– అలసత్వం సహించేది లేదు
– విధుల్లో అలక్ష్యం వహించిన వార్డెన్ సస్పెన్షన్
– స్పోర్ట్స్అథారిటీ చైర్మెన్ శివసేనరెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 29: క్రీడాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తూ, విద్యార్థులకు క్రీడలు అందజేసేందుకు నూతనంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాల్లో క్రీడా పాఠశాలలు ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సూచనల మేరకు అధికారులంతా పనిచేయాలని స్పోర్ట్స్అథారిటీ చైర్మన్ శివసేనరెడ్డి సూచించారు. హకీంపేటలో ఉన్న తెలంగాణ క్రీడా పాఠశాలను ఆయన సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని తరగతి గదులను తిరిగి విద్యార్థులతో సంభాషించారు. కిచెన్ ను పరిశీలించారు. అక్కడే పిల్లలతో కలిసి భోజనం చేశారు. అనంతరం అధికారులు, కోచ్‌లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న వార్డెన్ ప్రేమలత (అవుట్ సోర్సింగ్)ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. పాఠశాలకు ఇబ్బంది కలిగిస్తున్న నర్సరీ నిర్వహణను తొలగించాలని అధికారులను ఆదేశించారు. క్రీడాకారులకు ట్రాక్ సూట్ లు పంపిణీ చేశారు. ఇటీవల జరిగిన 69వ స్కూల్ గేమ్ ఫెడరేషన్ లో ఫెన్సింగ్ లో జాతీయ పతకం సాధించిన క్రీడాకారిని అక్షర శ్రీని అయన సన్మానించారు. రాష్ట్రంలో క్రీడా పాఠశాలలకు దిక్సూచిగా ఉండాల్సిన హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో సౌకర్యాలు మెరుగుపరచడానికి కృషి చేస్తున్నామని, అందుకు తగినట్టుగా కోచ్‌లు అధికారులతోపాటు విద్యార్థినీ విద్యార్థులే కాక వారి తల్లిదండ్రులు కూడా నడుచుకోవాలని సూచించారు. హకింపేటతోపాటు రాష్ట్రంలో స్పోర్ట్స్ స్కూళ్లను, అకాడమీలను ఆకస్మికంగా సందర్శించి లోటుపాట్లు ఎదురైతే సరిదిద్దుతామని, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ స్కూల్ ప్రత్యేక అధికారి మమత, కోచ్ai, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



