ఐక్య‌త‌తోనే స‌మ‌స్య‌ల ప‌రిష్కారం

ఎమ్మెల్సీ ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్‌
ఫ్లెక్స్ ప్రింటర్స్ అసోసియేష‌న్‌ క్యాలెండ‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, జ‌న‌వ‌రి 10 :  సంఘాల‌తో మనలో ఐక్యతను పెంపొందించడం మాత్రమే కాకుండా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో చర్చలు జరపడానికి కీలకంగా వ్యవహరిస్తాయ‌ని ఎమ్మెల్సీ ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్ అన్నారు. తెలంగాణ ఫ్లెక్స్ ప్రింటర్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ 2025 క్యాలెండర్‌ను టిజేఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ, టిజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయ‌న ఫ్లెక్స్ ప్రింటర్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఏడాది వ్యాపారం మంచి పురోగతిని సాధించాలని ఆకాంక్షించారు.  గత ప్రభుత్వ హయాంలో ఫ్లెక్సీ ప్రింటర్స్ ఓనర్లపై అనేక కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారని, ప్రస్తుత ప్రభుత్వం వేధింపులు లేకుండా సమస్యలు వింటూ పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటోందని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పుల భారం ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాలా దిశగా నడిపించిందని, కొత్తగా తీసుకున్న అప్పుల్లో 75 శాతం పాత అప్పులను తీర్చడానికే వెచ్చించాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు.

ఈ-ఫార్ములా రేస్ నిధుల మళ్లింపుపై సరైన అనుమతులు లేకపోవడం, ఎన్నికల సమయంలో ఈ నిధులు ఎందుకు మళ్లించారన్న విషయంపై పూర్తి ఎంక్వైరీ జరిగితే మరిన్ని అంశాలు వెలుగులోకి వొస్తాయని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై రార్కీ ఐఐటీ ప్రొఫెసర్లు చేసిన అధ్యయనంలో నిర్మాణ లోపాలే కుంగడానికి కారణమని తేల్చి చెప్పారని అన్నారు. వృత్తిపరంగా ఫ్లెక్స్ ప్రింటర్స్ ఎంప్లాయీస్‌కు కావలసిన సహాయం అందించేందుకు, హెల్త్ కార్డు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తానని చెప్పారు.  కార్యక్రమంలో టీఎఫ్పిఈడ‌బ్ల్యూఏ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ అన్సారీ, ఉపాధ్యక్షులు రాజ్ శేఖర్, జాయింట్ సెక్రటరీ మహ్మద్ అలీ, టిజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె వినయ్, బైరి రమేష్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *