రైతు సమస్యల పరిష్కారానికి చర్యలు

– రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులకు మంత్రి తుమ్మల హామీ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 12: మార్కెటింగ్‌లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా అన్ని చర్యలు తీసుకొంటున్నదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం నుండి తగిన సహాయ సహకారాలు లేకపోవడంతో పత్తి కొనుగోళ్లలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు మంత్రి తుమ్మలను బుధవారం సచివాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ పై విధంగా బదులిచ్చారు. సోయాబీన్‌లో కూడా రంగు మారిన పంటను కొనుగోలు చేయాలంటూ కేంద్రాన్ని కోరామని, మొక్కజొన్న పంటను రాష్ట్రం సొంత నిధులతో సేకరిస్తున్నదని, రైతుల నుండి విజప్తి రాగానే ఎకరానికి ఉన్న 18 క్వింటాళ్ల పరిమితిని 25 క్వింటాళ్లకు పెంచినట్లు వివరించారు. రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించాలని రాష్ట్రస్థాయి వ్యవసాయ అధికారులు, మార్కెటింగ్‌ అధికారులను మంత్రి ఆదేశించారు. స్వరాజ్య వేదిక ప్రతినిధులు ప్రస్తావించినట్లు, పంట నష్టం నివేదికలో ఎలాంటి పొరపాట్లు లేకుండా ఆ నివేదికలను గ్రామ పంచాయతీలలో నోటీస్‌ బోర్డులలో ఉంచే విధంగా అధికారులకు ఆదేశాలు ఇస్తామన్నారు. ఎక్కడైనా ఎవరైనా రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే మరోసారి వెళ్లి పంటలను పరిశీలించి నష్టం వివరాలు నమోదు చేయాల్సిందిగా ఆదేశిస్తామని తెలిపారు. మార్కెటింగ్‌లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా పంటలు కొనుగోళ్లు చేసేలా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని వారికి మంత్రి స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *