– నైనీ ఒక్కటే కాదు.. అన్ని టెండర్లు రద్దు చేయాలి
– బీజేపీ-రేవంత్ మధ్య చీకటి బంధం ఉంది..
– దమ్ముంటే స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలి
– మంత్రుల మధ్య కమీషన్ల పంచాయితీ నడుస్తోంది
– ఇందులో బలిపశువులు ఐఏఎస్‌లు, జర్నలిస్టులు
– మాజీ మంత్రి, బీఆరఎస్ నేత హరీష్‌రావు ధ్వజం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 19: కాంట్రాక్టు సైట్ విజిట్ పద్దతి రాష్ట్రంలో కాదుకదా దేశంలో ఎక్కడా లేదు.. ఆఖరుకు వెస్ట్రన్ కోల్ ఫీల్డ్, కోల్ ఇండియాలో కూడా లేదు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2024లో సైట్ విజిట్ విధానం తెచ్చిందని బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు ఆరోపించారు. ఈ విధానం వచ్చాక మొదటి లబ్దిదారు రేవంత్ బావమరిది సుజన్ రెడ్డి అని, ఆయన కంపెనీ శోదా కన్‌స్ట్రక్షన్‌కె ఈ సర్టిఫికెట్ వచ్చాక మొదటి టెండర్ దక్కిందని తెలిపారు. ఈ విధానంతో సింగరేణిలో ప్లస్ 7 పర్సంటేజ్‌కు ఆరు టెండర్లు వారి అనుయాయకులకు కట్టబెట్టినట్లు ఆరోపించారు. గతంలో సింగరేణి మైనస్ 7, మైనస్ 8, మైనస్ 10, మైనస్ 20 పోతుండే. మైనస్ 10 టు మైనస్ 20 ఎక్కడైనా ఉంటుంది. రేవంత్ వచ్చాక కొత్త విధానం తేవడంతో అన్ని టెండర్లు ప్లస్ 7 నుంచి ప్లస్ 10 శాతానికి పోతున్నాయి. భట్టి విక్రమార్క నైనీ టెండర్లు మాత్రమే రద్దు చేస్తాం అన్నరు. మరి మిగతా వాటి సంగతి ఏమిటి అని ప్రశ్నించారు. సైట్ విజిట్ విధానంలో ముందే వెళ్లి సైట్ విజిట్ చేసి సింగరేణి నుంచి సర్టిఫికెట్ తెచ్చుకోవాలి. అంటే ఈ విధానంలో ఎవరు ముందుగా టెండర్ వేస్తున్నారో తెలుసుకుని వారిని బెదిరించి, భయపెట్టి తమ అనుయాలకు ప్లస్ 7 నుంచి ప్లస్ 20 శాతానికి కట్టబెట్టి కమీషన్లు కొల్లగొట్టారు.. నైనీ బ్లాక్‌లో ఇదే జరిగింది అని పేర్కొన్నారు. కోల్ ఇండియా, వెస్ట్రన్ కోల్ బ్లాక్‌లో లేని విధానం సింగరేణిలో ఎందుకు అనే దానిపై అనేక ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. రెండో కోణం ఏమిటంటే గతంలో ఇదే సింగరేణిలో బీఆర్‌ఎస్ సమయంలో టెండర్లు కాంపిటీటివ్ విధానంలో ఇస్తే వాటిని ఇపుడు రద్దు చేసి ప్లస్ 7 మీద కట్టబెట్టారన్నారు. వెంకటేష్ ఖని అనే టెండర్ బీఆర్‌ఎస్ హయాంలో మైనస్ 7 ఉంటే, ఇప్పుడు ప్లస్ 7మీద రీ టెండర్ చేసి కట్టబెట్టారన్నారు. ఎస్ఆర్‌పీ ఓసీ-2 శ్రీరాంపూర్ అనే మైనస్ 7 టెండర్ రద్దు చేసి ప్లస్ 7లో అప్పగించారు.. డీల్ సెట్ కాక ఎస్ఆర్‌పీ ఓసీ-2 విస్తరణ 2025 టెండర్ మూడుసార్లు వాయిదా వేశారని, మళ్లీ వారి అనుయాయులకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మూడో కోణం ఏమిటంటే.. సింగరేణికి డీజిల్‌ను గతంలో బల్క్‌లో ఐఓసీఎల్ నుంచి సరఫరా చేసేవారు. కానీ పర్సంటేజీల కోసం డీజిల్‌ను కూడా కాంట్రాక్టర్లకు అప్పగించారని, దీనివల్ల సింగరేణికి ఎక్కువ నష్టం జరుగుతుందని తెలిపారు. చేసిన పని మీదనే కాదు.. డీజిల్ కలుపుకొని జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది. సంస్థకు నష్టం కదా? ఇదంతా ముఖ్యమంత్రి సన్నిహితులు, సమీప బంధువు కనుసన్నల్లో జరుగుతున్నదని, ఎవరికి సర్టిఫికెట్ రావాలన్నా, టెండర్ రావాలన్నా వారి ఆదేశం లేనిదే దక్కదని స్పష్టం చేశారు. చీటికిమాటికి ‘సిట’ అంటున్నవు.. నీకు నిజాయితీ ఉంటే దమ్ముంటే సీబీఐ విచారణకు అనుమతించు.. అన్ని వివరాలు అందించేందుకు నేను సిద్దంగా ఉన్నా అని హరీష్‌రావు సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి, బీజేపీ అక్రమ సంబంధం లేకుంటే, చీకటి ఒప్పందం లేకుంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని కిషన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఇన్‌చార్జి సీఎండీని పెట్టి అడ్డగోలు వ్యవహారాలు
రెండేళ్లుగా సింగరేణికి రెగ్యులర్ సీఎండీ లేడు.. ఇన్‌చార్జిని పెట్టి అడ్డగోలు వ్యవహారాలు చేస్తున్నారని ఆరోపించారు. భట్టి విక్రమార్క.. మీరు సైట్ విజిట్ సర్టిఫికెట్ లేదు అని నైనీ రద్దు చేశారు కదా.. అన్ని టెండర్లు రద్దు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. సైట్ విజిట్ విధానాన్ని శాశ్వతంగా రద్దు చేయాలని, డీజిల్ విధానం రద్దు చేయాలని, సింగిరేణికి సీనియర్ అర్హత కలిగిన సీఎండీని నియమించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కేబినెట్ దండుపాళ్యం ముఠా అంటే నా మీద పడ్డారు.. సింగరేణి టెండర్ల విషయంలో సీఎం, భట్టి, కోమటిరెడ్డి మధ్య ఉన్నది వాటాల పంచాయితీ కాదా అని నిలదీశారు. మధ్యలో ఐఏఎస్, జర్నలిస్టులు బలి పశువులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సీఎం ఇంటి ఎదురుగా గెస్ట్ హౌజ్‌లో దక్కన్ సిమెంట్స్ యజమానికి తుపాకీ ఎక్కుపెట్టి పైసలు వసూలు చేశారని మంత్రి కుమార్తె చెప్పింది.. అది సీఎం అత్యంత సన్నిహితుడు రోహిన్ రెడ్డి అని కూడా చెప్పారన్నారు. సమ్మక్క సారక్క టెండర్లు దక్కలేదని పొంగులేటి దేవాదాయ శాఖ నుంచి ఆరఅండ్‌బీకి మార్చి టెండర్లు దక్కించుకున్నరు. హాలో గ్రాం టెండర్ల విషయంలో ముఖ్యమంత్రి, ఎక్సైజ్ మంత్రి మధ్య ఐఏఎస్ బలి అయ్యాడు. కోమటిరెడ్డిని చూసినం.. సంతకం పెట్టకముందే సినిమా జీవోలు వస్తున్నయ్యని అన్నడు. సినిమా రేట్ల విషయంలో ముఖ్యమంత్రి వర్సెస్ కోమటి రెడ్డి.. ఇన్ని పంచాయితీల మధ్య ఆరు గ్యారెంటీలు అటకెక్కినయి అని విమర్శించారు. కాంగ్రెస్ నాయకుడు సంపత్ కుమార్ రూ.8 కోట్ల కోసం తనను బెదిరించాడని కాంట్రాక్టరే స్వయంగా పోలీసు శాఖకు ఫిర్యాదు ఇచ్చిండు అని చెప్పారు. బీఆర్ఎస్ను, జర్నలిస్టులను వేధించడానికి సిట్లు వేశారన్నారు. ఖాకీ బుక్కు అందరికీ సమానం అనే డీజీపీ శివధర్ రెడ్డి.. మీ ఖాకీ బుక్కు కాకి ఎత్తుకుపోయిందా అని వ్యంగ్యంగా అన్నారు. సజ్జనార్.. జర్నలిస్టులను బెదిరించావు కదా? ఏమైంది హూంకరింపు. ఇవన్నీ కనిపించడం లేదా అని అన్నారు. కేసీఆర్ పెట్టుబడులకు స్వర్గధామంగా తెలంగాణను తయారు చేస్తే కాంగ్రెస్ రాగానే బెదిరింపులు, భూ కబ్జాలు. రేవంత్ రెడ్డికి తెల్వకుండా సెట్ ఎలా వస్తుంది. అలా వస్తే ముఖ్యమంత్రిగా నువ్వు ఫెయిల్.. సర్కార్ నడుపుతున్నరా, సర్కస్ నడుపుతున్నరా అని నిగ్గదీశారు.
బీఆర్ఎస్ గద్దె జోలికొస్తే నీ గద్దె కూలుతుంది..
బీఆర్ఎస్ జెండా గద్దె జోలికి వస్తే నీ గద్దె కూలుతుంది జాగ్రత్త అని హెచ్చరించారు. నువ్వు కూలిస్తే కూలిపోవడానికి గద్దెల్లో కాదు.. ప్రజల గుండెల్లో ఉంది.. తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ మాది. హౌలా మాటలు బంద్ చేయి.. ఆరు గ్యారెంటీల మీద దృష్టి పెట్టు అని హరీష్‌రావు హితోక్తి పలికారు. కేబినెట్ పెట్టుకున్నరు.. రైతు బంధు, ఎరువుల కొరత, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల గురించి చర్చ లేదన్నారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నావు.. రాజీవ్ గాంధీ అప్పటి ముఖ్యమంత్రి అంజయ్యని అవమానిస్తే టీడీపీ పుట్టింది.. ఎన్టీఆర్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నేషనల్ ఫ్రంట్ పెట్టారు.. తెలుగుదేశం పుట్టుకే కాంగ్రెస్‌కు వ్యతిరేకం.. కాంగ్రెస్ భూస్థాపితమే నా లక్ష్యం అని ఎన్టీఆర్ ప్రతిన బూనారు.. ఆయనపై అంత ప్రేముంటే టీడీపీలో ఉండాల్సింది అని హితవు పలికారు. కాంగ్రెస్ భూస్థాపితం అయితే ఎన్టీఆర్ ఆత్మకు శాంతి చేకూరుతుందని అన్నారు. నాలుగు ఓట్ల కోసం టీడీపీ గురించి మాట్లాడుతున్నావు.. దేశం మొత్తం బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడితే నువ్వేమో బీజేపీ, చంద్రబాబుతో కలిసి ఉంటవు.. నువ్వు కాంగ్రెస్ ఔట్ సోర్సింగ్ సీఎంవు అని ఎద్దేవా చేశారు. అసలైన కాంగ్రెస్ లీడర్ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందన్నారు. వైఎస్ఆర్ వీర విధేయుడినని చెప్పుకునే భట్టి, టీడీపీ మీద ప్రేమ చూపే రేవంత్ రెడ్డి ఇద్దరూ తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వారేనన్నారు. బొగ్గు స్కాంపై న్యాయస్థానాలకు వెళ్లి కొట్లాడుతం అని హరీష్‌రావు స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





