయినా పరవాలేదు, జన్మ ధన్యమైపోతుంది,’ అంది మగపురుగు.
ఆ మాట విన్నట్టు అర్థం చేసుకున్నట్టు ఆ అందాల పిట్ట మగపురుగుని నోటితో వొడుపుగా పట్టి నేలమీద అటూయిటూ తిప్పి రాతికేసి బాది ఆపై కాళ్ళతోపట్టి ముక్కుతో పొడిచి చర్మంచీల్చి, ముక్కలుచేసి మింగుతూ వుంటే పిట్టలో అందం తప్ప అన్నీ కనిపించాయి ఆడపురుగుకి. కళ్ళు చీకట్లు కమ్ముతూ వుండగా యిక తనవంతని అర్థమైంది!

-బమ్మిడి జగదీశ్వరరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *