– ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే ధ్యేయం
– న్యాక్ ఇన్‌స్ట్రక్టర్ స్నేహలతకు మంత్రి కోమటిరెడ్డి అభినందన
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25: నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (నాక్)ను అత్యుత్తమ స్కిల్ డెవలప్‌మెంట్ వేదికగా తీర్చిదిద్దేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, న్యాక్ వైస్ చైర్మన్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు విద్యార్థుల్లో స్కిల్ పెంపొందించాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. ఈనెల 5న టీచర్స్ డేను పురస్కరించుకొని దిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డు అందుకున్న న్యాక్ సీనియర్ ఇ న్‌స్ట్రక్టర్ స్నేహలత మంత్రి వెంకటరెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విభాగంలో ఉత్తమ టీచర్ అవార్డు అందుకున్న ఆమెను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఉద్యోగ, ఉపాధి కల్పనలో ఆమె యువతకు అందించిన సేవలను మెచ్చుకున్నారు. న్యాక్ ద్వారా నిరుద్యోగ యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా, కరీంనగర్, జగిత్యాల పట్టణాల్లో నిరుద్యోగ యువతకు సర్టిఫికెట్ కోర్సులు, ఉద్యోగావకాశాలు కల్పించే వృత్తివిద్యా కోర్సులను అందిస్తూ ఉత్తమ బోధన అందించేందుకు చేసిన కృషికి గుర్తింపుగా హన్మకొండకు చెందిన నక్క స్నేహలతకు ఈ అవార్డు దక్కిందని మంత్రి కొనియాడారు. నల్గొండలో అధునాతన హంగులతో నిర్మిస్తున్న స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ అతి త్వరలో అందుబాటులోకి రానుందని, ఉమ్మడి జిల్లా యువతలో ప్రపంచంతో పోటీపడేaవ నైపుణ్యం పెంపొందించేందుకు ఈ సెంటర్ ఉపయోగపడనుందని మంత్రి పేర్కొన్నారు. నైపుణ్యాలకు ఉత్తమ వేదికగా న్యాక్‌ను బలోపేతం చేస్తున్నామన్నారు. జాతీయ అవార్డు దక్కడంతో న్యాక్ ఫ్యాకల్టీ, సిబ్బందిలో మరింత ఉత్సాహాన్ని నింపిందన్నారు స్నేహలతను ప్రోత్సహించిన న్యాక్ డైరెక్టర్ శాంతిశ్రీని మంత్రి అభినందించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





