(గత వారం తరువాయి భాగం)
సోషల్ మీడియా సాహిత్య విమర్శ మీరు గమనించినమేరకి ఎలా ఉంది?
ప్రాధమికంగా ‘సోషలైజింగ్’ అంటేనే నలుగురితో కలసిమెలసి, అందర్నీ కలుపుకుపోగలగడం అయినప్పుడు, సోషల్ మీడియాలో ‘విమర్శ’ అనే పదం విరోధాభాసలా ధ్వనిస్తోంది. సోషల్ మీడియాలో సాహిత్య విమర్శ లేదు, ఉండదు. ఇక్కడ లెక్కలన్నీ ‘అల్గారిథమ్స్’ నడిపిస్తే నడిచేవే తప్ప రచనల్లో నాణ్యత, సాహితీకారుల్లో టాలెంట్ ఇవన్నీ ఇక్కడ పాపులారిటీ లేదా మెజారిటీ లైకుల్ని బట్టి లెక్కగట్టడమంత అమాయకత్వం మరొకటి లేదు. ‘ఇమేజ్’ ప్రధానంగా నడిచే ఈ సోషల్ మీడియా సర్కస్లో మన ‘ఇమేజ్’ ఎంత మంచిదైతే రచనకు అంత ఆదరణ దక్కుతుంది. మన మంచితనాన్ని జనం ఎంత నమ్మితే అంత పేరు, పలుకుబడి. కానీ “మంచి మనిషి” అయినంత మాత్రాన మంచి రచయిత కావల్సిన అవసరంలేదన్న సంగతి చాలామంది గ్రహించరు.
స్నేహాలమాటున మొహమాటాలకుపోయి విమర్శ, సమీక్షల పేరిట మీడియోకర్ రచనల్ని ఆకాశానికెత్తుతారు. బొత్తిగా తర్కాన్ని, హేతువునూ వదిలేసి భావోద్వేగాలమీద ఆధారపడి ప్రవర్తించే సగటు సోషల్ మీడియా యూజర్ ప్రజాస్వామ్యంలో ‘ఓటరు’తో సమానం. సోషల్ మీడియాలో పాఠకులకు/ విమర్శకులకు మరచిపోకుండా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలి, వారి ఇజాలను సమర్ధించాలి, బాధకలిగితే వర్చువల్ గా భుజం అందించి “ఎమోషనల్ నీడ్స్” తీర్చాలి. ఇవన్నీ చేస్తే వారి ఆమోదముద్రలు మన ఓటుబ్యాంకులో చేరతాయి. నెట్వర్క్ పెరుగుతుంది. ఈరోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది.
సోషల్ మీడియా విమర్శకు(?) భాషా వ్యాకరణ నియమాలు, సాహిత్యంలో అనుభవం- ఇవేమీ అవసరంలేదు. ఇక్కడ తెలియాల్సింది నెట్వర్కింగ్, మేనేజ్మెంట్ మెళకువలు మాత్రమే. సరళంగా చెప్పాలంటే సాహిత్యం కంటే సోషల్ మీడియాలో కాలక్షేపం కబుర్లు చెప్పడమే ఎక్కువ చెల్లుబాటవుతుంది. మీరు గమనిస్తే పది పదిహేనువేలనుండి, ముప్పైనలభై వేలమంది ఫోలోవర్లు ఉన్న అకౌంట్స్ పోస్ట్ చేసే కంటెంట్, వాటికి వరదలా వచ్చే స్పందనలు చూడండి. ఇంటలెక్చువల్ పోస్టులకు ఇరవై లైకులొస్తే, ఇంట్లో సంగతులు, ఇరుగుపొరుగు విషయాలూ పూసగుచ్చినట్లు రాస్తే లేదా ప్రొఫైల్ ఫోటోలు పోస్ట్ చేస్తే రెండువందల లైకులొస్తాయి. “గుర్రం నాడా దొరికింది కాబట్టి, గుర్రాన్ని కొందామని వెళ్ళిన” తీరుగా ఇక్కడ పాపులారిటీ, ఫాలోవర్లు- ఈ రెండూ ఎంత ఎక్కువుంటే వాళ్ళు అంత త్వరగా “ప్రఖ్యాత సాహితీ విమర్శకులై” కూర్చుంటున్నారు. అటు సమీక్ష, ఇటు విమర్శ- ఈ రెండూ కానివాళ్ళ సోషల్ మీడియా పోస్టులకు వందలు, వేలకొద్దీ వచ్చే ఆమోదముద్రల్ని చూసి, చదవక ముందే అదేదో గొప్ప రచనని మరికొంతమంది గుడ్డిగా ప్రచారాలు చేస్తారు. తమ రచనలు నలుగురికి చేరాలంటే ‘నెట్వర్క్’ అవసరమని గ్రహించిన సింహభాగం సాహితీ ప్రపంచపు జీవులు కూడా మరోదారిలేక “ఆర్టిస్టిక్ ఇంటెగ్రిటీ”కి తిలోదకాలిచ్చేసి పొగడ్తలతోనూ, షేక్ హ్యాండ్లతోనూ, అనువైన కోటరీలలో కుదురుకుని, స్నేహాల మాటున సాహితీ ప్రయాణానికి సిద్ధపడుతున్నారు.
“విమర్శ”కు కచ్చితమైన నిర్వచనం చెప్పలేనేమో గానీ, 17 ఏళ్ళ బ్లాగింగ్ అనుభవంతో ఇది ఒక రచన విలువను కొలవడానికి సరైన పద్ధతి కాదని మాత్రం ఘంటాపధంగా చెప్పగలను. సోషల్ మీడియాలో జరిగేది పుస్తకాల అమ్మకాలు, కొనుగోళ్ళు, పక్కా మార్కెటింగ్ మాత్రమే, ‘సాహితీ విమర్శ’ కాదు. ఇది గ్రహించకపోతే మంచి సాహిత్యం చదువుదామనుకునే ఆసక్తి, పఠనాభిరుచి కలిగిన పాఠకులం మనకు తెలీకుండానే “క్యాపిటలిస్ట్ కమోడిటీలు”గా మారిపోయి ఫ్రీగా అడ్వర్టైజింగ్ మోడల్స్ గా మిగిలిపోతాం. నిజానికి సోషల్ మీడియాని భూతద్దంలో చూపించి, బూచిని చేసే ఉద్దేశ్యం నాకు లేదు. పుస్తకాలపై ప్రేమ, అక్షరాలంటే గౌరవం ఇప్పటికీ ఉన్న సగటు పాఠకురాలిగా సోషల్ మీడియాలో “సాహితీ విమర్శ” అనే బ్రహ్మపదార్థమంటూ ఒకటుంటే, అది ఇప్పుడు జరుగుతున్నది కాదని చెప్పడమే నా ఉద్దేశ్యం. సద్విమర్శకు ఇది అనువైన వేదిక ఎప్పటికీ కాదు.
కానీ ఈ విషయంలో నాణానికి మరోవైపుని మనం విస్మరించలేం. ఒకప్పుడు రచయితలు అరుదుగా ఉండేవారు కాబట్టి పుస్తకాలు కూడా తక్కువే ప్రచురించబడేవి. ఇప్పుడు ప్రచురణ సులభమైంది, వేలకొద్దీ పుస్తకాలు ముద్రణకు వెళ్తున్నాయి. ఈరోజుల్లో రచయితకు తన పుస్తకం పాఠకుణ్ణి చేరాలంటే ఎంతోకొంత సోషల్ నెట్వర్క్ ఉండడం తప్పనిసరిగా మారిపోయింది. “అమెజాన్లో పెడితే ఎవరో ఒకరు కొంటారు” అని కూడా అనుకోలేం. “ఫలానా కొత్తపుస్తకం ఉంది” అని తెలియడానికైనా రచయితకు సోషల్ మీడియాలో కొంత పాపులారిటీ అవసరమవుతోంది. ముఖ్యంగా లైమ్ లైట్ కి దూరంగా ఉండే రచయితలూ, సోషల్ మీడియాలో ఆక్టివ్ గా లేనివాళ్ళకి ఇదొక సమస్యగా మారింది. చేదుగా ఉన్నా ఇది వాస్తవం. ఆ పాపులారిటీ కోసం రచయితలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, పాఠకులు, స్నేహితులతో రెండు మంచి మాటలు రాయించుకోవాలనుకోవడాన్ని తప్పుపట్టలేం.
సహజంగానే ఎక్కడైనా మెజారిటీ తమను తాము ఐడెంటిఫై చేసుకునేది రోజూవారీ సంగతులు, సినిమాలు లాంటి అతి సాధారణ అంశాలతోనే తప్ప, తార్కిక హేతువాద అంశాలతో కాదు. అందుకే ఒకప్పుడు సోషల్ మీడియాలో చర్చల్లో కనిపించే హేతువాదం, తర్కం ఇప్పుడు కనబడడం లేదు. సాహితీ చర్చలకు సోషల్ మీడియా అనువైన వేదిక కాదని చాలామంది గ్రహిస్తున్నారు. నిజానికి సాహిత్యంలో ఇంటలెక్చువల్ చర్చలు కొన్ని ఇలీట్ వర్గాలకు మాత్రమే. [ఇక్కడ ‘సాహిత్యంలో ఇలీట్’ అనే మాట కులమత, సామాజిక వర్గాలకు సంబంధించిన మాట కాదని గమనించాలి. ఇది సాహిత్యంలో ఎంతో కొంత కృషి చేసినవారని అర్థం] ఇంటర్నెట్ తొలినాళ్ళలో కొద్దిమంది చేతిలో మాత్రమే ఉండే సోషల్ మీడియా ఇప్పుడు మొబైల్ ఫోన్ సౌకర్యంతో ప్రతీ సగటు మనిషి చేతిలోనూ ఒక ‘టూల్’గా మారిపోయింది. చదువు, వివేకం, విచక్షణ ఉన్నవారు మసలే వాతావరణానికి భిన్నంగా దూషణలతో, అభ్యంతరకర పదజాలంతో, ద్వేషపూరిత వాతావరణంగా మారిపోయింది.
బ్లాగుల హవా నడుస్తున్న కాలంలో జరిగిన సాహితీచర్చలు గానీ, తులనాత్మక విమర్శ గానీ, పరస్పర గౌరవంతో కూడిన విభేదించడం గానీ ఇప్పుడు లేవు. “అనువుగాని చోట అధికులమనరాదు” అనుకున్నాయో ఏమో, అలనాటి మేథోవర్గాలన్నీ “కొండ అద్దమందు కొంచెమై ఉండదా” అన్న తీరుగా అస్త్రసన్యాసం చేసి, వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నాయి. ఇక్కడ సద్విమర్శ లేదు, ఉన్నదల్లా భజనబృందాలుగా మారిపోయి, కోటరీలు కట్టుకుని పరస్పర ముఖస్తుతులు చేసుకోవడమే. నిజానికి మారియో వర్గస్ యోసా, రోలన్ బార్త్ లాంటివాళ్ళు అభిప్రాయపడ్డట్లు సాహిత్యంలో ఇలీట్ వర్గాలు ఎప్పుడూ మైనారిటీలోనే ఉంటాయి, నిజానికి అలా ఉండడమే శ్రేయస్కరం కూడా. అంతేగానీ సోషల్ మీడియా, మేధోమథనాలు, తార్కిక, తత్వ సంబంధ విషయాలు, సాహిత్య విమర్శలవంటివాటి తులన చెయ్యడానికి సరైన, అనువైన చోటు అస్సలు కాదు. అందుకే మంచి సాహిత్యాన్ని వెతుక్కోవడానికి పాఠకుడెప్పుడూ సోషల్ మీడియా మీద ఆధారపడకూడదు. ఆ ఇరుకుగదులను దాటి బయటకు రావాలి.
(ఇంటర్వూ ముగిసింది)





