15,16లలో మాంసం దుకాణాలు ఎందుకు బంద్‌ చేయాలి

-వివరణ ఇవ్వాలని జీహెచ్‌ఎంసీకి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 11 : స్వాతంత్య్ర దినోత్సవం(15వ తేదీ), శ్రీకృష్ణ జన్మాష్టమి(16వ తేదీ) సందర్భంగా మాంసం దుకాణాలు, పశు కబేళాలను మూసివేయాలని గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఆవిధమైన అధికారం జీహెచ్‌ఎంసీకి లేదని, ఎందుకు మాంసం దుకాణాలు/కబేళాలు మూసివేయాలో ఉత్తర్వుల్లో వివరించలేదంటూ న్యాయ విద్యార్థి వడ్ల శ్రీకాంత్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌ రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు. ఈ నిర్ణయానికి గల కారణాన్ని వివరించాలంటూ జీహెచ్‌ఎంసీకి నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల13కి వాయిదా వేశారు. జీహెచ్‌ఎంసీకి ఎలాంటి అధికారం లేకపోయినప్పటికీ చట్ట వ్యతిరేకంగా ఉత్తర్వులు ఇచ్చారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది విజయ్‌ గోపాల్‌ వాదించారు. జీహెచ్‌ఎంసీలోని 533 (బి) నిబంధన ద్వారా కమిషనర్‌ తీసుకున్న నిర్ణయానికి చట్టబద్ధత లేదన్నారు. నిర్ణయం వెనుక నిర్దిష్ట కారణం కూడా లేదన్నారు. పశువుల వధశాలలు, మాంసం దుకాణాలు మొదలైన వాటిని మూసివేయాలనే ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. వ్యాపారులు చట్టబద్ధంగా, శాంతియుతంగా చేసుకునే వ్యాపారాన్ని అడ్డుకునేందుకు వీల్లేదన్నారు. రాజ్యాంగంలోని 14, 19 అధికరణాల కింద పౌరులకు లభించిన హక్కులను హరించడమే అవుతుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *