– ప్రతి ఇల్లు సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కావాలి
– 81 గ్రామాల్లో రూ.1,380 కోట్లతో ఉచిత సోలార్ విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటు
– ప్రతి ఇంటికి సంవత్సరానికి రూ.14వేల ఆదాయం
– రావినూతలలో సోలార్ మోడల్ విలేజ్ ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి

బోనకల్లు, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 19ః ప్రతీ ఇల్లు, వ్యవసాయ పంపు సెట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మారాలని ప్రభుత్వం చేపట్టిన సోలార్ మోడల్ విలేజ్ కార్యక్రమం దేశంలోనే కాదు ప్రపంచంలో ఓ విప్లవాత్మక కార్యక్రమమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బోనకల్లు మండలం రావినూతలలో సోలార్ మోడల్ విలేజ్ కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ఉత్పత్తి చేసిన సోలార్ విద్యుత్తును గృహ వినియోగదారులు, వ్యవసాయదారులు వాడుకోగా మిగిలినది విద్యుత్ శాఖకు అమ్ముకునేలా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి ఖర్చులు భరిస్తూ ఏర్పాటు చేసిన సోలార్ మోడల్ విలేజ్ కార్యక్రమం ఓ ప్రత్యేకమైనదని డిప్యూటీ సీఎం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 81 గ్రామాల్లో ఈ పైలెట్ ప్రాజెక్టు చేపట్టామని, కొడంగల్, బోనకల్ మండలాల్లో పూర్తిగా, రాష్ట్రంలో మిగిలిన కొన్ని గ్రామాల్లో చేపట్టినట్టు తెలిపారు. ఇళ్ల కప్పులపై మాత్రమే కాక వ్యవసాయ పంపుసెట్ల పైన సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 81 గ్రామాల్లో రూ.1,380 కోట్లు ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం వెచ్చిస్తుందని తెలిపారు. బోనకల్లు మండలంలో 22 గ్రామాలకు రూ.306 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. బోనకల్లు మండలం రావినూతలలో రూ.24 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. సంవత్సరం మొత్తంమీద సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఒక కుటుంబ రూ.14 వేల వరకు ఆదా చేసుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. వాడుకోగా సంవత్సరం మొత్తంగా కనీసంగా 1086 యూనిట్ లను యూనిట్ కు రూ.2.57 చొప్పున విద్యుత్ సంస్థలకు విక్రయిస్తే సంవత్సరంలో ఒక కుటుంబానికి కనీసంగా రూ.4 నుంచి రూ.5 వేలు మిగులుతుందని వివరించారు. ఆ డబ్బును పిల్లల చదువులు, కుటుంబ వైద్య అవసరాల కోసం వినియోగించుకుని కుటుంబాలు ఆర్థికంగా బలపడేందుకు మహిళలు కృషి చేయాలని సూచించారు. ఇప్పటివరకు మనం విద్యుత్ సంస్థలకు డబ్బులు చెల్లించాం.. కానీ ఇకనుంచి విద్యుత్ సంస్థలే ప్రజలకు డబ్బులు చెల్లించేలా ప్రభుత్వం సోలార్ విద్యుత్ ప్రణాళికలు రూపొందించిందని డిప్యూటీ సీఎం వివరించారు.

రైతులు కూడా ఆదాయం స‌మ‌కూర్చుకోవ‌చ్చు

సోలార్ విద్యుత్ సంవత్సరం మొత్తం ఉత్పత్తి అవుతుంది.. వ్యవసాయ పనులు సంవత్సరంలో ఏడు నెలలు మాత్రమే ఉంటాయి.. కాల్వ‌ల ద్వారా నీటి సౌకర్యం ఉంటుంది. ఈ సమయాల్లో ఉత్పత్తి అయిన విద్యుత్ ను విద్యుత్ సంస్థలకు విక్రయించి రైతులు ఆదాయం ఆర్జించే అవ‌కాశం ఉంటుందని తెలిపారు. రైతులు పంటల ఉత్పత్తితోపాటు సోలార్ విద్యుత్తు ఉత్పత్తి ద్వారా డబ్బులు సంపాదించాలనేదే ప్రభుత్వ ఆలోచన అని  తెలిపారు. రైతులు పొలంలో ఒక సోలార్ షెడ్డు వేసుకుంటే విద్యుత్ ఉత్పత్తితోపాటు ఆ షెడ్డులో విశ్రాంతి తీసుకోవచ్చు, గేదెలను కట్టేయవచ్చు, పనిముట్లు దాచుకోవచ్చని తెలిపారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలపైన సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం సోలార్ విద్యుదుత్పత్తిని రాష్ట్రంలో పెద్దఎత్తున ప్రోత్సహిస్తుందని తెలిపారు. వరి కోతలయ్యాక మిగిలిన వ్యర్ధాలకు రైతులు నిప్పు పెడుతున్నారు.. ఇది ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం.. ఈ తరహా చర్యలు రైతులు చేపట్టవద్దని డిప్యూటీ సీఎం కోరారు. అంత‌కుముందు రావినూతలలో ఓ ఇంట్లో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్తు ప్లాంటు పనితీరును విద్యుత్ శాఖ, రెడ్కో అధికారులతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి పరిశీలించారు. కార్యక్రమంలో ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, రెడ్కో ఎండి అనీలా, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తదితరులు పాల్గొన్నారు.

 ——————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.