సోమంచి ‘సాహిత్య యజ్ఞం’ శాస్త్రి

“సోమంచి గారు డిప్యూటి కమిషనర్ అయినప్పటికీ, ఆంధ్ర మహాసభకు స్థలాన్ని కేటాయించినప్పటికీ, ఆయన ముందుగా ఆంధ్ర మహాసభ కార్యవర్గ సభ్యుడిగానే మహాసభలో ప్రవేశించారు. ఆ తర్వాత ఆయన సాహిత్య విభాగానికి ఉపాధ్యక్షుడి గా సేవలందించారు. ఆ తర్వాత ఆయన అధ్యక్షుడిగా విధులు స్వీకరించారు.. ఆంధ్ర మహాసభ చరిత్రలో అదొక స్వర్ణయుగం. ఆంధ్ర మహాసభలో ఉత్తమ విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడం, విద్యార్థుల్ని సన్మానించడం సోమంచిగారి హయాంలోనే మొదలయింది. ఆయన హయాంలో నాటకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. తెలుగు సంస్కృతిని పెంచే కార్యక్రమాలు విరివిగా జరిగేవి.”

తన కర్తవ్యదీక్షతో, తెలుగు భాషా సాహిత్యాభిమానంతో మహారాష్ట్ర తెలుగు జాతికి ఎనలేని గుర్తింపు, గౌరవం తీసుకొచ్చి సుసంపన్నం చేసిన అవిస్మరణీయమైన మహోన్నత వ్యక్తి..సోమంచి యజ్ఞన్న శాస్త్రిగారు..

3, నవంబర్ 1913లో, ఏలూరులో సీతారామయ్య, వరలక్ష్మి దంపతులకు జన్మించిన యజ్ఞన్నగారు ఉన్నత విద్యనభ్యసించి ముంబైకి చేరుకున్నారు. 1945లో బృహన్ముంబై మహానగర్ పాలికలో చేరి, డిప్యూటి కమీషనర్ స్థాయికి ఎదిగారు. తన జీవితంలోని విలువైన మూడు దశాబ్దాలను మున్సిపల్ కార్పోరేషన్ సేవలో వెచ్చించారు. ఆయన తన హయాంలో ముంబైలో విద్య, ఆరోగ్యం, పరిశుభ్రతలాంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపేవారు.

ప్రాథమికంగా యజ్ఞన్నగారు సాహితీవేత్త.. ముంబై లో పరిపాలనా పరంగా, నిర్మాణపరంగా ఆయనను ‘ఆర్కిటెక్ట్’ అని, సాహిత్యపరంగా ఆయనను ‘స్కల్పటర్’ అని పిలిచేవారు. విశేషమేమంటే, ఆయనకు తెలుగు భాషన్నా, తెలుగు సాహిత్యమన్నా ఎనలేని అభిమానం. తెలుగు సంస్థల్ని బాగా ప్రోత్సహించేవారు. కానీ, కమీషనర్‌గా పక్ష పాతం వహించకూడదు గనుక, అన్ని భాషల, ప్రధానంగా దక్షిణ భాషా సంఘాలపై సమదృష్టిని పాటించేవారు.

సాహిత్యపరంగా..:
సోమంచి యజ్ఞన్న శాస్త్రిగారు అంతర్జాతీయ స్థాయి తెలుగు రచయిత.. ప్రధానంగా ఆయన గంభీరమైన అంశాలను హాస్యపూరితంగా నాటకాల రూపంలో రాసేవారు. ఆయన రచయితే కాకుండా అనువాదకులు కూడా..! ఎన్నెన్నో రచనలు తెలుగు నుండి ఇంగ్లీష్‌లోకి అనువాదం చేసేవారు. ఆయన రాసిన ఆర్టికల్స్ *‘ది ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా’* లో ప్రచురితం అయ్యేవి.. ఇది ఒక తెలుగు రచయితకు గౌరవప్రదమైన స్థాయి అని చెప్పాలి. ముంబై తెలుగు రచయితలెవ్వరికీ అంతటి గౌరవం ఇంతవరకు దక్కలేదు.. ఆయన కొన్ని ఇంగ్లీష్ నాటకాల ఆధారంగా తెలుగు నాటకాలు రాశారు. ముఖ్యంగా జాన్ గాల్స్‌వర్ధీ, మారిస్ మాటర్లింక్, నికోలాయ్ గగోల్, జార్జ్ బెర్నార్డ్ షా లాంటి వారి రచనలను తెలుగీకరించారు..

ఆయన రచనలు కొన్ని..
– కళ్యాణి (1947), మహానుభావులు, (1957) న్యాయం, విశ్వం పెళ్లి (1949), పాపం సోకని పతనం (1970), యమునా తీరే ఎవరికి వారే (1954), పెద్ద మనుషులు (1954), మాయ నొప్పులు (1955), రంగభూమి, పేరయ్య రాజంట, ఓ మనిషి నూతిలో పడితే.., ఈ సంసారం, లోకులు కాకులు, రిహార్సల్, ప్రదర్శనము, ఆంధ్ర నాటక రంగానికి జై, వస్తుందండి రాష్ట్రం రాకేం చేస్తుంది, కట్నం కోరని కల్యాణం, కాలక్షేపానికి, నిత్యానందం … ఇవి నాటకాలు..

– లంచం పట్టిన ఆఫీసర్,- లాభం చేసిన గొల్లది,- సంఘం కోసం చందాలు తదితర కథలు కూడా రాశారు. సామాజిక అంశాలను వ్యంగ్యాత్మకంగా, మానవీయ కోణం లో ఆయన చేసిన రచనల వల్ల ఆయన ఆంధ్ర నాటక రంగంలో’ విశిష్టమైన వ్యక్తిగా నిలిచారు. లక్నోలో జరిగిన అభ్యుదయ రచయితల సమావేశానికి కూడా హాజరయ్యారు. 1992లో తెలుగు విశ్వవిద్యాలయం ఆయనకు ‘కీర్తి పురస్కారం’ ఇచ్చి గౌరవించింది.. 2009లో బొమ్మూరు తెలుగు విశ్వవిద్యాలయం లో ‘సోమంచి యజ్ఞన్న శాస్త్రి రచనలు – ఒక పరిశీలన’ అనే అంశంపై ప్రేమకుమారి అనే స్కాలర్ పిహెచ్‌డి చేయడం విశేషం. 2011లో ‘అమ్మ వడి’ అనే బ్లాగ్‌లో ‘పాఠక్’ అనే సమీక్షకుడు యజ్ఞన్న గారి గురించి రాస్తూ, “ఆయన రచనలకు రావాల్సినంత పేరు వచ్చిందో లేదో చెప్పలేమనీ, ఆయన ముంబై కేంద్రంగా రాయడం వల్లే తగినంతగా పేరు రాలేదేమో..” అని సందేహం వ్యక్తం చేశారు. ప్రస్తుత ముంబై రచయితలు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి..!

1950 – 60 మధ్య కాలంలో ముంబైలో తెలుగు స్కూళ్లు విస్తరించడానికి సోమంచి గారు ఎంతో శ్రమించారు.

ఆంధ్ర మహాసభ సేవలో..:
శిష్టా వేంకటరావు, దేశిరాజు నరసింహారావు, ఇవిఎస్ దేశికాచారి తదితరులు ఆంధ్ర మహాసభ స్థాపన కోసం సర్వం త్యాగం చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఆంధ్ర మహాసభ స్థలాన్ని సోమంచిగారు డిప్యూటి కమిషనర్‌గా ఉన్నప్పుడే ‘జింఖానా’ అనే పదాన్ని చేర్చి స్థలాన్ని మంజూరు చేశారు. ఆంధ్ర మహాసభ తో పాటు మరికొన్ని దక్షిణ భాషా సంస్థలకు కూడా స్థలాన్ని కేటాయించారు. అందులో షణ్ముఖానంద హాల్ స్థలం కూడా ఒకటి. మరి మిగతా దక్షిణాది సంస్థలతో పోలిస్తే మన ఆంధ్ర మహాసభ ఏ స్థాయిలో ఉందో మనమే ఆత్మపరిశీలన చేసుకోవాలి.

సోమంచి గారు డిప్యూటి కమిషనర్ అయినప్పటికీ, ఆంధ్ర మహాసభకు స్థలాన్ని కేటాయించినప్పటికీ, ఆయన ముందుగా ఆంధ్ర మహాసభ కార్యవర్గ సభ్యుడిగానే మహాసభలో ప్రవేశించారు. ఆ తర్వాత ఆయన సాహిత్య విభాగానికి ఉపాధ్యక్షుడి గా సేవలందించారు. ఆ తర్వాత ఆయన అధ్యక్షుడిగా విధులు స్వీకరించారు.. ఆంధ్ర మహాసభ చరిత్రలో అదొక స్వర్ణయుగం. ఆంధ్ర మహాసభలో ఉత్తమ విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడం, విద్యార్థుల్ని సన్మానించడం సోమంచిగారి హయాంలోనే మొదలయింది. ఆయన హయాంలో నాటకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. తెలుగు సంస్కృతిని పెంచే కార్యక్రమాలు విరివిగా జరిగేవి.

ఆంధ్ర మహాసభ వార్తలకు ప్రాధాన్యత ఇస్తూ ‘మహాంధ్ర’ అనే త్రైమాసిక పత్రికను స్వీయ సంపాదకత్వంలో సోమంచిగారు వెలువరించేవారు. సాంకేతికంగా ఏ సమస్యలు వచ్చాయో ఏమో కానీ, మహాంధ్ర పత్రికను ‘మహాంధ్ర విజ్ఞాన సాహితీ’ అనే సంస్థ ఆధ్వర్యంలో, ఖేడ్‌గల్లీలోని ‘వివేక గ్రంథాలయం’చిరునామాతో వెలువరించేవారు. ఈ పత్రికలో నేటి ప్రఖ్యాత రచయిత్రి తురగా జయశ్యామల గారు విరివిగా కథలు, నాటకాలు, కథనాలు రాసేవారు. సోమంచి గారు రాసిన ‘తెలుగు మరాఠీ భాషల సంబంధ బాంధవ్యాలు’ అనే ఆర్టికల్ ఇప్పటికీ టార్చ్ బేరరే..! ఆయన రాసిన ‘రామయ్య బాబాయి అంతిమ యాత్ర’ అనే దీర్ఘ కవిత సంచలనం సృష్టించింది ఆ కాలంలో..!

పరిపాలనాదక్షుడిగా, పరిపక్వమైన రచయితగా సోమంచి యజ్ఞన్న శాస్త్రి గారు ముంబై తెలుగువారికి చేసిన సేవలు నేటికీ అనితర సాధ్యం. ఆయన రచనల్నే కాదు… ఆయనను కూడా మనం మరిచిపోయే దశకు చేరుకోవడం విచారకరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *