సౌర విద్యుత్ వినియోగానికి బహుముఖ వ్యూహం

– ‘పీఎం కుసుమ్’పై  గ‌త స‌ర్కారు నిర్ల‌క్ష్యం
– రైతుల వాటా భరిస్తాం.. నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరాం
– గ్రీన్ పవర్ ఉత్పత్తిని ప్రాధాన్యతగా తీసుకున్నాం
– డిప్యూటీ సీఎం భ‌ట్టి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 5ః రాష్ట్రంలో సౌర విద్యుత్ వినియోగాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహంతో ముందుకు సాగుతోందని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు. వ్యవసాయ రంగంతోపాటు, ఇటు గృహ అవసరాలకు గ్రీన్ ఎనర్జీని అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. ​కేంద్ర ప్రభుత్వం పదేళ్ల క్రితమే పీఎం కుసుమ్ ప‌థ‌కాన్ని ప్రారంభించినప్పటికీ గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రతిపాదనలు పంపకపోవడంతో రాష్ట్రంలో ప‌థ‌కం అమలు కాలేదని వివరించారు. గతంలో ప్రకటించాం.. మీ రాష్ట్రం వినియోగించుకోలేదు..  ప్రస్తుతం నిధులు లేవని కేంద్ర ప్రభుత్వం అంటున్న‌ద‌ని తెలిపారు. ఈ పథకం కింద గరిష్టంగా కనెక్షన్లు సాధించేందుకు కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిని స్వయంగా కలిసి ఈ పథకాన్ని రాష్ట్రానికి కేటాయించాలని కోరామని డిప్యూటీ సీఎం వివరించారు. ఇతర రాష్ట్రాల్లో మిగిలిపోయిన కోటాను కూడా మ‌న‌కే కేటాయించాలని విజ్ఞప్తి చేశామన్నారు.

రాష్ట్రంలో ఉచిత విద్యుత్తు అమలు చేస్తున్నందున రైతులు, గృహ వినియోగదారులను ప్రోత్సహించేందుకు నిబంధనలు మార్చాలని కేంద్రాన్ని కోరినట్టు ఆయ‌న తెలిపారు. ​మరోవైపు వ్యవసాయ రంగంలోనూ సోలార్ విప్లవం కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. మ‌హిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యులు గ్రూపులుగా ఏర్పడి సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకునేందుకు, అలాగే రైతుల భూములను లీజుకు తీసుకుని ప్రాజెక్టులు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింద‌న్నారు. అయితే వ్యవసాయం చేసుకునే రైతులకే పీఎం కుసుం వర్తింపజేస్తామ‌ని, లీజు రైతులకు వర్తింపజేయలేమని కేంద్రం స్పష్టం చేసింద‌ని తెలిపారు. వీరికి ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు కేంద్రం నిరాకరించడం కొంత అడ్డంకిగా మారిందన్నారు. గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యం అయినప్పుడు, రైతులకే ఆదాయం వెళుతున్నప్పుడు లీజు నిబంధనను సవరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్టు డిప్యూటీ సీఎం వివరించారు. రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.. పీఎం కుసుం కింద కనెక్షన్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. ఇప్పటికే రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందుతుండటంతో వ్యవసాయ కనెక్షన్లకు సోలార్ ఏర్పాటు చేసుకునేందుకు రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని, వారిని చైతన్య పరిచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని వివరించారు.

జయ జయహేతో ప్రజలను ఏకం చేసిన‌ప అందెశ్రీ

జ‌య‌ జయహే తెలంగాణ గీతం ద్వారా రాష్ట్ర ప్రజలను ఏకం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన అందెశ్రీ సేవలను ప్రభుత్వం గుర్తించిందని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. అందెశ్రీగా పిలిచే అందే ఎల్లయ్య సిద్దిపేట జిల్లా రేపర్తిలో జ‌న్మించార‌ని, అనాధ‌ అయిన ఆయ‌న పశువుల కాపరిగా ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకొని గీత రచయితగా ఎదిగారని, ఎలాంటి విద్య లేకున్నా గ్రామీణ, అణ‌గారిన వర్గాలను ప్రతిబింబించేలా ఆయన మూడు వేల కవితలు రచించారని వివ‌రించారు. రాష్ట్ర ప్రజల ఆశలు, పోరాటాలు ,వాటి స్ఫూర్తిని తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన రచించిన జయ జయ హే తెలంగాణ గీతం రాష్ట్ర ప్రజలను ఏకం చేయడంలో ప్రముఖ పాత్ర వహించిందని తెలిపారు. అందెశ్రీ రచించిన జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా చేయాలని 2024 జూన్ 2న 783 జీవో ద్వారా కేబినెట్ ఆమోదించిందని తెలిపారు. ఈ చర్య తెలంగాణ ఐక్యత, పురోగతికి తన జీవితాన్ని అంకితం చేసి సాంస్కృతికి ప్రతీకగా నిలిచిన అందెశ్రీని గుర్తించి గౌరవిస్తుంద‌ని ప్రభుత్వం హామీ ఇస్తున్న‌దని తెలిపారు. వారి అమూల్యమైన సేవలను దృష్టిలో పెట్టుకొని ఆ కుటుంబాన్ని ఆదుకోవడం బాధ్యతగా భావించి వారి కుమారుడు దత్త సాయికి ఉన్నత విద్యా శాఖలో డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియమించినట్టు తెలిపారు. ఈ నిర్ణయం సామాజిక న్యాయ సూత్రాలు, పరిపాలన సంబంధమైన ప్రమాణాలకనుగుణంగా ఉందని వివరించారు. మానవత్వంతో ఈ ప్రభుత్వం అందెశ్రీ కుటుంబాన్ని ఆదుకుంద‌ని తెలిపారు. దీనిపై జారీ చేసిన ఆర్డినెన్సుకు సంబంధించిన బిల్లును ఈ రోజు శాస‌న‌మండ‌లిలో ఏకగ్రీవంగా ఆమోదించ‌డం హర్షణీయమ‌ని భ‌ట్టి అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *