– బాల్క సుమన్‌ను విడుదల చేయాలి
– బూతులు తిట్టిన బీజేపీ నాయకులపై కేసులుండవు
– ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలపై కేసులా?
– పోస్టింగ్‌ల కోసం తొత్తులుగా వ్యవహరించొద్దు
– మాజీ మంత్రి హరీష్‌రావు
ఆదిలాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19: తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న విద్యార్థి నాయకుడు బాల్క సుమన్‌తోపాటు రాజిరెడ్డి, అనిల్ లక్ష్మీకాంత్‌లను ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిందని మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లితోపాటు ఆసిఫాబాద్‌లో జైళ్లు ఉన్నప్పటికీ వాళ్లను అక్కడ కాకుండా కక్షపూరితంగా 200 కి.మీ దూరంలో ఉన్న ఆదిలాబాద్ జైలులో పెట్టడం దుర్మార్గమన్నారు. క్యాతన్‌పల్లిలోని 22 స్థానాలకు గాను 14 స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుందని, బీఆర్ఎస్, సీపీఐ కూటమిని ప్రజలు గెలిపించారని తెలిపారు. ప్రజల తీర్పును మంత్రి వివేక్ శిరసావహించాల్సిందిపోయి ఇలా కాలరాయడం సరికాదన్నారు. కోరం ఉన్నప్పటికీ చైర్మన్ ఎన్నిక రోజు కావాలనే పోలీసు బందోబస్తు లేకుండా చేసి ఎన్నిక వాయిదా పడేలా చేశారన్నారు. అధికారులు, పోలీసుల సమక్షంలో, మంత్రి వివేక్ చూస్తుండగానే దళిత, గిరిజన, మహిళా కౌన్సిలర్లపై దౌర్జన్యంగా, నోటితో చెప్పలేని విధంగా అసభ్యంగా ప్రవర్తించారు. మహిళలపై దాడి జరుగుతున్నప్పుడు మంత్రి వివేక్ అక్కడే ఉండి కూడా కనీసం పట్టించుకోకపోవడం, కోరం ఉన్నా ఎన్నిక వాయిదా వేసి వెళ్లిపోవడం శోచనీయమని ఆయన అన్నారు. క్యాతన్‌పల్లి మహిళా కౌన్సిలర్ల తరపున రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళితే కనీసం కంప్లైంట్ తీసుకోకపోవడం దారుణమన్నారు. కౌన్సిల్‌కు మద్యం తాగి వచ్చిన కాంగ్రెస్ కౌన్సిలర్లపై ఎందుకు కేసులు నమోదు చేయలేదు.. రాజిరెడ్డి కారు ధ్వంసం చేసిన వారిపై కేసులు ఉండవు.. కానీ తమ కౌన్సిలర్లపై మాత్రం అక్రమ కేసులు పెట్టారని హరీష్‌రావు ఆరోపించారు. బాల్క సుమన్, కోవా లక్ష్మీలను ఎమ్మెల్యేలైనప్పటికీ లోపలికి పంపకుండా కేవలం మంత్రిని ఎలా పంపిస్తారని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తమపై దాడి చేశారన్నారు. అక్రమ కేసులతో అరెస్టు చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను కాంగ్రెస్ గుండాలు స్టేషన్‌కు వచ్చి మరీ కొడుతున్నారని ఆరోపించారు. ఈ రకమైన దాడులు మంచివి కావని హరీష్‌రావు హెచ్చరించారు. పోలీస్ కవాతు ప్రజలకు రక్షణ కల్పించాలి.. ప్రజల్లో విశ్వాసం నింపాలి.. కానీ జనగామ, ఇబ్రహీంపట్నం, ఆమనగల్, క్యాతన్‌పల్లిలో బీఆర్ఎస్ నాయకులను, కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురిచేయడానికే కవాతు చేశారని ఆరోపించారు.
ఇబ్రహీంపట్నం, జనగామలోనూ అడ్డుకున్నారు
ఇబ్రహీంపట్నంలో మాకు స్పష్టమైన మెజార్టీ ఉన్నా ఎన్నికను అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. జనగామలో ఓటింగ్ కోసం మా కౌన్సిలర్ చేతి పైకెత్తితే వెనుక నుండి కాంగ్రెస్ కౌన్సిలర్లు చేతులు పట్టి లాగి బెదిరించే ప్రయత్నం చేశారన్నారు. అందులో దళిత మహిళ చేయి పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించడం దుర్మార్గమన్నారు. ఒక ఎంపీ రెండోసారి తొర్రూరులో ఓటు నమోదు చేసుకొని ఓటు వేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కేవలం నాలుగే మున్సిపాలిటీలు గెలిచింది.. మేము ఇప్పుడు దాదాపు 800 మంది కౌన్సిలర్లను గెలుచుకున్నాం.. అప్పుడు మేం ఏనాడూ ఇలా చేయలేదని హరీష్‌రావు గుర్తుచేశారు. పోలీసులను అడ్డం పెట్టుకుని దొడ్డిదారిన అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్నారన్నారు. వీటిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీల మైత్రి ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ నాయకుడు, బీజేపీ ఎంపీ పోలీసులను పట్టుకుని అడ్డగోలుగా బూతులు తిట్టినా ఇప్పటివరకు వారిని అరెస్ట్ చేయలేదన్నారు. రాహుల్ గాంధీ ఈరోజు దిల్లీలో రాష్ట్ర కేబినెట్‌తో రివ్యూ చేస్తున్నారు. దేశంలో ఎక్కడికి పోయినా చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీ.. ప్రజాభిప్రాయాన్ని ఖూనీ చేస్తున్న రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? ఇదేనా రాజ్యాంగాన్ని పరిరక్షించడం అంటే అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఎందుకు స్పందించరు? రాష్ట్ర ఇన్‌చార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ ఎందుకు నోరు విప్పరు అని ఆయన నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని కోరారు. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించని అధికారులపై, క్యాతన్‌పల్లి వ్యవహారంపై గవర్నర్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. తప్పు చేసిన అధికారుల మీద, ఎన్నికల కమిషన్ మీద చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
ప్రజా తీర్పును కాలరాసినప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమాలు వస్తాయి.. పోలీసు అధికారులకు తాము చెప్పేదొకటే.. అధికారం శాశ్వతం కాదు.. అన్ని కాలాలు ఒకే తీరుగా ఉండవు. కాలం మారుతుంది.. రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది.. పోస్టింగ్‌ల కోసం నాయకుల చెప్పుచేతల్లో పనిచేయకూడదు. చట్టాన్ని అతిక్రమించి, పరిధులు దాటి బీఆర్ఎస్ నాయకుల పట్ల అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులు తీవ్ర మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని హెచ్చరించారు. అప్పుడు రేవంత్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి ఎవరూ మిమ్మల్ని కాపాడలేరన్నారు. చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టంగా వ్యవహరిస్తే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హరీష్‌రావు హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




