అంగరంగ వైభవం.. సీతారాముల కల్యాణం

– పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు
– లక్షలాదిగా విచ్చేసిన భక్తులు
– కిక్కిరిసిన మిథిలా స్టేడియం
– రేపు మ‌హా ప‌ట్టాభిషేకం

భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 27: దక్షణ అయోధ్య‌గా పిలుచుకునే భద్రాచలంలో శ్రీరామ నవమిని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కల్యాణం శుక్రవారం అత్యంత వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకొచ్చారు. స్వస్తిశ్రీ చాంద్రనామ పరాభవ నామ సంవత్సర చైత్రశుద్ధ నవమి అభిజిత్ లగ్నమందు లక్షలాదిగా తరలి వచ్చిన భక్తుల జైశ్రీరాం నినాదాలతో కల్యాణ మండపం మిథిలా స్టేడియం మారుమోగింది. ఉదయం 10 గంటల నుండి శ్రీ పాంచరాత్రాగమ విధానంలో శ్రీ సీతారామచంద్ర కల్యాణ మహోత్స‌వం మిథిలా స్టేడియం(కల్యాణ మండపం)లో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ప్రధాన ఆలయం నుండి ఉత్సవమూర్తులు సీతారామ, లక్ష్మణ, హనుమంతులను మంగళవాయిద్యాలతో వేద మంత్రాలతో ప్రత్యేక పల్లకిపై ఉదయం 10 గంటలకు కల్యాణం జరిగే మండపానికి తోడ్కొని వచ్చి ధగధగాయమానంగా వెలుగొందే వెండి సింహాసనంపై ఆశీనులను చేశారు. తొలుత మండపాన్ని శుద్ధి చేసి మంజునకి ప్రథమం అను మంత్రం జపిస్తూ యధాసుదర్శరాజా సంవత్సర్గం శ్రీయుద్యా ఆయుష్మే అనే సంకల్పంతో స్వామివారికి ఎదురుగా సీతమ్మవారిని కూర్చుండబెట్టి కన్యావరణాలు జరిపించి మోక్షబంధనం ప్రతిసారబంధం, ద్వితీయ, సువర్ణ యజ్ఞోపవీత ధారణలు జరిపించారు. అనంతరం ఆశీర్వచనం పాదప్రక్షాళనం, పుష్పోదక స్నవనం పూర్తి అయిన తర్వాత 10.20 నిమిషాలకు స్వామివారికి వరపూజ నిర్వహించారు. అనంతరం భక్త రామదాసు చేయించిన ఆభరణాలు పచ్చలపతకం, శ్రీరామమాడ, చింతాకుపతకం అమ్మవారికి అలంకరించి, శ్రీరంగనాధుడు పంపిన పట్టువస్త్రాలను అమ్మవారికి, స్వామివారికి అలంకరించారు. అత్తరు, పన్నీరు, దివ్యసుగంధ ద్రవ్యాలు, మంచిగంధం, అగరు, జవ్వారి, కస్తూరి, ఘనసారములతో తయారు చేసిన సుగంధ మాలికలను స్వామివారికి అలంకరించారు. అలాగే తేనె, పెరుగు కలిపిన పంచామృతాలను స్వామివారికి నివేదించిన పిమ్మట నూతన వస్త్రాలంకరణ చేశారు. విశ్వసృష్టిని దానితోనున్న కాలమును సంకల్పం చెప్పి 11.40 గంటలకు కన్యాదానం కరిష్యే అంటూ 12 గంటలకు అభిజిత్ లగ్నంలో స్వామివారు అమ్మవారి శిరస్సుపై జీలకర్రబెల్లం మిశ్రమాన్ని ఉంచారు. 12.30 గంటలకు కల్యాణం తంతునాభద్రాద్రి అంటూ మాంగల్యధారణ జరిపించారు. అనంతరం భక్తరామదాసు 17వ శతాబ్దంలో చేయించిన మంగళసూత్రధారణ జరిగింది. మూడు సూత్రాల విశిష్టతను వేదపండితులు భక్తజనావళికి వివరించారు. స్వామివారి కల్యాణం తిలకించేందుకు వచ్చిన లక్షలాదిమంది సీతారామచంద్రమూర్తులకు జయజయధ్వానాలు పలికారు.
కల్యాణాన్ని ప్రతీ ఒక్కరు తిలకించేందుకు గ్యాలరీల్లో క్లోజ్డ్ సర్క్యూట్ టీవీలు ఏర్పాటు చేశారు. ఆధ్వర్యులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, ప్రధానార్చకుడు అమరవాది విజయరాఘవన్, ఆచార్యులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, కోటి శ్రీమన్నారాయణాచార్యులు కల్యాణ మ‌హోత్స‌వాన్ని కమనీయంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాకిటి శ్రీహరి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, కొండా సురేఖ, ఎండోమెంట్ కమిషనర్ హనుమంత రావు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎంపీ పోరిక బలరాం నాయక్, న్యాయమూర్తులు, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా అయ్యర్, జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్  రాజ్, పీఓ బి.రాహుల్,

 అదనపు కలెక్టర్లు విద్యాచందన, వేణుగోపాల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, మీడియా ప్రతినిధులు హాజరయ్యారు.
టీటీడీ నుంచి పట్టువస్త్రాలు
భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణానికి తిరుమల తిరుపతి దేవస్ధానం నుంచి ఆనవాయితీగా పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల మధŠ్య ఆలయం నుండి ధ్రువమూర్తులను కళ్యాణ మండపం వద్దకు తోడ్కొని వస్తుండగా తిరుమల తిరుపతి దేవస్ధానం అధికారులు స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు వేదపండితులకు అందచేశారు.
రేపు పట్టాభిషేకం
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్ధానం ఆధ్వర్యంలో కల్యాణ మీVAత్సవంలో భాగంగా స్వామివారికి శనివారం మహా పట్టాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా హాజరుకానున్నారు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు  కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *