ఎస్‌ఎల్‌బీసీ పనుల పునరుద్దరణకు ప్రణాళికలు

– హెలీ-బోర్న్‌ సర్వేకు శ్రీకారం
– ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి
– టన్నెల్‌ నిర్మాణంలో నిపుణులైన ఇంజనీర్లతో పనులు
– భద్రతా ప్రమాణాలపై నిరంతరం పర్యవేక్షణ
– మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వెల్లడి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 3: ఎస్‌ఎల్‌బీసీ పనుల పునరుద్ధరణకు ప్రణాళికలు రూపొందించామని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వెల్లడిరచారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తిచేయాలని ప్రభుత్వం సంకల్పించినట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో సమావేశం కానున్నట్లు ఆయన తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ పునరుద్ధరణ పనుల పురోగతిపై సచివాలయంలో బుధవారం ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌ మాట్లాడుతూ నెలకు 178 మీటర్ల సొరంగం తవ్వడం లక్ష్యంగా పెట్టుకుని జనవరి 2028 నాటికి పూర్తిచేయనున్నట్లు ప్రకటించారు. మొత్తం 44 కి.మీ సొరంగ మార్గానికి గాను ఇప్పటికే 35 కి.మీ సొరంగం తవ్వడం పూర్తయిందని, మిగిలిన సొరంగ మార్గం తవ్వడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించబోతున్నట్లు ఆయన తెలిపారు. అందులో భాగంగా ప్రపంచం మొత్తంలో అత్యాధునిక సాంకేతికతో కూడిన హెలీ-బోర్న్‌ సర్వే నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. నేషనల్‌ జియోగ్రాఫికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఎన్‌జీఆర్‌ఐ) ద్వారా ఈ సర్వే నిర్వహించనున్నట్లు, తద్వారా సొరంగ మార్గం తవ్వకాల సమయంలో ప్రమాదాలను ముందుగానే పసిగట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకునే వెసులుబాటు ఇంజినీర్లకు ఉంటుందని వివరించారు. నీటిపారుదల సలహాదారుడిగా లెఫ్టినెంట్‌ జనరల్‌ హార్పల్‌ సింగ్‌ నియామకం ఈ సొరంగ మార్గం పూర్తికి దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సొరంగ మార్గం తవ్వకం సమయంలో గాలి, వెలుతురు ఆవశ్యకతతోపాటు నీటిపారుదల రంగంలో యువ ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చే ఆవశ్యకతను ఆయన వివరించారు. ఎలాంటి జాప్యం లేకుండా సత్వరమే సర్వే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రెండువైపులా మొదలుపెట్టిన సొరంగ మార్గం తవ్వకాలలో ఒక భాగం నుండి 21 కి.మీ పూర్తి కాగా మరోవైపు 14 కి.మీ పూర్తి అయిందని, మిగిలిన పని పూర్తికి మూడు షిఫ్ట్‌లలో పనిచేసే విదంగా ప్రణాళికలు రూపొందించుకుంటే నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తి అవుతాయని అన్నారు. ఆయా షిఫ్ట్‌లలో యువ ఇంజినీర్లను నియమించి రోజువారీ పురోగతిని రికార్డు చేయాలన్నారు. అందుకు యువ ఇంజినీర్లకు శిక్షణతోపాటు ప్రోత్సాహకాలు కల్పించి సొరంగ మార్గం తవ్వకాలలో అనుభవం గడిరచేలా చూడాలన్నారు. సవరించిన అంచనాల పరిధిలోనే ప్రాజెక్టును పూర్తిచేయాలని ఏజెన్సీలకు సూచించారు. సొరంగ మార్గం తవ్వకాల సమయంలో వస్తున్న నీటిని పంపింగ్‌ చేయడానికి విద్యుత్‌ బిల్లులు సంవత్సరానికి రూ.500 నుండి రూ.550 కోట్లు చెల్లిస్తున్నామన్నారు. పైగా పంపింగ్‌ కోసం వినియోగిస్తున్న మోటార్లు ఇరవయ్యేళ్లు పూర్తి కావడంతో అదనపు భారాన్ని భరిస్తూ వాటిని మార్చాల్సి వస్తున్నదన్నారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పూర్తి అయితే రోజుకు 0.3 టీఎంసీల నీటిని 90 రోజుల పాటు అందించవచ్చన్నారు. కాగా, శ్రీశైలం నుండి 824 అడుగుల నుండి ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గానికి నీరు వస్తుండగా 840 అడుగుల నుంసి పోతిరెడ్డిపాడుకు నీరు చేరుతుందని, ఎస్‌ఎల్‌బీసీ పూర్తి అయితే అనధికారికంగా ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వం పోతిరెడ్డిపాడుకు తరలించుకుపోయే అవకాశం ఉండదని స్పష్టం చేశారు ప్రాజెక్టును పూర్తి చేసే అంశంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని మంత్రి ఉత్తవమ్‌ తేల్చి చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *