అక్షర తపస్వి.. సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి ఫూలే

– రేపు 195వ జ‌యంతి

 సావిత్రిబాయి సంఘ సంస్కర్తగానే గాదు, రచయిత్రిగా కూడా వేగుచుక్కగా నిలిచారు. 1854లోనే ఆమె తన కవితా సంపుటి ‘కావ్య పూలే’ను ప్రచురించింది. మరో కవితా సంపుటి ‘పావన కాశీ సుబోధ్ రత్నా కర్’ను 1891లో ప్రచురించింది. ఆమె ఉపన్యాసాల్లో కొన్ని 1892లో పుస్తక రూపంలో వచ్చాయి.

భారతీయ సంఘ సంస్కర్త, సామాజిక విప్లవకారిణి, ఆధునిక భారత దేశ తొలి మహిళా ఉపాధ్యాయిని, రచయిత్రి, నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన సావిత్రిబాయి ఫూలే 195 వ జయంతి ఉత్సవాలను ఈరోజు దేశమంతా జరుపుకుంటున్నాం. సావిత్రిబాయి ఫూలే మహారాష్ట్ర సతారా జిల్లాలో నయాగావ్ అనే గ్రామంలో, లక్ష్మీ బాయి, ఖండోజీ నవ్సే పాటిల్ దంపతులకు 1831 జనవరి 3న ఒక రైతు కుటుంబంలో జన్మించింది. సావిత్రి బాయి కుటుంబానికి తెలంగాణ ప్రాంతంతో బంధుత్వం ఉంది. వీరి బంధువులు నిజామాబాద్ జిల్లా లో బోధన్, నాందేడ్ కొండల్ వాడి ప్రాంతంలో, ఆదిలాబాద్ చుట్టుపక్కల ఉన్నారు. బోధన్ ప్రాంతపు మున్నూరుకాపులు వీరికి చుట్టాలు. ఆమె తన 9వ యేట 12 యేండ్ల జ్యోతిరావు ఫూలేను 1840లో వివాహమాడింది. నిరక్షరాస్యురాలిగా ఉన్న ఆమెకు భర్త జ్యోతిరావు ఫూలే మొదటి గురువు. జ్యోతీరావు ఫూలె ప్రోత్సాహంతోనే ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి,చదువు నేర్చుకొని విద్యావంతురాలైంది. అహ్మద్ నగర్ లో ఉపాధ్యాయ శిక్షణ పొంది, 1848 లో భర్త జ్యోతిరావుతో కలిసి క్రింది కులాల బాలికల కోసం పూణేలో మొదటి పాఠశాలను ప్రారంభించింది. కుల, మత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణీ. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె, తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది. ఈ పాఠశాల నడపటం ఉన్నత, అగ్రవర్ణాలకు నచ్చలేదు. దీంతో ఆమెపై వేధింపులకు, భౌతికదాడులకు పూనుకున్నారు. పాఠశాలకు నడిచి వచ్చే దారిలో ఆమెపై బురద చల్లడం, రాళ్లు విసరడం, అసభ్య పదజాలాన్ని వాడటం వంటివి చేశారు. బురదతో మలినమైన చీరను పాఠశాలకు వెళ్లిన తరువాత మార్చుకుని, మరలా వచ్చేటప్పుడు బురద చీరను కట్టుకుని వచ్చేది. ఎవరైనా అడిగినప్పుడు ధైర్యంగా “నా విధిని నేను నిర్వహిస్తున్నాను” అని చెప్పేది. అయినా రోజూ వేధింపులకు విసిగి ఓపిక నశించి ఒకరోజు ఒకడి చెంప పగులకొట్టింది. పట్టు వీడక వారు సాగించిన విద్యా ఉద్యమానికి తక్కువ కాలంలోనే సహకారం, గుర్తింపు లభించాయి. ఒక ముస్లిం వ్యక్తి తన ఇంటిని బడికి కేటాయించాడు. కొంత మంది పుస్తకాలు సేకరించారు. మోరోవిఠల్, వాల్వేకర్, దియోరావ్,కేశవరావు భవాల్కర్ వంటి ప్రముఖులు పాఠశాల నిర్వహణకు సహకరించారు. 1851లో మరల పాఠశాల ప్రారంభించారు. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా,  శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసింది. సమాజంలోని కులతత్వం, పురుషాధిక్య ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ కూడా ఆమె కేవలం జ్యోతిరావు ఫూలే భార్యగా మాత్రమే తెలుసు. కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి. బాలికల చదువు కోసం, విద్యాభివృద్ధి కోసంసహకరించాలని ఆమె విజ్ఞప్తి చేసింది. ఉపాధ్యాయురాలిగా
అట్టడుగు వర్గాలు, మహిళలకు చదువు, సంపద వంటి సమస్త హక్కులు నిరాకరింపబడిన దేశంలో, ఆనాటి సమాజపు కట్టుబాట్లను, బ్రాహ్మణవాద సంప్రదాయాలను, ఆధిపత్య వర్గాలను ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా పాఠశాలలు ప్రారంభించి, 1848 మే 12 న దేశంలో బహుజనులకు మొట్టమొదటి పాఠశాల ప్రారంభించారు. సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మడమ తిప్పని ధీశాలి ఆమె. కేవలం 4 సంవత్సరాలలోనే గ్రామీణ ప్రాంతాల్లో 20 పాఠశాలలను ప్రారంభించి, ఉచిత విద్యనందించారు. దళితుల, స్త్రీల విద్యావ్యాప్తికి కృషి ప్రారంభించే నాటికి ఆమె వయస్సు 18 ఏళ్ళు మాత్రమే. వారి జీవితకాలంలో మొత్తం 52 పాఠశాలలు ప్రారంభించారు. అయితే ఈ క్రమంలో ఆమె ఆధిపత్య కులాల వారి నుంచి అనేక దాడులను, అవమానాలను ఎదుర్కొంది. ఈ నేపథ్యంలోనే 1849లో జ్యోతిరావు ఫూలే, సావిత్రీబాయి ఫూలే దంపతులను గృహ బహిష్కారానికి గురిచేశారు.

సామాజిక విప్ల‌వకారిణిగా

ఆమె మానవ హక్కుల గురించి ఇతర సామాజిక సమస్యల గురించి స్త్రీలను చైతన్యపరచడానికి 1852లో మహిళా సేవామండల్ అనే మహిళా సంఘాన్ని కూడా స్థాపించింది. లింగ సమస్యలకు తోడుగా, కుల పితృస్వామ్య వ్యవస్థల అణచివేతకు వ్యతిరేకంగా స్త్రీల సాధికారిత కోసం ఈ సంస్థ కృషిచేసింది. మహిళా హక్కులే మానవ హక్కులని తొలిసారిగా నినదించినది సావిత్రిబాయి ఫూలే. అసత్యాలతో, అగ్రవర్ణ దురహంకారపు నిచ్చెనమెట్ల కులవ్యవస్థగా నిర్మాణమైన సమాజంలో సత్యాన్ని శోధించడానికి 1873 సెప్టెంబరు 23 న తన భర్త మహత్మా జ్యోతిరావు ఫూలే తో కలసి “సత్యశోధక్ సమాజ్ “ను ప్రారంభించి బాల్యవివాహాలకు, మూఢనమ్మకాలకు, సతీసహగమనానికి వ్యతిరేకంగా, వితంతువు పునర్వివాహాల కొరకు అసమాన బ్రాహ్మణ వ్యవస్థకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమం నడిపారు. బాల్యంలోనే వైధవ్యాన్ని అనుభవించే ఎంతో మంది ఆడపిల్లలకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించారు. గర్భవతులైన వారికి పురుళ్లు పోసి వారి కళ్లల్లో వెలుగును చూసారు. ఆ దంపతులకు స్వంత పిల్లలు లేరు. కానీ ఆ జంట యశ్వంతరావు వితంతువు కుమారుడు (బ్రాహ్మణ వితంతువు కుమారుడు) ను దత్తత తీసుకున్నారు. ఓ వితంతువు గర్బిణీ మహిళ ఆత్మహత్య చేసుకోబోతుంటే ఆమెను వారించి, ఆమె పురుడు పోసుకున్న తర్వాత బిడ్డను వదిలేసి పోయిన తర్వాత ఆ బిడ్డను వీరు అక్కున చేర్చుకున్నారు. యశ్వంత్ గా నామకరణం చేసి తమ ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా పెంచి పెద్ద చేసారు.వితంతువులకు శిరోముండనం చేయడాన్ని తీవ్రంగా ఖండించి, క్షురకులను చైతన్యపర్చి, వితంతువులకు శిరోముండనం చేయబోమంటూ క్షురకుల చేత 1860లో సమ్మె చేయించారు సావిత్రీబాయి. 1873 సెప్టెంబరు 24న “సత్యశోధక్ సమాజ్” అనే సామాజిక, ఆధ్యాత్మిక సంస్థను ప్రారంభించి, సత్యశోధన కోసం ఉద్యమాన్ని నడిపారు ఫూలే. ఈ సత్యశోధక్ సమాజ్ మహిళా విభాగం సావిత్రీబాయి నేతృత్వంలో నడిచేది. వివాహాలు వంటి శుభ కార్యాలను పురోహితులు లేకుండా బహుజనులు నిర్వహించే విధానాన్ని ఈ సంస్థ ప్రారంభించింది. 1873 డిసెంబరు 25 న భార్యను కోల్పోయిన ఒక యువకునికి తన స్నేహితురాలి కుమార్తెతో సత్యశోధక్ సమాజ్ ఆధ్వర్యాన సావిత్రీబాయి మొదటి వివాహాన్ని జరిపించారు. 1868 నుంచి సావిత్రీబాయి అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు. 1870లో ఒకసారి, 1896లో మరోసారి దేశంలో తీవ్ర దుర్భిక్షం ఏర్పడినప్పుడు ఫూలే దంపతులు చేసిన కృషి అనన్య సామాన్యం. కరువు వాతపడిన కుటుంబాలలోని అనాథ బాలలను దాదాపు 2,000 మందిని అక్కున చేర్చుకున్నారు. తమ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభించారు.

భర్త మరణం 

జ్యోతీరావుపూలే 1890 నవంబరు 28 న మరణించడంతో సావిత్రీబాయి అంతులేని దుఃఖ సాగరంలో మునిగింది. ఈ దుఃఖంలో నుంచే మరో ఆదర్శానికి శ్రీకారం చుట్టారు. తన భర్త ఫూలే చితికి తానే స్వయంగా నిప్పు పెట్టి కొత్త సంప్రదాయానికి తెరలేపారు. భారతదేశ చరిత్రలో భర్త చితికి భార్య నిప్పు పెట్టిన తొలి సంఘటన ఇది. ఫూలే మరణాంతరం సత్యశోధక్ సమాజ్ బాధ్యతనీ స్వీకరించి నడిపించింది. 1897 లో ప్లేగు వ్యాధి, పూణే నగరాన్ని వణికించింది. నగరమంతా ఎడారిగా మారింది. జనమంతా దగ్గర్లోని అడవుల్లోకి పారిపోయారు. అయినా సావిత్రీబాయి ఫూలే కొడుకు యశ్వంత్ తో కలిసి వ్యాధిగ్రస్తులకు సేవ చేసారు.

  మరణం 

1896-97లో సంభవించిన తీవ్ర కరువు, ప్లేగు వ్యాధి మహారాష్ట్ర జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ఈ పరిస్థితుల్లో కరువు ప్రాంతాల్లోని దళితులు, పేదల కోసం జోలెపట్టి విరాళాలు సేకరించి అందించారు. ప్లేగు వ్యాధి సోకిన పేదలకు దగ్గరుండి సేవలందించారు. 1897 లో ప్లేగు వ్యాధి బారిన పడిన పిల్లల కోసం వైద్య శిబిరాలు నిర్వహించింది. దుర్భరమైన కరువు పరిస్థితుల్లో కూడా రోజుకు 2 వేల మంది పిల్లలకు భోజనాలు పెట్టించింది. ప్లేగు వ్యాధి సోకిన మాంగ్ లాంటి దళిత కులాలకి చెందిన దళిత చిన్నపిల్లలని తన చంకన వేసుకొని చికిత్స చేసి కాపాడింది. చివరికి ఆ ప్లేగు వ్యాధే ఆమెకి సోకి మార్చి 10, 1897 లో మరణించింది. ఆమె దత్తపుత్రుడు యశ్వంత్ అంత్యక్రియలు జరిపించాడు. సావిత్రి బాయి ఫూలే జయంతిని భారతదేశ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా అధికారికంగా గుర్తించి జరుపుకోవాలి. 1997లో భారత ప్రభుత్వం సావిత్రిబాయి జ్ఞాపకార్థం తపాలా బిళ్ళను విడుదల చేసింది. పూణే విశ్వవిద్యాలయానికి సావిత్రిబాయి పేరు పెట్టారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సావిత్రి బాయి ఫూలే 195 వ జయంతి ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్టేట్ ఫెస్టివల్ అని అధికారికంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో నిర్వహించాలని ప్రభుత్వము ఉత్తర్వులు విడుదల చేయడం హర్షించదగిన పరిణామం. ఆధునిక భారత దేశంలో అగ్ర వర్ణ,మనువాద బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకంగా చైతన్య వంతంగా పోరాడి, సమాజాన్ని చైతన్య వంతం చేసిన సామాజిక విప్లవకారిణి ,ఆధునిక భారత దేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు అయిన సావిత్రి బాయి ఫూలే సేవలకు భారతజాతి ఋణ పడి ఉన్నది. దేశంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికి ,మహిళలు, బాలికలపై అత్యాచారాలు నిత్యం పెరిగిపోతున్నాయి.
అత్యాచారాల నివారణకు చర్యలు, దళితులు, గిరిజనులు , మైనారిటీ ,బహుజన మహిళలు, పిల్లలకు భద్రత కల్పించినప్పుడు, మహిళా సాధికారత జరిగినప్పుడు మాత్రమే దేశం పురోగతి సాధిస్తుంది. అప్పుడే సావిత్రి బాయి ఫూలే లక్ష్యాలు నెరవేరుతాయి. భారత దేశం సావిత్రి బాయి ఫూలే జన్మదిన వేడుకలను భారత మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటుంది. సావిత్రి బాయి ఫూలే ఆధునిక భారత దేశంలో దృవతారగా వెలుగొందుతున్నది.

– కందుకూరి దేవదాసు
– రిటైర్డ్ టీచర్ హనుమకొండ  
–  సెల్ నెంబర్. 9949937745 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *