– పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాల ఉనికే ప్రశ్నార్థకం
– ఫూలే జయంతి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: సామాజిక మార్పునకు దక్షిణాది రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. రవీంద్ర భారతిలో శనివారం జరిగిన మహాత్మా జ్యోతిరావు ఫూలే 200 జయంతి కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. తొలుత ఫూలే చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. దక్షిణాది గొంతు నొక్కాలని చూస్తున్న ఈ రాజకీయ కుట్రలను బహుజనులు, ప్రజాస్వామ్యవాదులు ఏకమై తిప్పికొట్టాలన్నారు. దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో కులగణన చేపట్టి ఆదర్శంగా నిలిచామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అందించాలనే పట్టుదలతో దిల్లీ వేదికగా ధర్నా కూడా చేశామని చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం మన చట్టాన్ని ఆమోదించకుండా కాలయాపన చేస్తోందన్నారు. తెలంగాణ గడ్డపై సామాజిక న్యాయమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. సీఎం రేవంత్ నాయకత్వంలో, సామాజిక స్ప్నహతో కూడిన పాలనను అందిస్తున్నామన్నారు. ఫూలే ఆశయాలను ఊపిరిగా తీసుకుని కుల వివక్ష లేని సమాజం కోసం తాము అడుగులు వేస్తున్నామన్నారు. ఆనాడు ఆయనలాంటి మహనీయులే వివక్షకు గురైనా భవిష్యత్ తరాల కోసం వారు వేసిన పునాదులే మార్గదర్శకాలని భట్టి చెప్పారు.
సబ్బండ వర్గాల అభ్యున్నతే మా సంకల్పం : మంత్రి శ్రీధర్‌బాబు
ఒక గొప్ప మేధావి ఆలోచనలు నిత్యం సమాజాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయని, అలాంటి ఒక నిరంతర చైతన్యం అక్షరమే ఆయుధంగా సామాజిక సమానత్వమే లక్ష్యంగా పోరాడిన తత్వవేత్త మహాత్మా జ్యోతిరావు ఫూలే అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కొనియాడారు. వ్యవస్థలో పైకి కనిపించే మార్పు కంటే మనుషుల ఆలోచనా తీరు మారడమే నిజమైన సామాజిక విప్లవం అని నమ్మి ఆ దిశగా చివరి శ్వాస వరకు కృషి చేసిన ఆ మహనీయుని సేవలను స్మరించుకున్నారు. ఆయన జయంతి సందర్భంగా చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. పూలే వెలిగించిన ఆ చైతన్య దీపాన్ని కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం స్ఫూర్తిగా తీసుకుని ఆయన చూపిన బాటలో ముందుకు సాగుతోందని అన్నారు. రాష్ట్రంలోని సబ్బండ వర్గాలకు విద్య, ఆర్థిక సాధికారతను అందిస్తూ ఆలోచనల్లోనూ, అవకాశాల్లోనూ సమానత్వం తీసుకొచ్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తోందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఆ మహనీయుని ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తునానన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





