సైనికుల సేవ నిస్వార్థమైనది

– గోల్కొండ కోటలో ‘విజయ్‌ దివస్‌’ వేడుకలు
– పాల్గొన్న మంత్రి జూపల్లి

హైదరాబాద్‌, డిసెంబర్‌ 16: విజయ్‌ దివస్‌ సందర్భంగా 1971లో పాకిస్థాన్‌తో పోరాడి ధైర్యం, త్యాగంతో భారత్‌కు చరిత్రాత్మక విజయాన్ని అందించిన వీర సైనికులను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్మరించుకున్నారు. విజయ్‌ దివస్‌ను పురస్కరించుకుని చారిత్రక గోల్కొండ కోటలో మంగళవారం నిర్వహించిన వేడుకల్లో ఆయన ప్రసంగించారు. వారి దృఢ సంకల్పం, నిస్వార్థ సేవ దేశాన్ని రక్షించాయని, దేశ చరిత్రలో గర్వించదగిన క్షణాలను లిఖించారని చెప్పారు. ఈ విజయ్‌ దివస్‌ వారి పరాక్రమానికి వందనం అర్పించేదిగా, వారి అసమాన స్ఫూర్తికి చిహ్నంగా నిలుస్తుందని అన్నారు. 1971 యుద్ధంలో భారత సాయుధ దళాలు కేవలం 13 రోజుల్లోనే చారిత్రక విజయం సాధించాయని, 93 వేల మంది పాకిస్థాన్‌ సైనికులు లొంగిపోవడంతో బంగ్లాదేశ్‌ అవతరించిందని మంత్రి గుర్తు చేశారు. అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ దృఢమైన నాయకత్వమే ఈ విజయానికి ప్రధాన కారణమని తెలిపారు. సాయుధ దళాలపై సంపూర్ణ విశ్వాసం ఉంచి వారికి ఆమె పూర్తి స్వేచ్ఛనిచ్చారని అన్నారు. ఫీల్డ్‌ మార్షల్‌ సామ్‌ మానెక్‌షా, అరుణ్‌ ఖేతర్పాల్‌, ఆల్బర్ట్‌ ఎక్కా వంటి వీరుల త్యాగాలు దేశ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయని చెప్పారు. లాంగేవాలా నుంచి తూర్పు యుద్ధరంగం వరకు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ సమన్వయంతో, క్రమశిక్షణతో పోరాడిన తీరు దేశానికే గర్వకారణమని పేర్కొన్నారు. ఇటీవల పహల్గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ను ప్రస్తావించిన మంత్రి భారత్‌ శాంతిని కోరుకుంటూనే జాతీయ భద్రతకు ముప్పు వస్తే గట్టిగా ప్రతిస్పందిస్తుందనే స్పష్టమైన సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చిందన్నారు. గోల్కొండ కోట వంటి చారిత్రక ప్రదేశంలో విజయ్‌ దివస్‌ను జరుపుకోవడం గర్వకారణమని, రాష్ట్రం ఎల్లప్పుడూ సాయుధ దళాల పక్షాన దృఢంగా నిలుస్తుందని మంత్రి స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీఏఎస్‌ఏ మేజర్‌ జనరల్‌ అజయ్‌ మిశ్రా, బ్రిగేడియర్‌ రాహుల్‌ థాప్లయిడ్‌, డీజీపీ శివధర్‌ రెడ్డి, టీజీపీఎస్సీ చైర్మన్‌ బుర్ర వెంకటేశం, ఎండీసీఆర్‌ఎల్‌ ఎండీ నర్సింహారెడ్డి, టీజీటీడీసీ ఎండీ క్రాంతి వల్లూరు, తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *