– ప్రభుత్వ భవనాలపై ప్లాంట్లు నెలకొల్పాలి
– ఆర్‌ఓఎఫ్‌ఆర్ భూముల్లో సోలార్ పంపుసెట్లు
– వీసీలో కలెక్టర్లతో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 9 : గ్రామ పంచాయతీ(Gram Panchayat) భవనం మొదలు సెక్రటేరియట్ (secretariat) వరకు అన్ని భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్లు (solar power plants) ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి (Bhatti) విక్రమార్క కలెక్టర్లను ఆదేశించారు. సోలార్ విద్యుత్‌ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కేబినెట్ విధాన నిర్ణయం తీసుకున్నదన్నారు. ప్రభుత్వ భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు, ఆర్‌ఓఎఫ్‌ఆర్ భూముల్లో ఇందిరా సౌర గిరిజన వికాసం పథకం అమలుపై సచివాలయం నుంచి వీడియా కాన్ఫరెన్సు ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, పార్కింగ్, క్యాంటీన్ ప్లాన్లు హైదరాబాద్‌కు పంపాలని డిప్యూటీ సీఎం సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లు అన్నీ కూడా ఒకే నమూనాలో నిర్మించినందున సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన డిజైన్లు హైదరాబాదు నుంచి పంపిస్తామని తెలిపారు. కలెక్టర్ కార్యాలయాల్లో మంచి డిజైన్లు ఉంటే ఆయా కలెక్టర్లు హైదరాబాద్‌కు పంపవచ్చని సూచించారు. గ్రామ పంచాయతీ భవనం మొదలుకొని సెక్రటేరియట్ వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. వీటి ఏర్పాటుకు అవసరమైన వివరాలకు సంబంధించి ఒక ప్రశ్నావళిని పంపిస్తున్నామని, అందులో అన్ని వివరాలు నమోదు చేసి వారం లోపు విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయానికి పంపాలని భట్టి దేశించారు. ప్రభుత్వ భవనాలతోపాటు ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థల భవనాలపై కూడా సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, అందుకు సంబంధించిన భవనాల వివరాలు పంపాలని కలెక్టర్లను ఆదేశించారు. నీటిపారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖ పరిధిలో పెద్ద ఎత్తున ఖాళీ స్థలాలు ఉన్నాయని, వాటి వివరాలు సైతం పంపాలని కలెక్టర్లకు సూచించారు.
ఆర్‌ఓఎఫ్‌ఆర్ భూముల్లో సోలార్ పంపుసెట్లు(solar pumpsets)
ఏజెన్సీ ప్రాంతాల్లో ఆర్‌ఓఎఫ్‌ఆర్ చట్టం కింద 6.70 లక్షల ఎకరాల భూములను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసిందని, ఈ భూముల్లో నల్లమల డిక్లరేషన్ కింద ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం ద్వారా ఉచితంగా సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేయనున్నట్టు డిప్యూటీ సీఎం కలెక్టర్లకు వివరించారు. నల్లమల డిక్లరేషన్‌లో భాగంగా ఇప్పటికే అచ్చంపేట నియోజకవర్గంలో ప్రారంభించామని, ఈ నెలలోనే ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. గిరిజల వికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని, కలెక్టర్లు అలసత్వం ప్రదర్శించకుండా వారంలోగా వివరాలు పంపాలని, ఈ విషయాల్లో ఎలాంటి సందేహాలు ఉన్నా విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎస్సీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్ సీఎండీలు, రెడ్కో వీసీ అండ్ ఎండీని సంప్రదించాలని డిప్యూటీ సీఎం కలెక్టర్లను ఆదేశించారు.





ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే